కరెంటు 10 గంటలే!

కరెంటు 10 గంటలే!
  • అందులోనూ రెండు, మూడు గంటలు కోతలే!!24 గంటల కరెంటు సరఫరా ఉత్తిమాటే!
  • నాణ్యమైన కరెంటు కూడా అందడం లేదు
  • ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు
  • ఐదేళ్లుగా ఇదే తీరు అంటున్న అన్నదాతలు
  • ఇంకా రాత్రిపూట పొలాల వద్దే రైతులు
  • సింగిల్ ఫేజుతో మోటార్లూ కాలిపోతున్నాయి
  • అటు డిస్కంలకు పేరుకుపోతున్న బకాయిలు
  • సర్కారుకు భారమవుతున్న ‘ఉచిత కరెంటు’
  • ‘ముద్ర’ క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే నిజాలు

  • బడ్జెట్ లో వ్యవసాయరంగానికి కేటాయింపులు
    2016–17లో : రూ. 6,611 కోట్లు
    2022–23లో : రూ. 27,228 కోట్లు
    2014–15 నుంచి 2021–‌=22 వరకు సబ్సీడీ : రూ. 36,890 కోట్లు
    ‌‌===============================================
  • రాష్ట్రంలో సాగు విస్తీర్ణం
    ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌2014–15లో : 131 లక్షల ఎకరాలు
    2021–=22లో : 198 లక్షల ఎకరాలు
    ‌‌================================================
    2021–22 నాటికి వ్యవసాయ కరెంటు కనెక్షన్లు : 26.96 లక్షలు.
    వ్యవసాయ మంత్రి సొంత జిల్లాలోనే అత్యధికంగా 2.19 లక్షల కనెక్షన్లు
    ================================================

  • పొలంలోనే ఉంటున్నం 

వ్యవసాయానికి కరెంట్​ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. పంటకు నీరివ్వాలంటే పొలంలోనే ఎక్కువ సేపు ఉండాల్సి వస్తున్నది. ఒకవేళ కరెంటు వచ్చినా, అప్పుడప్పుడు సింగిల్ ఫేజ్ఇస్తున్నారు. దీంతో మోటార్లు కాలిపోతున్నయి. నీళ్లు అందక పంటలు పోతున్నయి. మండలంలో రోజుకు తొమ్మిది గంటలు కూడా కరెంటు​సరఫరా కావడం లేదు. – రామారావు, - తాండ్ర. సారంగాపూర్ మండలం 

ముద్ర, న్యూస్ నెట్ వర్క్ : వ్యవసాయానికి నిరంతర ఉచిత కరెంటు ఉత్తిదేనని తేలింది. వందలాది గ్రామాలలో పది గంటలకు మించి త్రీఫేస్ కరెంట్​అందడం లేదు. ప్రస్తుతం ఇస్తున్న ఆ పది గంటల కరెంటు సరఫరాలోనూ  ట్రాన్స్​ఫార్మర్లు ట్రిప్ అవుతున్నాయని అక్కడక్కడ రైతులు గగ్గోలు పెడుతున్నారు. సింగల్ ఫేస్ సరఫరాతోనూ వ్యవసాయ మోటార్లు పని చేయని దుస్థితి నెలకొన్నది. అప్రకటిత కోతలతో నీటి తడి లేక పంటలు దెబ్బతింటుంటే, వాణిజ్య పంటలు వేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. త్రీఫేజ్ కరెంట్ ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సరఫరా చేయాల్సి ఉండగా మధ్యలో కోత పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘వ్యవసాయానికి నిరంతర ఉచిత కరెంటు’ అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్​నేతల విమర్శలు ప్రతివిమర్శల నేపథ్యంలో రాష్ట్రంలో కరెంటు సరఫరా పరిస్థితిని తెలుసుకునేందుకు ‘ముద్ర’ గురువారం పలు గ్రామాలలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. ఇందులో ఊహించని నిజాలు వెలుగుచూశాయి. 

  • రాజకీయ వివాదం

‘గతంలో కరెంట్​ఉంటే వార్త.. ఇప్పుడు కరెంట్​పోతే వార్త’ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ఇటీవల చేసిన వ్యాఖ్యలివి. ఇప్పడు ఇదే అంశం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. తెలంగాణలో 95శాతం మంది రైతులు మూడెకరాల వ్యవసాయ భూమి కలిగిన ఉన్నారన్న టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి ఎకరాకు గంట చొప్పున మూడు గంటల విద్యుత్​ఇస్తే సరిపోతుందని ఇటీవల అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో పెద్ద దుమారాన్నే లేపాయి. రేవంత్​వ్యాఖ్యలపై మండిపడ్డ బీఆర్ఎస్​ఆ అంశాన్ని అస్త్రంగా చేసుకుని పెద్ద ఉద్యమాన్నే చేపట్టింది. రేవంత్​దిష్టిబొమ్మలను దగ్గం చేసింది. దీనిపై కాంగ్రెస్ సైతం కౌంటర్​ఇచ్చింది. వ్యవసాయానికి 11 గంటల కంటే ఎక్కువగా నిరంతర కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సవాలు కూడా విసిరారు. ఇటు 24 గంటల కరెంటు ముసుగులో ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందన్న రేవంత్​రెడ్డి 24 గంటల ఉచిత కరెంటు సరఫరాపై కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి ఇచ్చిన సవాల్ ను స్వీకరించాలంటూ బీఆర్ఎస్​మంత్రులు కేటీఆర్, హరీశ్​రావుకు అల్టిమేటం జారీ చేశారు.

  • ఇదీ పరిస్థితి

2022 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 26.96 లక్షల పంపుసెట్లు  ఉన్నాయి. వీటికి కరెంట్ అందించడానికి ప్రభుత్వం డిస్కంలకు ఎనిమిదేళ్ల కాలంలో రూ.30,155 కోట్లు చెల్లించింది. 2020– -21లోనే  రూ.7,565 కోట్ల మేర ఖర్చు అయినట్లు ఇటీవల విద్యుత్ నియంత్రణ మండలికి అందిన నివేదిక స్పష్టం చేసింది. ఎత్తిపోతల పథకాలు, ప్రభుత్వ సంస్థల బకాయిలు, వ్యవసాయానికి కరెంటు కారణంగా డిస్కమ్‌లకు బకాయిలు, యేటికేటికీ నష్టాలు పెరగడంతోనూ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంట్ ను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర్ లోని గోదావరి పరీవాహక ప్రాంతంలో రైతులు మిర్చి, మొక్కజొన్న, కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. పక్కనే ఉన్న గోదావరిలో కరెంట్ మోటార్లతో నీటిని తోడి తమ భూములకు చేరవేసుకుంటున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టు తమకు 24 గంటల నిరంతర కరెంట్ అందడం లేదని ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు. 12 గంటలు కూడా ఇవ్వడం లేదంటున్నారు.  తొమ్మిది లేదా పది గంటలు ఇస్తున్నా అందులోనూ కోతలు ఉంటాయని చెబుతున్నారు. కరెంట్ సరఫరా ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందని నెల్లిపాక బంజర్​కు చెందిన సురకంటి ప్రభాకర్ అనే రైతు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో వ్యవసాయ రంగానికి ఇస్తున్న కరెంటు సరఫరాపై రైతులు పెదవి విరుస్తున్నారు. 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ, నడుమ నడుమ పోతోందని చాలా మంది రైతులు వాపోతున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా కరెంటు సరఫరా జరుగుతుందని,  ఏడు గంటల సరఫరాలోనూ తరుచూ కోతలు ఉంటున్నాయని రైతులు తెలిపారు. ఉదయం నాలుగు గంటలు సాయంత్రం మూడు గంటలు సరఫరా జరుగుతుందని, రాత్రి సింగిల్ ఫేస్​ సరఫరా చేస్తున్నారని  భీమారం రైతులు చెబుతున్నారు.

  • రాత్రి 12 గంటలకు సరఫరా 

రాత్రి 12 గంటలకు కరెంటు ఇస్తున్నరు. నడుమ ఎప్పుడు తీస్తరో తెలవదు. నీళ్లు పట్టేందుకు రాత్రి కరెంటు వచ్చే దాక పొలంలోనే ఉంటున్నాం. తెల్లారి కరెంట్​ఎప్పడు తీస్తారో కూడా తెలవదు. రోజుకు 9 గంటలు కూడా ఉంటలేదు. – దిమ్మదుర్తి పోచన్న, -మామడ మండలం, నిర్మల్​జిల్లా 

  •  నిరంతర సరఫరా లేదు

మాకు పది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి, కందులు, పెసర్లు సాగు చేస్తున్న. పంటకు నిరంతర కరెంటు అందడం లేదు. ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి నుంచి ఎనిమిది గంటల వరకు,  ఉదయం పది గంటల నుంచి పగలు పన్నెండు గంటల వరకు, సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు కోతలతో కరెంటు సరఫరా అవుతుంది.–(సామల చంటి, బొక్కల గుట్ట, మంచిర్యాల జిల్లా).

  • అందుతుంది పది గంటలే

మాది జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట. మా గ్రామంలో 2,500 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.1500 ఎకరాలలో మొక్కజొన్న, పసుపు, సజ్జ, వరి పండిస్తున్నారు. సాగుకు కేవలం పది గంటల కరెంటు మాత్రమే సరఫరా అవుతుంది. అందులో నుంచి రెండు, మూడు గంటల పాటు కోతలు విధిస్తున్నారు. గత ఐదేళ్లుగా నాణ్యమైన కరెంటు​సరఫరా కావడం లేదు. కాలువల నుండి నీటిని విడుదల చేయకపోవడంతో రబీ పంట దిగుబడి తగ్గి.. పెట్టిన పెట్టుబడి కూడా రైతుకు రావడం లేదు. –(తుమ్మల లింగారెడ్డి, వేంపేట మండలం, జగిత్యాల జిల్లా).