రేషన్​ డీలర్లతో మొదలైన చర్చలు

 రేషన్​ డీలర్లతో మొదలైన చర్చలు
  • సమ్మె విరమించేందుకు ససేమిరా
  • 22 డిమాండ్లపై చర్చిస్తున్న మంత్రి గంగుల

ముద్ర, తెలంగాణ బ్యూరో : రేషన్​ డీలర్ల సమ్మెపై ప్రభుత్వం దిగివచ్చింది. దాదాపు 10 రోజుల నుంచి రేషన్​ డీలర్లు సమ్మె చేస్తున్నారు. సమ్మె నోటీసు ఇచ్చినప్పుడు డీలర్ల అసోసియేషన్​తో మంత్రి గంగుల కమలాకర్​ చర్చించారు. తమ డిమాండ్లపై మంత్రి నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మెకు వెళ్తామని డీలర్లు ప్రకటించారు. కానీ, ప్రభుత్వం మాత్రం సమ్మె వాయిదా వేస్తున్నారంటూ చెప్పింది. రేషన్​ డీలర్లు మాత్రం సమ్మెకు దిగి, షాపులకు తాళాలు వేశారు. ఈ నెల మొదటి నుంచి బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా, డీలర్లు కనీసం డీడీలు కూడా తీయలేదు. ఈ నేపథ్యంలోనే  మంత్రి గంగుల కమలాకర్​ నేతృత్వంలో మంగళవారం చర్చలకు పిలిచారు. ఈ సందర్భంగా డీలర్లు సమ్మె విరమించకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని మంత్రి ప్రకటించారు. 

అయితే, చర్చల సందర్భంగా రేషన్​ డీలర్లు 22 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. వీటిలో 2‌‌0 డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అమలుకు సాధ్యం కాని డిమాండ్లపై మొండి పట్టు పట్టడం సరికాదని మంత్రి డీలర్లకు సూచించారు. వెంటనే రేషన్​ షాపులు తెరిచి, సరుకులు పంపిణీ చేయాలని, ప్రభుత్వానికి సహకరించాలని గంగుల వారిని కోరారు. దీనిపై డీలర్లు ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.