బొందల గడ్డగా మారుతున్న వాగులు..

బొందల గడ్డగా మారుతున్న వాగులు..
  • మట్టి తేలే వరకు తోడేస్తున్న ఇసుక..
  • వాగొడ్డున అడ్డగోలుగా డంపులు..
  • భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం..
  • ళ తప్పుతున్న వాగులు.. 
  • పర్మిషన్ల పేరిట పట్టణాలకు అక్రమ తరలింపు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాగులు బొందల గడ్డగా మారుతున్నాయి. అడుగు మట్టి తేలే వరకు అక్రమార్కులు ఇసుకను దర్జాగా తోడేస్తున్నారు. పర్మిషన్ పేరిట పట్టణాలకు తరలించి అమ్ముకుంటున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి రాత్రింబవాళ్లు ఇసుకను అడ్డదారిలో అమ్ముకుంటున్నారనే ఆరోపణలు జిల్లాలో గుప్పుమంటున్నాయి. ఇసుక క్వారీలపై అధికారుల నిఘా కొరవడంతో క్వారీల కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తున్నారు. వందల కొద్ది లారీలను వాగుల వద్దకు తరలించి జెసిబీ యంత్రాలతో ఇసుకను అట్టడుగు భాగం వరకు తోడేస్తుండడంతో వాగులు తమ రూపురేఖలను కోల్పోతున్నాయి. బొందల గడ్డగా మారుతూ, రానున్న రోజుల్లో వాగుల ఉనికి కోల్పోయేంత పని చేస్తున్నారు.

గాలికొదిలేసిన నిబంధనలు..

 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని టేకుమట్ల, చిట్యాల, మలహర్, మహాదేవపూర్ తదితర మండలాల సరిహద్దు ప్రాంతాల్లో గల వాగులు, నదుల్లో ఉన్న ఇసుకను అక్రమార్కులు వ్యాపారంగా మలుచుకొని కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. రోజుకు వందల లారీలలో ఇసుకను తోడేస్తూ పట్టణాలకు తరలిస్తూ విక్రయిస్తున్నారు. నిబంధనల మేరకు ఇసుకను తరలించాల్సి ఉండగా, రాత్రింబవళ్లు ఇసుకను తరలించడమే కాకుండా, అదనపు బకెట్ తో అదనపు ఆదాయం గడిస్తున్నారు. అదేవిధంగా వాగులోకి మట్టి రోడ్లను ఏర్పాటు చేసుకొని జెసిబీ లతో ఇసుకను తోడేస్తున్నారు.

వాగొడ్డున అక్రమ డంపులు.. జిల్లాలోని ఆయా వాగుల్లో ఇసుకను అక్రమ మార్గంలో తోడేస్తున్నారు. లారీల్లో పోయడమే కాకుండా రాత్రింబవళ్లు వాగొడ్డున ఇసుకను అక్రమంగా డంపు చేస్తున్నారు. వాగులో మట్టి రోడ్లు ఏర్పాటు చేసుకొని వాగులో సుమారు 6 నుండి 10 ఫీట్ల లోతు వరకు అట్టడుగు భాగం వరకు ఇసుకను తోడేస్తున్నారు. దీంతో వాగులో ఇసుక అనేది లేకుండా పోయి బొందల గడ్డగా మారుతున్నాయి. చెరువులు, కుంటలను తలపిస్తున్నాయి. వాగొడ్డున లక్షల టన్నుల ఇసుకను రాత్రి వేళల్లో అక్రమ డంపులు చేస్తూ అక్రమ మార్గంలో పట్టణాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.

కరువైన అధికారుల నిఘా..

అక్రమ ఇసుక రవాణా పై అధికారుల నిఘా కరువైంది. ట్రాక్టర్ లు, లారీల్లో అక్రమంగా ఇసుక రవాణా అవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. చెక్ పోస్టులు సరైన మార్గాల్లో లేకపోవడం అక్రమార్కులకు కలిసి వస్తుంది. దొడ్డిదారుల్లో ఇసుకను పట్టణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల తనిఖీలు లేకపోవడం కారణంగా అక్రమార్కులు నిబంధనలకు తూట్లుపొడుస్తూ, యథేచ్చగా ఇసుక దందా నడిపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేసి, అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై కొరడా జులిపించాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు.