నిరుద్యోగులను మోసం చేశారు

నిరుద్యోగులను మోసం చేశారు
  • మేం చూస్తూ ఊరుకోబోం
  • బీజేపీ అధికారంలోకి వస్తే ఉద్యోగాల భర్తీ
  • తెలంగాణ కోసం యువత తెగించి కొట్లాడారు
  • 24 గంటల ఉపవాస దీక్షలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • సాయంత్రం కిషన్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు


ముద్ర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమంలో తెగించి పోరాడింది నిరుద్యోగ యువతేనని, నిరుద్యోగులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమనీ కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హెచ్చరించారు.  తొమ్మిదేళ్లుగా నిరుద్యోగ యువతను బీఆర్ఎస్ సర్కార్ మోసం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. 1969లో ఉద్యోగాలు, భవిష్యత్ కోసం తెలంగాణ యువత అనేక పోరాటలు చేస్తే 369 మందిని కాంగ్రెస్ ప్రభుత్వ కాల్చిచంపిందని గుర్తు చేశారు. వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయాలనే డిమాండ్ తో బీజేపీ నేతలు బుధవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 24 గంటల ఉపవాస దీక్షలు చేపట్టారు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులు తినడానికి తిండిలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం కొట్లాడిన నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. తెలంగాణ కోసం1200 మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకున్నారన్నారు. అందరికంటే ముందు కేసీఆర్​ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి పెట్రోల్​ పోసుకున్నాడని, కానీ, ఆయనకు ఇంతవరకు అగ్గిపెట్టే  దొరకలేదని పరోక్షంగా మంత్రి హరీశ్ రావును విమర్శించారు. ఆత్మబలిదానాలు చేసుకున్న వందల మంది యువకుల కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయన్నారు. నిరుద్యోగ యువత పట్ల రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.  తెలంగాణ వస్తే వర్సిటీలలో లెక్చరర్ల పోస్టులు, స్కూళ్లు, కాలేజీల్లో టీచర్ల పోస్టులు భర్తీ అవుతాయని, తమకు ఉద్యోగాలు వస్తాయని యువత భావించారని. వారికి నిరాశే మిగిలిందని అన్నారు. ప్రభుత్వ పెద్దల అవినీతి, చేతకానితనం వల్ల ప్రశ్నపత్రాలు లీకై లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్​ ఆగమైందన్నారు. తెలంగాణకు నీళ్లు రాలేదు కానీ, చేపట్టిన, చేపడుతున్న ప్రాజెక్టులలో కమీషన్లతో ప్రజాధనం కొల్లగొట్టారని కిషన్ రెడ్డి విమర్శించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇవాళ అప్పులపాలై దివాళా తీసే స్థితికొచ్చిందన్నారు.  కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుందని చెప్పారు.  ప్రతీ నెలా 70 నుంచి 80 వేల ఉద్యోగాలు రిక్రూట్​ చేస్తూ ప్రధాన మంత్రి స్వయంగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్నారన్నారు. .

నవంబర్ లో కేసీఆర్ మకిలి వీడుతుంది 

ఈ యేడాది నవంబరుతో తెలంగాణ కు పట్టిన కేసీఆర్ అనే మకిలి వీడుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. నిరుద్యోగ సమస్యలపై బీజేపీ చేస్తున్న పోరాటంతోనైనా కేసీఆర్ సర్కార్ నిద్ర లేవాలన్నారు.  కేసీఆర్ ప్రభుత్వం చేసిన అరాచకాలను ప్రశ్నించిన బండి సంజయ్ ను జైలులో పెట్టారన్నారు. పదేళ్లుగా అరాచకాలు చేస్తున్న కుటుంబాన్ని తెలంగాణ నుంచి పారద్రోలాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో నిరుద్యోగ యువత ప్రాణాలను కేసీఆర్ బలిగొన్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. 12 వందల మంది ఉసరుపోసుకుని గద్దెనెక్కిన చరిత్ర కేసీఆర్ ది అని అన్నారు. సర్వీస్ కమిషన్ నిర్వహించిన వివిధ రకాల పరీక్షా పత్రాలను లీక్ చేసినవారిపై చర్యలు తీసుకోవడం లేదంటే, దానిలో ప్రభుత్వ హస్తం ఉన్నట్లు ఆర్థమవుతోందని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే లబ్ధి పొందేందుకు కేసీఆర్ మాయమాటలు చెబుతారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను ఇంకెంతకాలం మోసం చేస్తావు కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో విప్లవం మొదలైందని, కేసీఆర్ పతనం తథ్యమని పేర్కొన్నారు.

దీక్ష భగ్నం.. కిషన్​ రెడ్డి అరెస్ట్​

నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్న కిషన్ రెడ్డిని పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి కిషన్ రెడ్డి 24 గంటల ఉపవాస దీక్షకు కూర్చొన్న సంగతి తెలిసిందే. గురువారం వరకు దీక్ష చేస్తానని కిషన్ రెడ్డి పట్టుబట్టారు. అయితే సాయంత్రం ఆరు గంటల వరకే అనుమతి వుందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో దీక్షా వేదిక చుట్టూ మోహరించిన పోలీసులు కిషన్ రెడ్డిని అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా దీక్షను భగ్నం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు.  శాంతియుతంగా దీక్ష చేస్తుంటే ఇబ్బంది ఏంటని పోలీసులను ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన దీక్షను కొనసాగిస్తానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. ఈ పరిణామాలతో ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.