నవంబర్ లో గ్రూప్–2

నవంబర్ లో గ్రూప్–2
  • 2, 3 తేదీల్లో పరీక్షలు 
  • అభ్యర్థుల ఆందోళనతో దిగొచ్చిన టీఎస్పీఎస్సీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆగస్టులో జరగాల్సిన గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ రీ షెడ్యుల్ ను ప్రకటించడంతో అభ్యర్థులకు పెద్ద ఊరట లభించింది. పరీక్షలను నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు అదివారం సర్వీస్​కమిషన్ ప్రకటన విడుదల చేసింది. మొత్తం రెండు సెషన్లలో గ్రూప్–2 పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 .30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్స్ ను కమిషన్ అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతామని టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 738 గ్రూప్–2 ఉద్యోగాలకు 5 లక్షల 51 వేల 943 మంది దరఖాస్తు చేశారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు.

తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌–2 పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఆగస్టులో గురుకుల టీచర్‌ పరీక్షలు, స్టాఫ్‌నర్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్స్‌, పాలిటెక్నిక్‌, జూనియర్‌ లెక్చరర్‌, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్‌ తదితర పోటీ పరీక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో గ్రూప్‌–2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. ఒకే నెలలో ఇన్ని పరీక్షలు ఉండటంతో అన్నింటికీ హాజరుకాలేమని, ప్రిపరేషన్ కు సమయం సరిపోదని అభ్యర్థులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, కార్యదర్శితో సమావేశం అయ్యారు. అన్ని అంశాలపై చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్ కు నివేదిక అందజేశారు. ఈమేరకు పరీక్షలను నవంబర్ కు వాయిదా వేసి తాజాగా కొత్త తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది.