ఎంపీ సోయంకు  ఆదివాసీల సెగ

ఎంపీ సోయంకు  ఆదివాసీల సెగ
  • బాపూరావు వ్యాఖ్యలపై తుడుందెబ్బ ఆగ్రహం
  • బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్​
  • లేఖలు రాస్తే సరిపోదని వ్యాఖ్య
  • కొమురంభీం చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం

ముద్ర, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమురంభీం కాలనీలో నిర్వహించిన సభలో ఎంపీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గుడిసెల్లో జీవిస్తున్న మహిళలపై సోయం అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆదివాసీలు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. 
‘కొమురంభీం కాలనీలోని మహిళలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ జాతికి చెడ్డ పేరు తెస్తున్నారనే అర్థం వచ్చేలా ఎంపీ మాట్లాడారని తెలిపారు. తక్షణం సోయం బాపూరావును క్షమాపణ చెప్పాలని తుడం దెబ్బ డిమాండ్ చేసింది. 

  • రెండు వర్గాలుగా ఆదివాసీలు..

ఎంపీ సోయం చేసిన కామెంట్లతో ఆదివాసీలు రెండు వర్గాలుగా చీలిపోయారు. సొంత సామాజికవర్గానికి చెందిన మహిళలను అవమానిస్తూ మాట్లాడాడని, ఎంపీ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ తుడుందెబ్బ సోయంకు వార్నింగ్ ఇవ్వడం మరింత మంటలు రాజేస్తోంది. అయితే సోయం బహిరంగ లేఖ విడుదల‌ చేశారు. దీంతో విడుదల చేయాల్సింది లేఖలు కాదని, బహిరంగ క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని తుడుందెబ్బ లీడర్లు డిమాండ్​చేశారు. అనంతరం తుడుందెబ్బ ఆదివాసీ మహిళలతో కలిసి ఆందోళ‌లనకు పిలుపు నిచ్చింది. ఆదివానం కొమురంభీం చౌరస్తా లో ఎంపీ దిష్టిబొమ్మ దహనం చేయడంతోపాటు ఆదివాసీ మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఐదు రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే నాలుక కోస్తామంటూ తుడుందెబ్బ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేయడం మరింత కాక రేపాయి.  

  • చివరి శ్వాస వరకు పోరాడతా : సోయం

ఆదివాసీ మహిళలంటే తనకు తల్లులతో సమానం అని ఎంపీ సోయం తెలిపారు. ‘నా వాళ్లను‌ నేను గౌరవంగా బతికేలా పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తున్నా. తాను జాతి కోసం పోరాడుతుంటే తనపై నిందారోపణ లు శోచనీయం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరి శ్వాస వరకు ఆదివాసీ జాతి కోసం పోరాడుతూనే ఉంటానంటూ ఎంపీ బాపురావు తెలిపారు. అయితే బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని తుడుందెబ్బ కరాఖండీగా పేర్కొంది.