‘బండి’ కమిటీలు రద్దు ?

‘బండి’ కమిటీలు రద్దు ?
  • హైకమాండ్​కు ఎలెక్షన్స్​డిప్యూటీ ఇన్​చార్జి బన్సల్​నివేదిక?
  • కమిటీ సభ్యుల వద్ద సంజయ్​డబ్బులు వసూలు చేశారని ఆరోపణ
  • హైకమాండ్​కు మరో నివేదిక ఇవ్వనున్న ఆర్ఎస్ఎస్
  • కిషన్​రెడ్డి అమెరికాలో ఉన్నపుడే పూర్తి?


ముద్ర, తెలంగాణ బ్యూరో : బీజేపీ స్టేట్​చీఫ్​గా కిషన్​రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్ర బీజేపీ నేతల్లో పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. పార్టీలో సీనియర్లుగా ఉన్నా ఇప్పటివరకు తమకు పెద్దగా పదవులు రాలేదని చాలా మంది కిషన్​రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. దీంతో సంస్థాగతంగా రాష్ట్రస్థాయి కమిటీలు, జిల్లా కమిటీలు, అంసెబ్లీ ఇన్​చార్జిలను ఎన్నుకోవాలని అందరూ భావిస్తున్నట్లు సమాచారం. కానీ ఇప్పటికే ఎంపీ బండి సంజయ్​ కమిటీలు వేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీ, అసెంబ్లీ ఇన్​చార్జిలందర్నీ నియమించారు. ఏమైనా ఉంటే రాష్ట్రస్థాయి కమిటీల్లో పోస్టులను పెంచుకునే అవకాశమున్నది. వీటిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీటిపై కిషన్​రెడ్డిపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతున్నట్లు సమాచారం.

  • కమిటీల నియామకాల్లో చేతివాటం?

బండి సంజయ్ వేసిన రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి కమిటీ, అసెంబ్లీ ఇన్​చార్జిలపై చాలా రకరకాలుగా ఆరోపణలు వస్తున్నట్లు తెలిసింది. ఈ కమిటీల్లో సీనియర్లు లేరని, ఎవరికి పడితే వారిని కమిటీల్లో వేసినట్లు తెలిసింది. కమిటీల్లో చాలావరకు కాపు సామాజికవర్గంవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. చాలా మంది ఎన్నో ఏళ్లుగా పార్టీకి పనిచేసిన వారిని కాదని అసెంబ్లీ ఇన్​చార్జిలుగా ఇచ్చారని సమాచారం. అసెంబ్లీ ఇన్​చార్జిలను నియమించడంలో కూడా పెద్ద గూడుపుఠానీ జరిగినట్లు తెలిసింది. కోట్ల రూపాయలు ఇచ్చినవారికే అసెంబ్లీ ఇన్​చార్జిలు, రాష్ట్రస్థాయి హోదాలు దక్కినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బంతా బండి సంజయ్ తీసుకున్నారని, ఇపుడు కొత్త కమిటీలు వస్తున్నట్లు తెలియడంతో బండికి డబ్బులిచ్చినవారు పరేషాన్​ లో ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ కమిటీలను ఏం చేయాలనే అంశంపై  కూడా పార్టీలో చర్చలు జరుగుతోందని, బండి సంజయ్ వేసిన కమిటీలను రద్దు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలిసింది. 

  • ఆర్ఎస్ఎస్​మరో నివేదిక..

బండి సంజయ్ వేసిన కమిటీలపై ఆర్ఎస్ఎస్ కూడా పూర్తిస్థాయిలో నివేదికను హైకమాండ్​కు ఇవ్వనున్నది. ముందుగా బండి సంజయ్​బాగా పనిచేస్తున్నారని ఆర్ఎస్ఎస్​అనుకున్నది. కానీ దీనికి సంబంధించిన ఆరోపణలు, నిధుల సమీకరణతో ఆర్ఎస్ఎస్​కూడా పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని భావించినట్లు తెలిసింది. బండి వసూళ్లు చేసిన నిధులు పార్టీ కోసమా...లేదా సొంతంగా వినియోగించుకున్నారా అనే అంశంపై ఆర్ఎస్ఎస్​ నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. ఒకవేళ పార్టీ కోసమైతే ఆయనపై ఎలాంటి ఆర్థిక వనరుల సమీకరణపై ఆరోపణలు లేనట్లుగా ఆర్ఎస్ఎస్ ఇవ్వనున్నట్లు తెలిసింది. సొంతంగా వాడుకున్నట్లయితే వాటిని మళ్లీ పార్టీ ఖాతాల్లోకి వేయాలని ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై పూర్తిగా పరిశీలించిన తర్వాతే నివేదికను రూపొందించనున్నట్లు తెలిసింది. అయితే రాష్ట్ర ఎన్నికల సహా ఇన్​చార్జి సునీల్​బన్సల్​కూడా బండి సంజయ్​పై పూర్తిస్థాయిలో నివేదిక హైకమాండ్​కు ఇచ్చినట్లు తెలిసింది. దీని ఆధారంగానే బండి సంజయ్​ను అధ్యక్షుడిగా మార్చినట్లు సమాచారం. ఈ నివేదికపై కూడా ఆర్ఎస్ఎస్ పూర్తిస్థాయిలో పరిశీలించనున్నట్లు తెలిసింది. ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయితో బాటు సునీల్​బన్సల్​నివేదికపై కూడా పరిశీలించనున్నట్లు తెలిసింది. కిషన్​రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే బండి సంజయ్ వేసిన కమిటీలపై నివేదికను ఆర్ఎస్ఎస్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈనెల 19న తిరిగి కిషన్​రెడ్డి హైదరాబాద్​కు రానున్నారు. దీంతో కిషన్​రెడ్డి వచ్చేలోపు కమిటీలను రద్దు చేస్తారని, వచ్చాక కొత్త కమిటీలను వేయనున్నట్లు సమాచారం.