కేసీఆర్ విముక్త తెలంగాణకు కృషి చేద్దాం.. వీర్లపల్లి శంకర్

కేసీఆర్ విముక్త తెలంగాణకు కృషి చేద్దాం..  వీర్లపల్లి శంకర్
kcr

కేసీఆర్ విముక్త తెలంగాణకోసం ప్రజలు కాంగ్రెస్ తో కలిసి అడుగులు వేయాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ కోరారు. కొత్తూరు మండలం జేపీ దర్గాలో పాలమూరు గ్రంథాలయాల కమిటీ జిల్లా మాజీ  చైర్మన్ ఆగిర్ రవికుమార్ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వీర్లపల్లి శంకర్ పాల్గొని మాట్లాడారు. అంతకుముందు కొత్తూరు మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వీర్లపల్లి మాట్లాడుతూ..ఎన్నికల కురుక్షేత్రం మొదలైందని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్బీ అక్రమాలకు కాలం చెల్లిందన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్ఫూర్తితో హత్ సే హత్ జోడో కార్యక్రమంతో ఎన్నికల్లో విజయభేరి మోగిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఆలోచించి అడుగులు వేయాలని అన్నారు. ప్రతిపల్లెలో వాడవాడ నుండి కదలాలని సూచించారు. నియోజకవర్గంలో ఏ వర్గానికి స్వేచ్ఛ లేదని దౌర్జన్య పాలన నుండి విముక్తి లభించాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య విభేదాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటిదని కన్నతల్లి లాంటి పార్టీని కాపాడుకుంటే ప్రజలు మనుగడ సాగిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుపు తమదేనని తమ విజయాన్ని ఏ శక్తి ఆపలేదన్నారు. అధికార పార్టీ ఆగడాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చడంలో బీఆర్ఎస్ పార్టీ చతికిల పడిందన్నారు. పవిత్ర జేపీ దర్గాలో మెత్తని బిర్యాని తిన్న కేసీఆర్ మెల్లగా కల్లబొల్లి హామీలు గుప్పించి చల్లగా జారుకున్నారన్నారు. దర్గాలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రూ.100 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పిన కేసీఆర్ అభివృద్ధి ఏమైందని ప్రశ్నించారు. మాటలు తప్ప చేతలు లేని బీఆర్ఎస్ పార్టీ ఆగడాలను హజరత్ జహంగీర్ పీర్ దర్గా సాక్షిగా భక్తులు, ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ఫరూక్ నగర్, కొత్తూరు, కొందుర్గు, కేశంపేట, నందిగామ, చౌదరిగుడా, షాద్ నగర్ ప్రాంతాల నుండి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి.