పెట్టుబడులు తీసుకురావడం ఆషామాషీ కాదు

పెట్టుబడులు తీసుకురావడం ఆషామాషీ కాదు
  • ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రానికి క్యూ కడుతున్న కంపెనీలు 
  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ 

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకరావడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అమితమైన ఆసక్తిని చూపిస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతోందని, కేవలం తొమ్మిదేళ్లలోనే దేశ, విదేశీ కంపెనీల పెట్టుబడులకు రాష్ట్రం గమ్యస్థానంగా మారిందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం టీ హబ్ లో పరిశ్రమల శాఖ నిర్వహించిన రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి ఉత్సవం కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. దేశ విదేశాల నుంచి రాష్ట్రాల వరకు పోటీపడి మరీ పెట్టుబడులను ఇక్కడికి రప్పించాల్సి ఉంటుందన్నారు. దీని కోసం ఇటీవల విదేశీ పర్యటన చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో యువతకి సాధ్యమైనన్ని ఎక్కువ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న తపనతో  విదేశీ  పర్యటనలో కష్టపడేటట్లు చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం విదేశాల్లో పెద్దఎత్తున చేపట్టే నిరంతర సమావేశాలకు అక్కడి పారిశ్రామిక వర్గాలు, దౌత్య వర్గాల నుంచి అనేకసార్లు ప్రశంసలు లభించాయన్నారు. ఇందుకు పరిశ్రమల శాఖ బృందంలోని ప్రతి ఒక్క అధికారికి ధన్యవాదాలు తెలుతున్నట్లు పేర్కొన్నారు.

అత్యధిక తలసరి ఆదాయం రాష్ట్రానిదే..
ప్రస్తుతం 3 లక్షల 17 వేలతో తెలంగాణ దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయాన్ని కలిగి ఉందన్నారు. రాష్ట్ర జీఎస్ డీపీ 2014 లో ఉన్న 5 లక్షల కోట్ల నుంచి ప్రస్తుతం 13.27 లక్షల కోట్లకు చేరిందన్నారు. రాష్ట్రం ఆవిర్భవించే నాటికి ఐటి ఎగుమతులు కేవలం 57 వేల కోట్ల ఉండగా, అది కాస్త ఇప్పుడు  2.40 లక్షల కోట్లకు చేరిందన్నారు. తెలంగాణ మోడల్ అంటే సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య మోడల్ అని ఈ సందర్భంగా కేటీఆర్ అభివర్ణించారు. ఒకవైపు పారిశ్రామిక ప్రగతితో పాటు ఆర్థిక ప్రగతి, సామాజిక ప్రగతిని సమాంతరంగా ముందుకు తీసుకెళుతున్నామన్నారు. ఐటీ రంగం నుంచి మొదలుకొని వ్యవసాయ రంగం దాకా అన్ని రంగాల్లోనూ తెలంగాణ తన ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నదన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక వర్గాలు అనే తేడా లేకుండా అందరి ప్రగతికి పాటుపడుతున్నదన్నారు. 

వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ గా..
వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ గా తెలంగాణ మారిందని కేటీఆర్ తెలిపారు. వచ్చే సంవత్సరం నాటికి ప్రపంచంలోనే సగానికిపైగా వ్యాక్సిన్లు, హైదరాబాద్​లో తయారు అవుతాయన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి అద్భుతమైన స్పందన పారిశ్రామిక వర్గాల నుంచి వస్తున్నదన్నారు. జినోం వ్యాలీ తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగ ప్రగతికి దోహదపడినట్లుగానే రాష్ట్ర మొబిలిటీ వ్యాలీ ఆటోమొబైల్ రంగంలోనూ ప్రగతికి దోహదపడుతుందన్న నమ్మకం ఉన్నదన్నారు. ఐటీ రంగంలో 3.23 లక్షల మంది ఉద్యోగుల నుంచి నేడు 9.5 లక్షలకు దాదాపు మూడు రెట్ల మీద పెరిగాయని కేటీఆర్​అన్నారు.