స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ కల్లూరు సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ  కల్లూరు సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్

ముద్ర ప్రతినిధి, ఖమ్మం/కల్లూరు/సత్తుపల్లి: రాష్ర్రంలో 15 వేల మినీ స్టేడియంలలో 13,570 పూర్తి చేశామని, క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణా పురోగమిస్తుందని రాష్ట్ర ప్రొహిబిషన్, యువజన, క్రీడలు, పర్యాటక శాఖ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అధ్యక్షతన ఖమ్మం జిల్లా కల్లూరు, సత్తుపల్లి లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి సహా  ఎంపీలు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు హైదరాబాదు నుండి హెలికాప్టర్ లో కల్లూరు చేరుకున్నారు. ఇక్కడ రూ.3.40 కోట్ల వ్యయంతో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియాన్ని, ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... దేశంలో దమ్మున్న నాయకుడు కేసీఆర్ అన్నారు. భవిష్యత్ లో మరింత అభివృద్ధి కావాలంటే పని చేసే  సత్తా ఉన్న కేసీఆర్ నాయకత్వాన్ని  మరింత బలోపేతం చేయాలన్నారు. బడుగు బలహీన వర్గాలు, అందరి అవసరాలు తీర్చి, ఆత్మ గౌరవం నిలిపే కేసీఆర్ కు అండగా ఉండాలన్నారు. ప్రభుత్వ అవిరల కృషి  ప్రోత్సాహం వల్ల తెలంగాణ క్రీడాకారులు దేశ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పార్థసారధరెడ్డి, జిల్లా కలెక్టర్ గౌతమ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. వేంసూరు మండలం వెంకటగిరి గ్రామంలో నిర్వహించిన  బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం, సత్తుపల్లి మండలం  గంగారాం గ్రామంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.