నేడు 48 శిక్షణ పొందిన పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్

నేడు 48 శిక్షణ పొందిన పోలీస్ జాగిలాల పాసింగ్ అవుట్
Passing out of 48 trained Police dogs today

ముద్ర తెలంగాణ ప్రతినిధి:  శాంతి భద్రతల పరిరక్షణ, సంక్లిష్టమైన కేసుల పరిశోధన, ఛేదనలో అత్యంత కీలక పాత్ర వహించే విధంగా ప్రత్యేక శిక్షణ పొందిన 48 పోలీస్ జాగిలాలు ( వీటిని పోలీస్ భాషలో కెనెన్ అని పిలుస్తారు), 64 మంది జాగిలాల శిక్షకుల పాసింగ్ అవుట్ పరేడ్ రేపు గురువారం జరుగనుంది. తెలంగాణా రాష్ట్రానికిచెందిన 36 , అరుణాచల్ రాష్ట్రానికి చెందిన జాగిలాలు శిక్షణ నిచ్చారు. మొయినాబాద్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ టైనింగ్ అకాడమీ లో జరిగే పోలీస్ జాగిలాలు, ట్రైనర్ల పాసింగ్ అవుట్ పరేడ్ కు హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. 

మొయినాబాద్ శిక్షణా కేంద్రం లో ఈ 48 జాగిలాలకు ఎనిమిది నెలల పాటు, 64 మంది హాండ్లర్స్ లకు (శిక్షకులు) ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. ఈ 48 జాగిలాలలో ఐదు రకాలు ప్రధానంగా లెబ్రడాల్‌ 21, జర్మన్ షెప్పర్డ్ 1, బెల్జియం మాలినోస్ 21, కోకోర్ స్పానియల్ 4, గోల్డెన్‌ రిట్రీవర్ 1 జాతులకు చెందినవి వున్నాయి. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన జాగిలాలు, శిక్షకులు ఈ బ్యాచ్ లో ఉన్నారు. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కు చెందిన పీ.ఎం. డివిజన్ పోలీస్ కె-9 డివిజన్ కన్సల్టింగ్ డైరెక్టర్ డాక్టర్ ఫై.కె. ఛుగ్ ఈ బ్యాచ్ తుది పరీక్షకు ఎక్జామినర్ గా హాజరయ్యారు. జాగిలాలకు వాసన చూసె శక్తి 40 రెట్లు, వినికిడి శక్తి 20 రెట్లు, కంటి చూపు పది రెట్లు అధికం విశ్వాసానికి మారు పేరుగా నిలిచే జాగిలాలు పోలీస్‌ శాఖకు నేర పరిశోధనలో కీలకంగా మారుతున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జరిగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘవిద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్టం నివారించడంలో పోలీసు జాగిలాలు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నాయి.

క్రమశిక్షణలో మేటి
పోలీస్‌ శాఖ అంటేనే క్రమ శిక్షణకు మారుపేరు. ఇందుకను గుణంగానే జాగిలాలు కూడా క్రమశిక్షణను పాటిస్తాయి. అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు, విచారకర సంఘటనలు జరిగినప్పుడు హ్యాండ్లర్‌ ఆదేశాల మేరకు ఈ జాగిలాలు ప్రవర్తిస్తాయి. సెల్యూట్‌ చేయడం, నిర్దేశించిన వాహనంలోకి, లేదా ప్రదేశంలోకి వెళ్ళేలా హ్యాండ్లర్‌ ఇచ్చిన ఆదేశాలను శిరసా వహిస్తాయి.

నేర పరిశోధనలో ఘనం
ఇంటి యజమానుల పట్ల శునకాలు ఎంత విశ్వాసం చూపుతాయో.. పోలీస్‌ కేసుల పరిశోధనలో కూడా అంతే పాత్ర పోశిస్తున్నాయి. బందోబస్తు, దొంగతనాలు, హత్య కేసుల్లో నేరస్థుల కదలికలను గుర్తించడం, బాంబ్‌లు, ఇతర మందు సామగ్రిని గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎన్నో కేసులను శునకాలు చేధించిన సందర్భాలు ఉన్నాయి.

అరుణాచల్ ప్రదేశ్ జాగిలాలకు కూడా శిక్షణ
జాగిలాల శిక్షణలో జాతీయ స్థాయిలో పేరుగాంచిన మొయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 12 జాగిలాలకు ప్రత్యేక శిక్షణ అందచేశారు. గతంలో వివిధ రాష్ట్రాలకు చెందిన శునకాలు ఇక్కడ శిక్షణ ఇచ్చారు. ప్రధానంగా పశ్చిమ బెంగాల్,కర్ణాటక,ఉత్తర్ ప్రదేశ్,ఆంద్ర ప్రదేశ్ జాగిలాలకు ఇక్కడ శిక్షణ ఇచ్చారు. గతంలో, 2019 లో ఇక్కడ శిక్షణ పొందిన బీహార్ రాష్ట్రానికి చెందిన శునకాలు అక్రమంగా నిల్వ చేసిన మద్యం గుర్తింపు, అక్రమద్యం తయారీ కేంద్రాలను విజయవంతంగా గుర్తిస్తున్నాయని బీహార్ పోలీస్ శాఖ తెలిపింది.

అభినందించిన డీజీపీ అంజనీ కుమార్
పోలీస్ శాఖలో అంతర్గత భాగమైన కె-9 జాగిలా వ్యవస్థలో భాగంగా మొయినాబాద్ ఐఐటిఏ లో 22 వ బ్యాచ్ జాగిలాల పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించడం పట్ల డీజీపీ అంజనీ కుమార్ అభినందించారు. ఈ శిక్షణను 
విజయవంతముగా పూర్తిచేయడంలో కృషిచేసిన ఇంటలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్, ఇంటిజెన్స్ సెక్యూరిటీ విభాగం డీఐజీ టాఫ్సీర్ ఇక్బాల్, ఇతర అధికారులను ఆయన అభినందించారు.