తెలంగాణలో అత్యధిక  సీట్లు గెలవాలి

తెలంగాణలో అత్యధిక  సీట్లు గెలవాలి
  • బీజేపీ నేతలకు అమిత్​షా దిశానిర్దేశం
  • గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచన
  • అన్ని చోట్లా అభ్యర్థులు ఉండాలని ఆదేశం


ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈసారి తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావడానికి బీజేపీ పకడ్బందీ ప్రణాళిక వేస్తోంది. ఈనేపథ్యంలోనే రాష్ట్రంలోని సీనియర్లంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కేంద్ర హోమ్​మంత్రి అమిత్​షా నేతలకు దిశానిర్దేశం చేశారు. కాగా చాలాచోట్ల నేతలు గెలిచే పరిస్థితి లేదని అమిత్​షా వద్ద రాష్ట్ర నేతలు వెల్లడించినట్లు సమాచారం. అర్బన్ ఏరియాల్లో కొంతవరకు గెలిచే అవకాశం ఉన్నా అక్కడ కూడా చాలా కష్టపడాల్సి వస్తోందన్నారు. ప్రణాళిక ప్రకారం పనిచేస్తే కొన్ని సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.  

సీనియర్లంతా పోటీ చేయాల్సిందే..

బీజేపీలోని సీనియర్లంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అమిత్​షా పేర్కొన్నారు. కాగా పట్టులేని కొన్ని ప్రాంతాల్లో సీనియర్లు పోటీ చేయడం వలన ఓడిపోయే అవకాశాలు ఎక్కువని పార్టీ నేతలు అమిత్​షాకు చెప్పినట్లు తెలిసింది. కాగా షా నివేదికను పార్టీ నేతల ముందు వెల్లడించారు. దీన్నిబట్టి పార్టీ నేతలంతా పోటీలో ఉంటే గెలుపు సమీకరణాలు ఎలా ఉంటాయోనని, సీనియర్లంతా పోటీ చేయాలనడం సరైంది కాదని పేర్కొన్నట్లు తెలిసింది. అందరూ పోటీ చేస్తే జూనియర్ల చేతిలో కొందరు ఓడిపోతారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల డిపాజిట్లు కూడా కష్టమని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ అధికారంలోకి రావాలని మనమంతా ఎంతో కష్టపడుతున్నామని షా చెప్పినట్లు  సమాచారం. తెలంగాణలోని ఎస్సీలు, ఎస్టీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో పనిచేయాలని నేతలకు షా సూచించారు. ఈ స్థానాల్లో పార్టీ మీటింగులు, బహిరంగ సభలను పెట్టాలని కోరారు. అలాగే స్థానిక నాయకులతో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు.