స్లీపింగ్ మోడ్​ సర్కారు ఆఫీసులు సైలెంట్​

 స్లీపింగ్ మోడ్​ సర్కారు ఆఫీసులు సైలెంట్​
  • ఎక్కడా ముందుకు కదలని ఫైళ్లు
  • మంత్రులంతా ఆత్మీయ సభలలోనే
  • ఢిల్లీ పరిణామాల చుట్టూ అధిష్టానం
  • కీలక విభాగాలలో  పనులు నిల్
  • హాజరుకే పరిమితమవుతున్న అధికారులు, సిబ్బంది
  • పలు శాఖలలో టెండర్లకు కూడా బ్రేక్​
  • సంక్షేమ పథకాలు కూడా పెండింగ్​లోనే
  • సీఎం ప్రకటించిన పథకాలకు మోక్షం లేదు

కీలక ఎన్నికలకు ముందు సర్కారు స్లీపింగ్​లో ఉంది. ప్రజాప్రతినిధులంతా ఓట్ల వేటలో పడ్డారు. గత కొన్నేండ్లుగా ముందుకు సాగని సంక్షేమ పథకాల ఫైళ్లు ఇప్పుడైనా పరుగులు పెడుతాయని ఆశిస్తే వాటికి మరింత బ్రేక్​ పడింది. ‘వచ్చేదంతా ఎన్నికల కాలమే. ఇక గ్రామాలకు తరలండి’ అంటూ సీఎం కేసీఆర్​ చెప్పడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాలు, నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. అంతకు ముందు కూడా ఏదో అడపాదడపా ఒకటీ, రెండు ఫైళ్లు కదిలినా ఇప్పుడు అవి కూడా సాగడం లేదు. ఇక, ప్రభుత్వ కార్యాలయాలకు కేవలం హాజరు కోసమే వస్తున్నట్లుగా అధికారులు, సిబ్బంది తీరు ఉంది. మధ్యాహ్న భోజనం తర్వాత అధికారులు దొరకడం లేదు. దీంతో రాష్ట్రంలో పాలన పడకేసినట్లుగా తయారైంది. 

సార్.. రాజకీయాలలో బిజీ
అసెంబ్లీ సమావేశాల తరువాత కేసీఆర్ రాజకీయ వ్యవహారాలలో సీరియస్ గా బిజీ అయ్యారన్న చర్చ సాగుతోంది. కేవలం బీఆర్ఎస్ విస్తరణ కార్యక్రమాల గురించే యోచిస్తున్నారని అంటున్నారు. దీంతో పాటుగా మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలపైనా కేసీఆర్​ దృష్టి పెట్టారు. ఇప్పటికే రెండుసార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కేసీఆర్ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్​ స్కామ్ లో కవితను ఈడీ విచారించిన నేపథ్యంలో సగం మంత్రివర్గం ఢిల్లీలోనే మకాం వేసింది. దాదాపు వారం పాటు అక్కడే ఉంది. విచారణ జరుగుతున్నంత కాలం కూడా సీఎం కేసీఆర్​ ఆ పరిణామాలపైనే దృష్టి పెట్టారు. దీంతో రాష్ట్రంలో పాలన ఆగిపోయిందనే ప్రచారం జరుగుతున్నది. 

అక్కడ ఈమోదిస్తేనే!
ప్రగతిభవన్​కు వెళ్తేనే ఫైళ్లకు ఆమోదముద్ర పడుతోందని అంటున్నారు. అధికారులు, మంత్రులు స్వయంగా ఫైళ్లను పట్టుకుని వెళ్లి సంతకం చేయించుకుని తెచ్చుకునే పరిస్థితి లేదని చెబుతున్నారు. సీఎంఓ నుంచి అడిగితేనే ఫైళ్లు ప్రగతిభవన్​కు తీసుకెళ్లాలి. లేదంటే నెలలు తరబడి తిరిగినా ప్రయోజనం ఉండదనే ప్రచారం ఉంది. దీనితో వందల సంఖ్యలో ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయంటున్నారు. డబుల్ బెడ్ రూమ్​ ఇండ్లు, గృహలక్ష్మి పథకానికి సంబంధించిన ఫైళ్లు ప్రగతిభవన్​కు వెళ్లి నెలలు గడుస్తున్నాయి. విధివిధానాలు తయారు చేశామని, వాటిపై సంతకం పెడితే ప్రాసెస్​ చేస్తామంటూ అధికారులు చెబుతున్నారు. కానీ, అక్కడి నుంచి క్లియరెన్స్​రావడం లేదు. 


ముద్ర, తెలంగాణ బ్యూరో :
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల అభివృద్ధి కోసం వేల కోట్లు, ప్రత్యేక నిధి కింద వందల కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ నిధులు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇచ్చిన ప్రతిపాదనలు టేబుల్​ దాటడం లేదు. వాటికి అనుమతి రావడం లేదు. నిధులు రాకపోవడంతో ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యేలు ఈ విషయాలను దాట వేస్తున్నారు. పాలనా కేంద్రమైన సచివాలయం నిర్మాణం, ప్రారంభోత్సవంలో సర్కారు బిజీగా ఉన్నట్టు అనిపిస్తున్నది.  దీంతో ఆఫీసర్లు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకోవడం కష్టంగానే మారుతున్నది. ప్రస్తుతం ఆఫీసులు, మంత్రుల చాంబర్లు ఎక్కడెక్కడో విసిరేసినట్లుగా ఉన్నాయి. అత్యవసర పనుల కోసం వచ్చేవారంతా ఈ ఆఫీసుల అడ్రస్​లు వెతికిపట్టుకుని వెళ్తే, అక్కడ అధికారులు దొరకడం లేదు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన అంశాలపై ఉన్నతాధికారులను కలువడానికి వస్తుంటే, అసలు పెద్దసార్లు దొరకడమే లేదని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

టెండర్లు ఇంకెప్పుడు?
అద్దాల్లా రోడ్లు, గ్రామాల్లో తారురోడ్లు అంటూ ప్రభుత్వం ప్రకటించి నెలలు గడిచిపోతున్నది. దీనికి నిధులు కూడా కేటాయించినట్లు ప్రభుత్వం చెబుతున్నా, పాత బిల్లులే రావడం లేదని టెండర్లు వేసేందుకు ముందుకురాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అదునుగా సంబంధిత శాఖలు కూడా టెండర్లను పక్కన పెట్టేశారు. ఏదో ఓ సందర్భంలో ‘టెండర్లు వేస్తున్నాం. కాంట్రాక్టర్లు రావాలి’ అంటూ ఓ నోటిఫికేషన్​ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికీ వెయ్యికిపైగా రోడ్లకు టెండర్లు వేయలేదంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  

ఆత్మీయ సభలకు అమాత్యులు
ప్రస్తుతం ఆత్మీయ సభలు ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులంతా ఇదే పనిలో ఉంటున్నారు. జిల్లాలలో తిరుగుతున్నారు. వివిధ వర్గాలను ఒక్క దగ్గరకు చేర్చడం, రాజకీయ ప్రసంగాలు ఇవ్వడానికే సమయం సరిపోతున్నది. అమాత్యులకు హైదరాబాద్​ వచ్చే తీరిక ఉండటం లేదు.ఒకవేళ వచ్చినా, రాజకీయ కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో వారి శాఖల ఫైళ్లు పెండింగ్​ ఉంటున్నాయి. మంత్రుల దగ్గర ఈ పరిస్థితి ఉంటే, అధికారులది మరో పరిస్థితి. ఇప్పుడున్న అధికారులలో 90 శాతం వరకు సీఎం మాట తప్ప ఇంకెవరి మాట వినే పరిస్థితులలో లేరని బహిరంగ ప్రచారమే. కొంతమంది సీనియర్​ అధికారులైతే, మంత్రుల మాట కూడా లెక్క చేసే స్థితిలో లేరు. దీంతో తమ దగ్గరకు అర్జీలు పట్టుకొచ్చే ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. నెలలు గడిచినా తాము చెప్పిన పనులు కాకపోవడంతో కార్యాలయానికి వెళ్లి ఏమి చేయాలో అర్థంకాక, ప్రజలకు ఏమిచెప్పాలో తెలియక మొహం చాటేసి కార్యాలయాలకు దూరంగా ఉంటున్నారు. అడపదడపా సమీక్షలతో కాలం వెళ్లదీస్తున్నారు. రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయాయి. రోజువారీ ఖర్చులకు కూడా ఏ రోజుకు ఆ రోజు గల్లా పెట్టె వెతుక్కోవాల్సి వస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇవ్వడం కూడా కష్టం అవుతున్నది. ప్రభుత్వ టెండర్లు పాడుకొని పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాక లబోదిబో అంటున్నారు. దీంతో నిధులతో కూడిన ఫైళ్లు అయితే మరింత ఆలస్యం అవుతున్నాయి. సంక్షేమ పథకాలకు సంబంధించిన ఫైళ్లు కూడా క్లియర్​ కావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. 

కీలక సంఘటనలు.. అయినా సైలెంట్​
ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. చిన్నారిని వీధి కుక్కలు పీక్కు తినడం మనసును కలిచి వేసింది. అనుకోకుండా ఈ సంఘటన జరిగినా, మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేయడం తప్ప చర్యలు తీసుకోవడం లేదు.  సీఎం స్థాయి నుంచి కనీసం సమీక్ష కూడా లేదు. మెడికో ప్రీతీ ఆత్మహత్యాయత్నం సంఘటన సంచలనం రేపింది. మరోసారి అలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. ఇక కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణించగా ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగలేదు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత చనిపోయిన విజయరామారావుకు మాత్రం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. దీనిపై అన్ని వర్గాలలో చర్చ సాగుతున్నది. టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం కుదిపేస్తున్నది. దీనిపై విమర్శలు వస్తున్నా రాజకీయ కోణాలలోనే తిప్పి కొడుతున్నారు. సీఎం ఎందుకు మాట్లాడడంలేదనే దానికి సమాధానం లేదు.