అన్యక్రాంతమవుతున్న అటవీ భూములు 

అన్యక్రాంతమవుతున్న అటవీ భూములు 
  • కన్నెత్తి చూడని అటవీ శాఖ అధికారులు 
  • పోడు భూముల కోసం ప్లాంటేషన్ లో చేట్ల నరికివేత 

ముద్ర కోనరావుపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,అడవుల పెంపకం, అటవీ భూముల సంరక్షణ కోసం, కోట్ల రూపాయలను వెచ్చిస్తుంది. కానీ కొందరి అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో, అక్రమార్కులు, అడవులలో విధ్వంసం సృష్టిస్తూ, ఏపుగా పెరిగిన చెట్లను, హరితహారంలో నాటిన ప్లాంటేషన్ లను  నరికి వేస్తు  లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల సెక్షన్ పరిధిలోని కొండ్రాయి చెరువు సమీపంలో పోడు భూముల వ్యవసాయం  పేరిట వందల ఎకరాల అడవిని నరికి వేస్తున్నారు. ఇదంతా తతంగం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మరియు బేస్ క్యాంప్ సిబ్బంది కనుసన్నలోనే జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అటవీ శాఖ లోని బేస్ క్యాంపులో పనిచేస్తున్న ఓ వ్యక్తి ట్రాక్టర్ తోనే వందల ఎకరాల భూమిని, ఆక్రమించి,చదును చేస్తున్నా, అటవీ శాఖ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకుండా ఉంటూ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి అడవులను నరికి భూములు చదును చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని అడవులను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు