ఒకరి వెనుక ఒకరు రేణుక టీం బ్లాక్​ దందా

ఒకరి వెనుక ఒకరు రేణుక టీం బ్లాక్​ దందా
  • చెయిన్​ప్రాసెస్​లో పేపర్ విక్రయాలు
  • పాలమూరు జిల్లావాసులకే ఎక్కువ
  • మరొకరిని అరెస్ట్​చేసిన సిట్​
  • ఇప్పటి వరకు 40 మందిని విచారించిన సిట్
  • ఇందులో కొందరికి నిందితులతో లింక్​​
  • కొంతమందికి ఎఫీషియన్స్ టెస్ట్ కూడా !
  • శంకరలక్ష్మీ కంప్యూటర్​ హ్యాక్​ చేసిన రాజశేఖర్
  • వింత మలుపులు తిరుగుతున్న ​టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసు


టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేపర్లు కొనుగోలు చేసినవారు తాముపెట్టిన సొమ్మును తిరిగి రాబట్టుకునేందుకు వాటిని మళ్లీ విక్రయానికి పెట్టారు. ఇలా చెయిన్​ ప్రాసెస్​ తరహా మార్కెటింగ్​ చేశారు. దీంతో చాలా పేపర్లు పరీక్షలకు ముందే బయటకు వెళ్లినట్లు తేలుతున్నది. ఈ కేసులో సోమవారం మరొకరిని అరెస్ట్​ చేశారు. రేణుకా రాథోడ్​ భర్త డాక్యా నాయక్​ నుంచి పరీక్షా పత్రం కొన్న తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య15కు చేరింది. ఇదే చైన్​ ప్రాసెస్​లో ఏఈ పరీక్షా ప్రశ్నాపత్రాలను కొనుగోలు చేసిన మరో నలుగురిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 

ముద్ర, తెలంగాణ బ్యూరో
ఏఈ పరీక్షా ప్రశ్నాపత్రాలను కొనుగోలు చేసిన నలుగురు ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాకు చెందినవారేనని తెలుస్తున్నది. ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్న అంశంపై సిట్​ ఇంకా బయటకు చెప్పడం లేదు. రూ. పది లక్షలు పెట్టి పేపర్లు కొని, తిరిగి పది లక్షలను సంపాదించుకునేందుకు ప్రశ్న పత్రాలను అమ్ముతున్నట్లు తేలింది. గ్రూప్–1తో పాటుగా ఏఈ ప్రశ్నాపత్రాన్ని నిందితులు రేణుకా, ఆమె భర్త డాక్యా అండ్ గ్యాంగ్ బ్లాక్ టికెట్ల మాదిరిగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ప్రధానంగా ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేయడానికి పెట్టిన ఖర్చును తిరిగి సమకూర్చుకునే క్రమంలో చెయిన్ ప్రాసెస్‌లో కొనుగోలు పెట్టినట్లు అధికారులు తేల్చారు. రాజశేఖర్​ నుంచి ప్రవీణ్,  ప్రవీణ్ నుంచి రేణుకా రాథోడ్​ ద్వారా ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. శంకరలక్ష్మి కంప్యూటర్​ను హ్యాక్​ చేసి, పాస్​వర్డ్​ దొంగిలించిన రాజశేఖర్​నియామక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను దొంగిలించాడు. ముందుగా గ్రూప్ –1 పేపర్ ప్రవీణ్​ ద్వారా అమ్మకానికి పెట్టినట్లు తేలింది. ఇక్కడి నుంచి బ్లాక్​ దందా మొదలైంది. రేణుక చేతికి ఈ క్వశ్చన్​ పేపర్​ అందగానే, తమ దగ్గర ప్రశ్నపత్రాలు ఉన్నాయంటూ సోషల్​ మీడియాలో ఏర్పాటు చేసుకున్న గ్రూప్​ ద్వారా సమాచారం పంపించారు. ఇలా ఒక్కొక్కరికి ప్రశ్నాపత్రాలు చేరాయి. ఎక్కువగా ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాకు చెందిన వారు కొనుగోలు చేశారు. రాజశేఖర్​ బావ ప్రశాంత్, షాద్‌నగర్‌కు చెందిన రాజేందర్​ను విచారించడంతో ఈ చెయిన్​ లింక్​ బయట పడుతున్నది. ఢాక్య బృందం నుంచి రాజేందర్​రూ. పది లక్షలు ఒప్పందం చేసుకుని ఏఈ పేపర్ అమ్మినట్లు తెలిసింది. ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టి ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసిన రాజేంద్ర, ఆ పేపర్‌ను తిరుపతికి విక్రయించాడు. ఈ సమాచారంతో తిరుపతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రాజేందర్​ ఒకరికి మాత్రమే అమ్మలేదని, చాలా మందికి విక్రయించాడని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇలా ఒకరి నుంచి ఒకరికి దాదాపు వంద మందికి ప్రశ్నాపత్రం చేరినట్లు భావిస్తున్నారు. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు. రేణుక, డాక్యా నుంచి అత్యధికంగా పాలమూరు పరిసర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు పేపర్ వెళ్లినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. 

నలుగురి విచారిస్తున్న సిట్​
ఈ కేసులో నలుగురు నిందితులను సిట్ అధికారులు రెండో రోజు విచారించారు. ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్, కేతావత్ రాజేశ్వర్‌ను సుధీర్ఘంగా విచారిస్తున్నా సరైన సమాధానం చెప్పడం లేదని తెలుస్తున్నది. సీన్​ రీ కన్​స్ట్రక్షన్​లో భాగంగా వీరంతా బస చేసిన హోటల్‌కు తీసుకెళ్లి ప్రశ్నించారు. మంగళవారం వరకు నిందితుల కస్టడీ ఉండటంతో ఈలోగా పూర్తి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలో 100 మార్కుల కంటే ఎక్కువ సాధించిన 60 మందికిపైగా అభ్యర్థుల వివరాలను సేకరించారు. వీరిలో 40 మందిని ఆది, సోమవారాలలో విచారించారు. ఈ సంద ర్భంగా కొందరికి నిందితులతో సంబంధాలు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.  విచారణకు వచ్చిన చాలా మంది అభ్యర్థులు పలుమార్లు ప్రిలిమ్స్​ రాశారని, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారేనని తేలింది. ఒకవేళ అనుమానస్పదంగా గుర్తిస్తే మాత్రం వారిని ప్రత్యేకంగా విచారించారు.  నిందితుడు రాజశేఖర్​కు బావ ప్రశాంత్​కు సిట్ అధికారులు లుకౌట్​ నోటీసులు జారీ చేశారు. అయన న్యూజిలాండ్​లో ఉంటూ ఇక్కడకు వచ్చి గ్రూప్–1 పరీక్ష రాశాడు. ఆయనకు 1‌‌00కుపైగా మార్కులు వచ్చాయి. ప్రశాంత్​కు ఉచితంగా కాకుండా రాజశేఖర్ పేపర్ అమ్మినట్లు భావిస్తున్నారు. ప్రశాంత్​ కూడా కొంతమందికి ఈ పేపర్​ను అమ్మినట్లుగా అనుమానిస్తున్నారు. 

దిద్దుబాటు చర్యలు
ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనతో టీఎస్‌పీఎస్సీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆఫీస్‌లోకి సెల్‌ఫోన్‌లు, పెన్‌డ్రైవ్‌‌లు తీసుకురావద్దని నిషేధం విధించింది. ఇకపై ఏ ఫిర్యాదైనా ఆన్‌లైన్ ద్వారా తీసుకోవాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఈ పద్దతిని అమల్లో పెట్టారు. సెక్యూరిటీ దగ్గరే సెల్​ఫోన్​లు, పెన్​డ్రైవ్​వంటి వాటిని స్టోర్​ చేశారు.