సిట్ ​ఏర్పాటు చేయండి

సిట్ ​ఏర్పాటు చేయండి
  • ఈడీ, సీబీఐ మీద అనుమానాలు ఉన్నాయి 
  • లిక్కర్ స్కామ్ విచారణ సరిగా సాగడం లేదు
  • ఇంటి దగ్గరే విచారించేలా ఆదేశాలివ్వండి
  • సుప్రీంకోర్టుకు విన్నవించిన ఎమ్మెల్సీ కవిత
  • ‘మనీలాండరింగ్’ కు అది వర్తించదన్న ఈడీ లాయర్లు
  • అరెస్ట్​ చేయకుండా స్టే ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు
  • విచారణ మూడు వారాలకు వాయిదా వేసిన ధర్మాసనం

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు ముందుకు కొత్త అభ్యర్థనను తీసుకు వచ్చారు. ఈడీ తనను వేధిస్తున్నదంటూ కవిత సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బేలా, జస్టిస్ ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగానే కవిత మద్యం పాలసీ కేసు విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయాలని కోరారు. ఈడీ, సీబీఐ విచారణ మీద అనుమానాలు వ్యక్తం చేశారు. మహిళగా తనకు ఉన్న హక్కులను ఈడీ కాలరాస్తోందంటూ కవిత పిటిషన్ లో పేర్కొన్నారు.  సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, విక్రమ్ చౌదరి కవిత తరఫున వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీ కవితను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారిస్తున్నారని, విచారణ సందర్భంగా ఈడీ అధికారులు మానసిక, శారీరక ఇబ్బందులకు గురి చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈడీ అధికారులు వ్యవహరించిన తీరు విస్మయానికి గురి చేసిందని, నిందితులతో వారు ప్రవర్తించిన తీరు ఆందోళనకు, భయానికి గురి చేస్తోందని తెలిపారు. న్యాయవాదుల సమక్షంలో, సీసీ టీవీ కెమెరాల నిఘాలోనే విచారణ చేపట్టేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కేసును సీబీఐ, ఈడీకి కాకుండా సిట్​అప్పగించాలని విన్నవించారు.  వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కవితకు పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌ 50 ప్రకారం జారీచేసిన నోటీసులు, సీఆర్‌పీసీ సెక్షన్‌ 160కి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. వాంగ్మూలం నమోదు చేసేప్పుడు న్యాయవాది సమక్షంలో వీడియో చిత్రీకరణకు ఉత్తర్వులు జారీ చేయాలని విన్నదించారు. కవిత ఫోన్‌ జప్తు నోటీసులను రద్దు చేయాలని, ఫోన్‌ సీజ్‌ చేయడం చెల్లదని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను ‘నళినీచిదంబరం వర్సెస్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌’ కేసుకు జత చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో శారదా చిట్​ఫండ్​ స్కామ్​ కేసులో నిళినీ చిందంబరం, అభిషేక్​ బెనర్జీ పిటిషన్ల సందర్భంగా న్యాయస్థానం నోటీసులు జారీ చేసిన విషయాన్ని కపిల్​ సిబల్​కోర్టు ముందుంచారు. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిగితే మరింత మంచిదని, ఏకకాలంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు జరుపుతున్నందున ఇకపై ప్రత్యేకంగా సిట్​ను ఏర్పాటు చేయాలని కోరారు. 

ఆ సెక్షన్ ఈడీకి వర్తించదు
ఈడీ తరపున సొలిసిటర్​జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ,  క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​లోని సెక్షన్160 మనీలాండరింగ్ చట్టానికి వర్తించదని అన్నారు. మహిళలు, సీనియర్​ సిటిజన్లు, మైనర్లను వారి ఇండ్ల దగ్గర విచారించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, మనీలాండరింగ్ విషయంలో అవి వర్తించవని స్పష్టం చేశారు. అందుకే కవితను ఈడీ కార్యాలయానికి పిలిచి సుదీర్ఘంగా విచారించారని కోర్టుకు తెలిపారు. గతంలో విజయ్​ మదన్​లాల్ కేసులో ఇదే సెక్షన్​ ప్రకారం ఈడీ విచారణకు వర్తించదనే అంశం స్పష్టమైందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీరాజు ధర్మాసనానికి గుర్తు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో దాఖలు చేసిన నళినీ చిదంబరం పిటిషన్‌కు ఈ కేసును ట్యాగ్‌ చేసింది. అయితే, ఈడీ తనను అరెస్ట్ చేయొద్దన్న కవిత అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనిపై  మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.