బీఆర్‌ఎస్‌ జెండాలో తెలంగాణ మాయం

బీఆర్‌ఎస్‌ జెండాలో తెలంగాణ మాయం

తానే మారెనో, తలపే మారెనో.. తెలంగాణ ఊసే మరిచెనో అన్నట్లుగా తయారైంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరు. తెలంగాణ  రాష్ట్ర సమితి.. తెలంగాణ సాధన కోసం ఏర్పాటైన ఉద్యమ పార్టీ.. ఆ తరువాత ఫక్తు రాజకీయ పార్టీగా ప్రకటించిన  ఆ పార్టీ నేత  పార్టీలో ఉద్యమ స్ఫూర్తికి చరమ గీతం పాడేశారు. ఆ  తరువాత టీఆర్‌ఎస్‌ ను జాతీయ పార్టీగా మార్చి.. తెలంగాణ పదాన్ని తొలగించారు. దానితో పాటే తెలంగాణ ఆత్మకూ తిలోదకాలిచ్చేశారు.ఇక ఇప్పుడు విస్తరణలో భాగంగా తెలుగు భాషకూ చెల్లు చీటీ పాడేశారు.

నిజమే బీఆర్‌ఎస్‌ ఇప్పుడు జాతీయ పార్టీ.. ప్రాంతం, భాష తారతమ్యాలు లేకుండా అన్ని ప్రాంతాలకూ, భాషలకూ సమ ప్రాధాన్యత ఇవ్వాలి. అంత వరకూ అయితే అభ్యంతరం లేదు. అందుకు తగినట్లుగానే బీఆర్‌ఎస్‌ లో ఇతర రాష్ట్రాల వారు ఎవరన్నా చేరితే ఆ రాష్ట్ర భాషలో కండువాలు తయారు చేయించి కప్పుతున్నారు. అంత వనరై ఓకే. కానీ తెలంగాణ రాజధానికి వచ్చి బీఆర్‌ఎస్‌ లో చేరే వారిని పార్టీలోకి ఆహ్వానించే సందర్భంలో కూడా తెలుగుకు, తెలంగాణకు ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని బీఆర్‌ఎస్‌ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి.ఇటీవల ఒడిశా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌, ఆయన తనయుడు ప్రగతి భవన్‌ లో కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. కేసీఆర్‌ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

అయితే ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలలో ఎక్కడా తెలంగాణ కనిపించలేదు. తెలుగు భాష కనిపించలేదు. భారత దేశం మ్యాప్‌, హిందీ, ఇంగ్లీషు, ఒరియాలలో బ్యానర్లు మాత్రమే దర్శనమిచ్చాయి.    తెలంగాణ భవన్‌ లో జరిగే బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలలో సైతం పార్టీ బ్యానర్లు కేవలం హిందీ, ఇంగ్లీషు భాషలోనే దర్శనమిస్తున్నాయి. ఇక ఇతర రాష్ట్రాల వారి చేరికల సందర్భంగా ఏర్పాటు చేసే బ్యానర్లలో  ఆయా రాష్ట్రాల భాషలో మాత్రమే బ్యానర్లు దర్శనమిస్తున్నాయి.  ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలను ఏ భాషలో ఓట్లు అడగాలని బీఆర్‌ఎస్‌ నాయకులు మధన పడుతున్నారు.  రాష్ట్ర సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఇటీవలి కాలంలో కేసీఆర్‌ అసలు ప్రస్తావించడం లేదనీ, ఎంత సేపూ కేంద్రంపై విమర్శలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారితో భేటీలు, సమావేశాలూ, చర్చలకే పరిమితమౌతున్నారనీ, దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పార్టీ దూరం అవుతోందని పార్టీ శ్రేణులే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రెండు సార్లు పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన తెలంగాణను విస్మరించడమంటే మూలాలను వదిలేయడమేనని అంటున్నారు. బీఆర్‌ఎస్‌ విస్తరణ సంగతి అలా ఉంచి ఇదే తీరు కొనసాగితే.. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏమౌతుందో కేసీఆర్‌ ఆలోచించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.