చరిత్ర ఎరుగని విపత్తు అది! 

చరిత్ర ఎరుగని విపత్తు అది! 
  • ఆరు గంటలలోనే రికార్డు స్థాయి వాన 
  • సీఎం కేసీఆర్ ముందు చూపుతో ముప్పు తప్పింది 
  • క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు
  • అనుక్షణం వానలను, ప్రాజెక్టులనూ సమీక్షించారు
  • ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగా జరగకుండా చూశారు
  • అధికారులు సమన్వయంతో రేయింబవళ్లు శ్రమించారు
  • శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 

ముద్ర, తెలంగాణ బ్యూరో:రాష్ట్రంలో అతి భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జరిగిన నష్టం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పారు.18 జూలై నుంచి 22 వరకు,24 జూలై నుంచి 28 వరకు రెండు దఫాలలో కేవలం ఆరు గంటలలోనే భారీ వర్షాలు కురిశాయన్నారు. వారం రోజుల పాటు రికార్డు స్థాయి కుండపోత వర్షాలు చూశామన్నారు. యేడాది పొడవునా కురిస్తే ఎంత వర్షపాతం నమోదు అవుతుందో, అంతే స్థాయిలో వాన ఒక్క రోజులో కురిసిందన్నారు. ఇది ఎవరం ఊహించలేదన్నారు. సీఎం కేసీఆర్ సకాలంలో జారీ చేసిన ఆదేశాలతో మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉన్నారన్నారు. క్షేత్ర స్థాయిలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేశారన్నారు. దీంతో వందల మంది ప్రాణాలను కాపాడగలిగామన్నారు. స్వయంగా కేసీఆర్ ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతిక్షణం వరద పరిస్థితిని సమీక్షించారన్నారు. ఎస్సారెస్పీ, కడెం, అప్పర్ మానేర్, నిజాంసాగర్, భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతిని గంటగంటకూ పరిశీలించారన్నారు. సహాయక చర్యలను పెద్ద ఎత్తున చేట్టామన్నారు. ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నాలుగు ప్రత్యేక బోట్లతో (ఒక్కో టీమ్ కు 20 నుంచి -22 మంది నిష్ణాతులు) పని చేశాయన్నారు. విశాఖపట్నం నుంచి అదనంగా రెండు బృందాలను రప్పించామన్నారు. రెండు హెలికాప్టర్లతో భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెంలో వరద సహాయక చర్యలు చేపట్టామన్నారు. వరదబాధితులకు ఆహారం, మెడిసిన్ అందించామన్నారు. 90 మందితో కూడిన ఆర్మీ టీమ్ ను కూడా సిద్ధం చేశామన్నారు. వరదలకు ప్రభావితం అయిన 139 గ్రామాలలో 7,870 ఇండ్ల నుంచి 27,063 మందిని 157 పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలించామన్నారు. వారికి వసతి, ఆహారం ఏర్పాటు చేశామనన్నారు. అయినప్పటికీ కొందరు కొందరు బురద రాజకీయాలకు పూనుకున్నారన్నారు.  దీనిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

అధికారులు అద్భుతంగా పనిచేశారు

క్షేత్రస్థాయిలో పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్ ఇలా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని మంత్రి వేముల వివరించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారన్నారు. పోలీస్ సిబ్బంది సుమారు 19 వేల మందిని వరద ప్రభావిత ప్రాంతాలనుండి క్షేమంగా పునరావాస కేంద్రాలకు తరలించారని తెలిపారు. విద్యుత్ సిబ్బందికి ఈ వేదికగా సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. వరదలలో ఈదుకుంటూ ప్రాణాలకు తెగించి కరెంట్ పునరుద్ధరించిన వారి సాహసానికి అంతా అభినందనలు, ధన్యవాదాలు తెలపాలన్నారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’తో చెరువులు పటిష్టంగా తయారయ్యాయని, దాని ఫలితంగా ఎక్కువగా గండ్లు పడలేదన్నారు. కొద్దిగా పడిన చెరువులకు కూడా ఇరిగేషన్ శాఖ సిబ్బంది సకాలంలో మరమ్మతులు చేశారన్నారు.