తపాలా శాఖలో  కొలువుల జాతర

తపాలా శాఖలో  కొలువుల జాతర
  • దేశవ్యాప్తంగా 30 వేల పోస్టులు
  • రాత పరీక్ష లేకుండా నియామకం
  • తెలంగాణలో 961, ఏపీలో 1,058 పోస్టుల భర్తీ
  • నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం

ముద్ర, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తపాలా శాఖలో ఒకేసారి 30,041 పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నది. గ్రామీణ డాక్​సేవక్(జీడీఎస్) పోస్టును భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. తపాలా శాఖలో దేశవ్యాప్తంగా మేలో 12,828 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, భర్తీ ప్రక్రియ సాగిస్తున్న కేంద్రం.. ఇప్పుడు ఏకంగా 30 వేల కొలువులకు సిద్ధమైంది. గురువారం నోటిఫికేషన్ విడుదల చేయగా. గురువారం నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఆగస్టు 23 వరకు ఆన్​లైన్​లో అప్లికేషన్లు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆన్ లైన్​ http://indiapostgdsonline.gov.in/లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆగస్టు  24 నుంచి 26 వరకు దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం కల్పించారు. ఈ పోస్టులన్నీ రాత పరీక్ష లేకుండా కేవలం 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. 

రాష్ట్రంలో 961 పోస్టులు..

గ్రామీణ డాక్ సేవక్ కింద తెలుగు రాష్ట్రాల్లో 2 వేలకుపైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. తెలంగాణలో 961 పోస్టులు ఉండగా, ఏపీలో 1,058గా ఉన్నాయి. వీరి ఉద్యోగ నిర్వహణ ప్రతిరోజు 4 గంటలుగా నిర్ధారించారు. వీటితోపాటుగా ఇండియన్ పోస్టల్​ పేమెంట్ బ్యాంకులు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవలకు ప్రోత్సాహాలు ఇస్తున్నట్లు నోటిఫికేషన్​లో వెల్లడించారు. రోజువారీ విధులను నిర్వహించేందుకు ల్యాప్​టాప్, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్​ వంటివి కూడా తపాలా శాఖ సమకూర్చనున్నది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలని సూచించారు.

 కాగా, బ్రాంచ్ పోస్ట్​మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్​(ఏబీపీఎం), డాక్ సేవలకు సంబంధించిన వేతనాలను కూడా వెల్లడించారు. నిబంధనల ప్రకారం మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాషలు వచ్చి ఉండాలని, కంప్యూటర్​పరిజ్ఞానంతో పాటుగా సైకిల్​ తొక్కడం రావాలని పేర్కొన్నారు. బీపీఎంకు వేతనం రూ. 12 వేల నుంచి రూ.29,380, ఏబీపీఎం, డాక్​సేవక్​ వేతనం రూ.10 వేల నుంచి రూ.24,470గా నిర్ణయించారు. దరఖాస్తుదారుల వయస్సు 18–40 మధ్యలో ఉండాలని, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, దివ్యాంగులకు పదేండ్ల చొప్పున గరిష్ట వయో సడలింపు ఉంటుందని నోటిఫికేషన్​లో వెల్లడించారు. ఇక ఆన్ రిజర్వుడు జాబితాలో 13,618 పోస్టులు, ఓబీసీలకు 6051, ఎస్సీలకు 4138, ఎస్టీలకు 2669, ఈడబ్ల్యుఎస్​లకు 2847, పీడబ్ల్యూడీ–ఏలో 195, పీడబ్ల్యూడీ–బీలో 220, పీడబ్ల్యూడీ–సీలో 233, పీడబ్ల్యూడీ–డీఈలో 70 పోస్టులు ఉన్నాయి.