ఎన్నికల వేడి!

ఎన్నికల వేడి!
  • రాష్ట్రంలో ఒకరిపై మరొకరి మాటల తూటాలు 
  • ఇతర పార్టీల అభ్యర్థులను చేర్చుకునేందుకు లీడర్ల యత్నం
  • టిక్కెట్ల కేటాయింపునకు సర్వేలు, ఏకాభిప్రాయాలే కీలకం
  • మూడు పార్టీల్లో కసరత్తు

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలవుతోంది. రాష్ట్రంలోని 3 పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నా మూడు పార్టీలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అధికార బీఆర్​ఎస్ ను ఢీ కొనేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా అన్నిపార్టీలు కూడా సర్వేలు, ఏకాభిప్రాయాలపై ఫోకస్​ పెట్టాయి. రాష్ట్రంలోని మూడు పార్టీలైన బీఆర్​ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా సర్వేలు చేసేందుకు అయా ఏజెన్సీలకు అప్పగించింది. కేంద్ర ఇంటలిజెన్స్ ద్వారా సేకరించిన సమాచారం ద్వారా బీజేపీ 30 నుంచి 40 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధం అవుతోంది. ఈ విషయమై పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్​ఈటల రాజేందర్‌ని ఆగస్టు 8న బీజేపీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించుకుంది. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎన్నికల కమిటీ సారథి ఈటల రాజేందర్, బీజేపీ ఓబీసీ సెల్ చైర్మన్ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నది.

  • 2018లో ముందస్తు ఎన్నికలకు..

2018లో బీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి విపక్షాలను కుదురుకోనీయకుండా చేసి ఘన విజయం సాధించింది. కానీ ఈసారి సీఎం కేసీఆర్ అభ్యర్థుల ఎంపిక కోసం ఓవైపు ఇంటలిజెన్స్ కు నివేదికల బాధ్యత అప్పగించారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐ-ప్యాక్ బృందంతో ఇదివరకే రెండు సార్లు సర్వే చేయించినట్లుగా తెలుస్తోంది. ఆయన లిస్టులో నెగెటివ్ రిపోర్టు వచ్చిన వారికి ఇప్పటికే కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మూడు నెలల వ్యవధిలో మరోసారి ఐ-ప్యాక్ టీమ్ సర్వే జరిపి కేసీఆర్‌కు రిపోర్టిచ్చింది. తాజా రిపోర్టులో నెగెటివ్ వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ షాకిస్తారని తెలుస్తోంది. మరోవైపు హైకోర్టులో 28 మంది అభ్యర్థులపై కేసులు నడుస్తున్నాయి. వారిలో అందరూ కూడా అనర్హత వేటు పడే అవకాశముందని తెలుస్తోంది. ఒకవేళ 28మందిపై అనర్హత వేటు పడితే వారికి టిక్కెట్లు ఇవ్వకూడదని కేసీఆర్​భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో 119 సీట్లలో 85 సీట్లకు బీఆర్​ఎస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. దీన్నిబట్టి ఆగస్టు నెలాఖరు కల్లా 85మందికి టిక్కెట్లు ఇచ్చే అవకాశముంది. 

  • అభ్యర్థుల బాధ్యత కనుగోలుకు..

అభ్యర్థుల ప్రకటన బాధ్యతను కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటక ప్రభుత్వ సలహాదారు సునీల్ కనుగోలుకు అప్పగించింది. సునీల్​ఇటీవల కాలంలో ఇచ్చిన నివేదిక ప్రకారం  42 స్థానాల్లో ఈజీగా గెలుస్తామని చెప్పింది. మరో 42స్థానాల్లో ఇంకొంత కష్టపడితే గెలుస్తారని నివేదికను ఇచ్చారు. దీన్నిబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఆగస్టు చివరి దాక 42 స్థానాలకు టిక్కెట్లు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు తెలిసింది. మిగతా సీట్లతో ఎన్నికల ముందు ప్రకటించాలని, అప్పటికి మిగతా పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థులు ఎవరైనా వస్తే తీసుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిసింది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా అనుసరించిన వ్యూహాన్నే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోను అనుసరించనున్నట్లు తెలుస్తోంది. సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. తన ఎంపిక కూడా సర్వే రిపోర్టు ఆధారంగానే జరుగుతందని రేవంత్ చెప్పడం కొంత అతిశయోక్తే అయినా ఆ పార్టీ సర్వేలనే నమ్ముకుంటోందని ఆయన మాటల ద్వారా తెలుస్తోంది.