స్కూల్ బస్సు, కారు ఢీ

స్కూల్ బస్సు, కారు ఢీ
  • 16 మంది విద్యార్థులకు గాయాలు
  • ఇద్దరికి తీవ్ర గాయాలు
  • పోలీసులతో తల్లిదండ్రుల తీవ్ర వాగ్వివాదం
  • కారు పెద్ది స్వప్నదిగా గుర్తింపు
  • ఆమెకూ స్వల్ప గాయాలు
  • హనుమకొండ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు
  • ఆసుపత్రుల వద్ద 
  • పోలీసుల బందోబస్తు

ముద్ర ప్రతినిధి, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సంపేట కు చెందిన పాత్ ఫైండర్ స్కూల్ బస్సును వరంగల్ జడ్పీ బీ ఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న కారు బలంగా ఢీకొంది. ఫలితంగా స్కూల్ బస్సులోని చిన్నారులు 16 మంది గాయాల పాలయ్యారు. వీరిలో సహస్ర, మహేష్ అనే చిన్నారులకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాద ఘటన గురించి తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు భారీ ఎత్తున ఘటన స్థలానికి చేరుకొని ఆందోళన నిర్వహించారు. సకాలంలో అంబులెన్స్ సర్వీసులు అందించడం లేదంటూ పోలీసులతో తీవ్రవాగ్వాదానికి దిగారు. ప్రమాదానికి కారణమైన కారు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ద స్వప్నది కావడంతో వారు మరింత ఆగ్రహానికి లోనయ్యారు. ప్రమాద సమయంలో కారులోనే ఉన్న పెద్ది స్వప్న గాయాల పాలైనట్లు తెలుస్తోంది. 

16 మంది గాయాలు..
బుధవారం సాయంత్రం నర్సంపేట పట్టణంలోని పాత్ ఫైండర్ స్కూల్ బస్సు విద్యార్థులను తరలించేందుకు బయలుదేరింది. నర్సంపేట నుంచి మల్లంపల్లి వెళ్లే రోడ్డుకు కమలాపూర్ క్రాస్ బగ్గ వైన్స్ వద్ద చేరుకోగానే.. నల్లబెల్లి నుంచి నర్సంపేటకు పెద్ది స్వప్న వస్తున్నారు. ఈ క్రమంలో కమలాపూర్ క్రాస్ వద్ద పాత్ ఫైండర్ స్కూల్ బస్సును బలంగా ఢీ కొట్టింది. దీంతో ఫార్చునర్ కారు ముందు బాగా మొత్తం నుజ్జు నుజ్జు కాగా.. పాత స్కూల్ వ్యాన్ కుడివైపున మధ్య భాగం పెద్ద ఎత్తున దెబ్బతింది. కారు గుద్దిన వేగానికి బస్సు 10 ఫీట్ల మేర జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 16 మంది విద్యార్థులకు గాయాలు కాగా ఇద్దరికీ బలమైన దెబ్బలు తాకాయి. వారికి చికిత్స నిమిత్తం కొందరిని జిల్లా ఆసుపత్రికి తరలించగా మరికొందరిని అమ్మ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని సమీక్షించిన వైద్యులు సహస్ర మహేష్ అనే విద్యార్థులకు మెరుగైన చికిత్స మేరకు వెంటనే హన్మకొండలోని అజార ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స పూర్తయిన అనంతరం మెరుగైన చికిత్స కోసం హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నర్సంపేట ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలో ఎటువంటి ఘర్షణ వాతావరణ చోటు చేసుకోకుండా ఏసీపీ తిరుమల్, ఇద్దరు సిఐలు, ఇద్దరు ఎస్ఐలు రెండు ఆస్పత్రుల వద్ద భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించారు. 

పోలీసులతో తల్లిదండ్రుల తీవ్ర వాగ్వివాదం..
ప్రమాదం గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులను తరలించేందుకు అంబులెన్స్ కు ఫోన్ చేసిన కూడా రాకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. భారీ ఎత్తున ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు గుమిగూడడంతో తమ పిల్లల్ని ఆసుపత్రికి తరలించాలంటూ ఆందోళనకు దిగారు. ఎస్సై శీలం రవితో ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తున్నారంటూ తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే అయితే ఒక న్యాయం.. తమకో న్యాయమా..? మీ పిల్లలకు ఇదే పరిస్థితి ఎదురైతే ఇలాగే ఊరుకుంటారా..? అంటూ ఆక్రోషం వెళ్లగక్కారు.