ఒంటరిగానే బీజేపీ పోటీ

ఒంటరిగానే బీజేపీ పోటీ
  • బీఆర్ఎస్​ను ప్రజలు నమ్మబోరు
  • ప్రధాని మూడోసారి పీఎం అవుతారు
  • సెప్టెంబర్ తొలి వారం వరకూ ఆందోళనలు 
  • మీడియా సమావేశంలో ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్​

ముద్ర, తెలంగాణ బ్యూరో:తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు. హైదరాబాదులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు వంద రోజుల ప్రణాళిక సిద్ధం చేసామన్నారు. బీజేపీనే అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఎలాంటి యాత్రలు చేసినా ప్రజలు నమ్మబోరని అన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనన్నారు. కేసీఆర్, కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు క్షమించరన్నారు. సెప్టెంబర్ తొలివారం వరకు మూడు విడతలుగా పార్టీ పక్షాన ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఈ నెల18న అసెంబ్లీ నియోజకవర్గాలలో రాస్తారోకో, ధర్నా, ముట్టడి, దిగ్బంధం వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. రెండో విడతలో 23న అధికార పార్టీ ఎమ్మెల్యేల ఘెరావ్, 24న రాష్ట్ర మంత్రుల ఘెరావ్, 27న కలెక్టర్ కార్యాలయ ముట్టడి, జైల్ భరో కార్యక్రమాలు ఉంటాయన్నారు. మూడో విడతలో భాగంగా సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్ మిలియన్ మార్చ్ తరహా ఆందోళనను నిర్వహిస్తామని వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ ఎన్నికల కమిటీ మీటింగ్ లో తెలంగాణ అంశం మీద చర్చ జరగలేదన్నారు. కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదన్నారు. నరేంద్ర మోడీ ముచ్చటగా మూడో సారి ప్రధానమంత్రి అవుతారన్నారు. కేంద్రం ప్రకటించిన రైల్వే ప్రాజెక్టులతో తెలంగాణాకు మేలు జరగనుందని తెలిపారు. కేంద్రం నిర్ణయాలతో కేటీఆర్ కు కనువిప్పు కలగాలన్నారు. తెలంగాణాలో అభివృద్ధి పనులకు ప్రధానిని ఆహ్వానిస్తామన్నారు. మణిపూర్ అంశాన్ని అడ్డుపెట్టుకుని పార్లమెంటులో ప్రతిపక్షాలు ఆందోళన చేశాయని మండిపడ్డారు. అవిశ్వాసం వీగిపోవడం విపక్ష కూటమికి చెంపపెట్టులాంటిదని అన్నారు.