మీ బాస్​లు ఢిల్లీలో మా బాస్​గల్లీలో!

మీ బాస్​లు ఢిల్లీలో మా బాస్​గల్లీలో!
  • ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నేతలను తరిమి కొట్టడం ఖాయం
  • హస్తిన నుంచి ఆదేశాలు వస్తే తప్ప మాట్లాడలేని దుస్థితి వారిది
  • ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్


ముద్ర, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ నేతలపై ఆధారపడ్డ పార్టీలను వచ్చే ఎన్నికల్లో ప్రజలు తరిమికొట్టడం ఖాయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాలన్నీ అక్కడే ఉంటాయన్నారు. ఇక ఆ పార్టీ నేతలు ఏం మాట్లాడాలన్నా ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. వారికి బాస్ లు ఢిల్లీలో ఉంటే, బీఆర్ఎస్ కు బాస్ రాష్ట్ర గల్లీల్లోనే ఉంటారన్నారు.  ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా క్షణాల్లో జరిగిపోతుందన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లాలో ఐటీ టవర్, న్యాక్ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు నిల‌బ‌డాలన్నా, కూర్చోవాలన్నా ఢిల్లీకి పోవాలన్నారు. కానీ మనకు (బీఆర్ఎస్) ఆ దుస్థితి పట్టలేదన్నారు. పార్టీకి బాసులు రాష్ట్ర గ‌ల్లీల్లో ఉన్నార‌న్నారు. రైతుబంధు, రైతుబీమా, ద‌ళిత బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ఆలోచ‌నలు రాగానే వాటిని సీఎం కేసీఆర్ అప్పటికప్పుడు అమ‌లు చేశారన్నారు. ఇలా ఢిల్లీ పార్టీల‌కు సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. వాళ్లు ఒక్క హామీ ఇవ్వాల‌న్నా.. దాన్ని అమ‌లు చేయాల‌న్నా ఢిల్లీకి పోవాల్సి ఉంటుందన్నారు. 

  • రేవంత్​రూ.50 లక్షలతో దొరికిన క్రిమిన‌ల్..

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచులు మోసేటోడు అని కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓట్ల కోసం రూ.50 లక్షలతో దొరికిన ఒక థ‌ర్డ్ క్లాస్ క్రిమిన‌ల్ అని వ్యాఖ్యానించారు. మళ్లీ ఓట్ల కోసం చిల్లర ప్రయత్నాలు మొదలుపెట్టారని విమర్శించారు. ఆ పార్టీకి దిక్కులేని రేవంత్ ను పీసీసీ అధ్యక్షుడిగా చేస్తే రైతుల‌కు మూడు గంట‌ల క‌రెంట్ ఇస్తే స‌రిపోత‌ద‌ని అంటున్నాడని మండిపడ్డారు. మూడు గంట‌ల కాంగ్రెస్ కావాలా లేక  మూడు పంట‌ల కేసీఆర్ కావాలో ప్రజలు తేల్చోకోవాలన్నారు. మరోవైపు ఓట్ల  కోసం మ‌తం పేరిట రాజకీయాలు చేస్తున్న బీజేపీని కూడా తరిమితరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.  హ‌ర్యానాలో మ‌తం పేరిట దాడులు చేసుకుంటున్నారన్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మపురి అర‌వింద్ డిపాజిట్ గ‌ల్లంతు ఖాయమన్నారు. నిజామాబాద్ ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారన్నారు. తెల్లారిలేస్తే చిల్లర మాట‌లు, చిల్లర పంచాయ‌తీలు చేస్తున్నారంటూ అర‌వింద్‌పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. మ‌తాల మ‌ధ్య పంచాయ‌తీ పెట్టే పిచ్చి మాట‌లు త‌ప్ప ఒక్క మంచి మాట రాదన్నారు. 

  • 60 ఏళ్లలో ఐటీ హబ్ లు రాలేదు..

 బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్  అన్నారు. కేసీఆర్ హయంలో రాష్ట్రంలో పట్టణాలు, పల్లెలు బ్రహ్మాండంగా బాగుప‌డుతున్నాయన్నారు. గ‌త 60 ఏండ్ల కాలంలో ద్వితీయ శ్రేణి న‌గ‌రాల‌కు ఐటీ హ‌బ్‌లు రాలేదన్నారు. కానీ ఇవాళ జిల్లా కేంద్రాల‌కు ప‌రిశ్రమలు, ఐటీ కంపెనీలు ప‌రుగులు పెడుతున్నాయన్నారు. ఐటీ హ‌బ్ అంటే కేవ‌లం బిల్డింగ్ కాదన్నారు. యువ‌త ఆశ‌ల‌కు, ఆకాంక్షల‌కు  ప్రతిబింబమన్నారు. ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునేది అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలేనని అన్నారు. ఇక్కడ  రూ.50 కోట్లతో ఐటీ హ‌బ్ నిర్మించామన్నారు. అలాగే డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లొమా చ‌దివిన 1,400 మంది పిల్లలకు ఉద్యోగాలు క‌ల్పించామన్నారు. ఐటీ హ‌బ్ ప‌క్కనే ప్రత్యేకంగా రూ. 11 కోట్లతో న్యాక్ బిల్డింగ్‌తో పాటు హాస్టల్ వ‌స‌తిని ఏర్పాటు చేశామ‌న్నారు. దీనిని కూడా డిప్లొమా, ఐటీఐ, టెన్త్ విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. గత పాల‌కులు ఈ జిల్లాను ప‌ట్టించుకోలేదని విమర్శించారు. కానీ కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఆకుప‌చ్చగా క‌న‌ప‌డుతోందన్నారు. భూమాత ఆకుప‌చ్చ చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో.. ఆ మాదిరిగా ఆకుప‌చ్చ తెలంగాణ ఆవిష్కృత‌మ‌వుతోందన్నారు.