చివరి దశకు లిక్కర్ దరఖాస్తులు

చివరి దశకు లిక్కర్ దరఖాస్తులు
  • నేటితో ముగియనున్న గడువు
  • ఇప్పటికి దరఖాస్తులు 68 వేలు
  • ఆదాయం రూ. రూ.1036 కోట్లు
  • ఇంకా పెరగనున్న దరఖాస్తులు

ముద్ర, తెలంగాణ బ్యూరో:మద్యం టెండర్లు చివరి దశకు చేరుకున్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు గడువు శుక్రవారంతో ముగియనున్నది. ఈ యేడాది కూడా భారీస్థాయిలోనే దరఖాస్తులు వచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. ప్రభుత్వం ఆశించిన మేరకు దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకూ 68వేల దరఖాస్తులకు రూ.1036 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. గురువారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కావడంతో మరింత ఎక్కువ స్థాయిలో దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు. 2,620 షాపులకు 80 వేలకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. నిరుడు  ఈ షాపులకే 60,433 దరఖాస్తులకు రూ. 1208.66 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ యేడాది ప్రభుత్వం అనుకున్న ప్రకారం రూ.2000 కోట్ల నుంచి రూ.2200 కోట్ల వరకు రానున్నట్లు తెలుస్తున్నది. శుక్రవారం భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది. మరో మూడు, నాలుగు నెలలో ఎన్నికలు ఉండడంతో సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం వద్ద నిధుల్లేవు. దీంతో ఒక పక్క భూములను అమ్మడంతో పాటు మద్యం టెండర్లను కూడా ఆహ్వానించింది. డిసెంబర్ ఒకటి​నుంచి నూతన మద్యం షాపులు తెరుచుకోనున్నాయి.