3 నుంచి టీచర్ల బదిలీలు!

3 నుంచి టీచర్ల బదిలీలు!
  • కసరత్తు షురూ చేసిన ప్రభుత్వం 
  • ఒకట్రెండు రోజులలో షెడ్యూల్ విడుదల
  • నెల రోజులలోగా పూర్తి చేయాలని నిర్ణయం

ముద్ర, తెలంగాణ బ్యూరో:ఉపాధ్యాయుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల మూడవ తేదీ నుంచి టీచర్ల బదిలీల ప్రక్రియ ను షూరు చేయనుందని సమాచారం. ఈ మేరకు ఒకటి, రెండు రోజులలో ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది.ఈ ప్రక్రియను  నెల రోజులలోగా పూర్తి చేయాలని భివిస్తోంది. ఇటీవల టీచర్ల బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో కేసీఆర్ ప్రభుత్వం ముందడుగు వేసింది. తుది తీర్పునకు లోబడే బదిలీలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ బదిలీ ప్రక్రియలో భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులైతే వారికి అదనపు పాయింట్లు కేటాయించనున్నారు. టీచర్ల బదిలీలపై జనవరిలోనే షెడ్యూల్ విడుదలైంది. హైకోర్టు స్టే ఇవ్వడంతో ఇన్నాళ్లు జాప్యం జరిగింది. ఇటీవలే న్యాయస్థానం స్టే ఎత్తివేయడంతో బదిలీలకు అవరోధాలు తొలగిపోయాయి. ఈ విషయంపై గురువారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి స్పందించారు. హైకోర్టు చెప్పిన ప్రకారమే రాష్ట్రంలో టీచర్లకు బదిలీలు లేదా పదోన్నతులు ఉంటాయని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత, కొత్తగా నోటిఫికేషన్ ను విడుదల చేసి ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. వీటన్నిటి మీద అభ్యర్థులు దృష్టిని సారించకుండా డీఎస్సీకి ప్రత్యేక శ్రద్ధతో శిక్షణ తీసుకోవాలని మంత్రి సూచించారు.