మాది ‘నినాదాల’ పార్టీ కాదు

మాది ‘నినాదాల’ పార్టీ కాదు
  • వాటిని నిజం చేసే సర్కారు మాది
  • ఇపుడు దేశమంతా తెలంగాణ మోడలే
  • రాష్ట్రంలో మూడోసారి అధికారం ఖాయం
  • వెకిలి చేష్ఠల పార్టీలు ఎక్కువవుతున్నాయి
  • విపక్షాల మీద మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

ముద్ర, తెలంగాణ బ్యూరో:అన్ని పార్టీలు ఎన్నికలు రాగానే నోటికొచ్చిన వాగ్ధానాలు చేస్తాయని మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కొన్ని పార్టీలు నినాదాలు ఇచ్చేవే అయితే, బీఆర్ఎస్‌ మాత్రం నినాదాలను నిజం చేసే పార్టీ అని అన్నారు. నకిలీ మాటలు, వెకిలి చేష్టలు చేసే పార్టీలు ఎక్కువయ్యాయని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ స్లోగన్‌ సర్కార్‌ కాదని, సొల్యూషన్‌ సర్కారని స్పష్టం చేశారు. అనతి కాలంలోనే దేశానికే రాష్టాన్ని ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఇప్పుడు దేశమంతా తెలంగాణ మోడల్ హవా కొనసాగుతోందన్నారు.హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ఎంఆర్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు యాతాకుల భాస్కర్‌ మంత్రి హరీశ్‌ రావు ఆధ్వర్యంలో గురువారం  బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చి హామీలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సొంత రాష్ట్రమైన కర్ణాటకలోనే అమలవుతలేవన్నారు. కర్ణాటకలో బీజేపీపై ప్రజలకు కక్కొస్తే కాంగ్రెస్‌ గెలిచిందన్నారు. అమిత్‌ షాకు తెలంగాణపై అవగాహన లేదని, ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ చదివి పోయారని ఎద్దేవా చేశారు. ముందు ఆయన గుజరాత్‌ గుడ్డి పాలనను సరిచేసుకోవాలని హితవు పలికారు. గిరిజనుల గురించి మాట్లాడే హక్కు బీజేపీ, కాంగ్రెస్లకు లేదన్నారు. తండాలను గ్రామాలుగా మార్చామని, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. వాళ్లు ఎన్ని హామీలు ఇచ్చినా, కుట్రలు, కుతుంత్రాలు చేసినా రాష్ట్ర ప్రజలు విశ్వసించరన్నారు.ఆ రెండు పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు మత కలహాలు, కరెంట్ సమస్యలు, నీళ్ల కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. అన్ని వర్గాల ప్రజలను గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ నే ప్రజలు మళ్లీ గెలిపించనున్నారన్నారు. ముచ్చటగా మూడవ సారి కేసీఆర్‎ను  సీఎం చేస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. 

భక్తిని చాటుకున్నాం
అంబేద్కర్ ఓవర్‎సీస్ స్కాలర్‎షిప్ కింద దళితులకు కేసీఆర్ సర్కార్ రూ.20 లక్షలు ఇస్తున్నదని మంత్రి చెప్పారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, 80కి పైగా మహిళా డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. 1200 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, 125 అడుగుల అంబెద్కర్ విగ్రహాన్ని పెట్టామన్నారు. సెక్రెటేరియట్‎కు అంబేద్కర్ పేరుపెట్టి భక్తిని చాటుకున్నామని తెలిపారు. పార్లమెంట్‎కు ఆ మహనీయుడి పేరు పెట్టమంటే కేంద్రం ముఖం చాటేసిందని విమర్శించారు. అంబేద్కర్ మార్గంలో నడుస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. భాస్కర్ సేవలను బీఆర్ఎస్ తప్పకుండా ఉపయోగించుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానం కల్పిస్తుందని తెలిపారు.