స్టేట్​లో నేషనల్​

స్టేట్​లో నేషనల్​
  • ఇటు బీజేపీ.. అటు కాంగ్రెస్​
  • ఓరుగల్లులో కాషాయం కవాతు
  • మరోసారి రాష్ట్రానికి అమిత్​ షా
  • విమోచన దినం వేడుకలకు హాజరు
  • సీడబ్ల్యూసీ సమావేశాలకు కాంగ్రెస్​ప్లాన్​

ముద్ర, తెలంగాణ బ్యూరో:రాష్ట్రంపై జాతీయ పార్టీలు కన్నేశాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు వరస పర్యటనలు మొదలుపెడుతున్నారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్​షా గత నెల 27న ఖమ్మం సభకు వచ్చి వెళ్లగా, మరోసారి రాష్ట్రానికి రానున్నారు. కాంగ్రెస్​ కీలక సమావేశానికి కూడా హైదరాబాద్​వేదిక కానున్నది. వరంగల్ వేదికగా కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథిగా అమిత్ షా పాల్గొంటారు. నిరుటి నుంచి సెప్టెంబర్ 17ను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి హైదరాబాద్​లో కాకుండా వరంగల్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర భద్రత దళాలతో వరంగల్‌లో కవాతు నిర్వహణకు ప్లాన్ రూపొందిస్తున్నారు. ఈ కవాతులో అమిత్ షా గౌర వందనం స్వీకరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెంచిన నేపథ్యంలో అమిత్ షా పర్యటన ఆసక్తికరంగా మారనుంది. కీలక అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పర్యటనలో అమిత్‌ షా పలు అంశాలపై చర్చించనున్నారు.  
 
సీడబ్ల్యూసీ మీటింగ్​ ఇక్కడే

కాంగ్రెస్​ పార్టీ కూడా హైదరాబాద్​ వేదికగా కీలక సమావేశానికి సిద్ధమవుతున్నది. సీడబ్ల్యూసీ సమావేశాలను ఇక్కడే నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నెల 18న నిర్వహించే సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్​, ప్రియాంకతో పాటుగా ఏఐసీసీ చీఫ్​ ఖర్గే, ఇతర నేతలు వస్తారని ప్రాథమికంగా తెలిసింది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.