తగ్గిన బీజేపీ దూకుడు

తగ్గిన బీజేపీ దూకుడు
  • సీనియర్లంతా సైలెంట్
  • పార్టీ శ్రేణులలో గందరగోళం
  • బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేననే భావన 
  • తిప్పికొట్టలేకపోతున్న రాష్ట్ర నాయకత్వం

ముద్ర, తెలంగాణ బ్యూరో:కొద్ది రోజులుగా బీజేపీ దూకుడు తగ్గిపోయింది. సీనియర్ నేతలంతా ఉన్నట్టుండి సైలెంట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతున్నదో  క్షేత్ర స్థాయి శ్రేణులకు అంతుబట్టడం లేదు. అంత బాగానే ఉందని పార్టీ ముఖ్యనేతలు పదేపదే చెబుతున్నప్పటికీ, అలాంటి పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదని బీజేపీలోనే అంతర్గత చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు అధికార బీఆర్ఎస్ తో నువ్వా? నేనా? అంటూ బీజేపీ పోటీ పడింది. అనేక అంశాలలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. అలాంటి పార్టీ ప్రస్తుతం ఎందుకనో ఒక్కసారిగా నెమ్మదించింది. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చాంశనీయంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉన్న చందంగా ఉంటాయని అంతా భావించారు. కానీ,  ప్రస్తుతం కమలంలో  నెలకొన్న పరిణామాలు చూస్తుంటే ఆ పార్టీ నేతలకే విశ్వాసం కలగడం లేదు. రాష్ట్రంలో ఎన్నికల జంగ్ ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యకు షిఫ్ట్ అయిందా? అన్నట్లుగా ఉంది. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రంలో పర్యటించారు. అయినప్పటికీ పార్టీ తీరు  మారిన దాఖలాలు కనిపించడం లేదు.

వాస్తవానికి బీఆర్ఎస్, బీజేపీ మధ్య సంబంధాలు చెడిన తర్వాత కేసీఆర్ కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. ధాన్యం సేకరణతో మొదలైన యుద్ధం కర్ణాటక ఎన్నికల వరకూ కొనసాగింది. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకించింది. దీంతో ఈ పోటీలో కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితం అయింది. తెలంగాణలో జరిగిన ఉపఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ నడిచింది. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్ విజయాలతో తెలంగాణలో బీజేపీ బలపడిందన్న సంకేతాలు వచ్చాయి. ఈ ఎన్నికలలో బీజేపీ గ్రాఫ్ ఎంత స్పీడ్ గా పెరిగిందో అంతే స్పీడ్ గా పడిపోయిందన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. మునుగోడు ఓటమి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పుతో బీజేపీ డీలాపడింది. ఎప్పుడూ కాంగ్రెస్ లో కనిపించే అంతర్గత కుమ్ములాటలు బీజేపీకి పాకాయి. ముఖ్యనేతలంగా ‘ఎవరి వారే యమునా తీరే’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. కీలక నేతలంతా మొక్కుబడిగా మీడియా సమావేశాలను నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి రెడీ అవుతోంది. బీఆర్ఎస్ ఇప్పటికే 115 మంది అభ్యర్ధుల జాబితాను కూడా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ఇలా బీఆర్ఎస్, కాంగ్రెస్ దూకుడు మీదుంటే, బీజేపీలో మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చేరికల కోసం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నాయకత్వంలో ప్రత్యేకంగా కమిటీ వేసినా ఉపయోగం లేకుండాపోయింది. మొదట రెండు సమావేశాలు నిర్వహించిన ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ ఆ తర్వాత అతిగతీ లేకుండా పోయింది. కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యాక ఈటల రాజేందర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి వాళ్లంతా పార్టీకి అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలే చెబుతున్నారు. 

కవితను అరెస్టు చేయకపోవడం?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తామని కేంద్ర దర్యాప్తు సంస్థలు చెప్పాయి. బీజేపీ నేతలు కూడా పదేపదే చెప్పారు. కవిత అరెస్టు తప్పదన్న ప్రచారం జరిగింది. తీరా చూస్తే కవితను సీబీఐ, ఈడీ అరెస్టు చేయలేదు. ఈ కేసు నుంచి కవితను దాదాపు తప్పించారనే ప్రచారం ఊపందుకుంది. కవితను అరెస్టు చేయకుండా కేసీఆర్, కేటీఆర్‌లు కేంద్రంతో రహస్య ఒప్పందం చేసుకున్నారని కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు ఆరోపించాయి. కేంద్రంపై గతంలోలాగా కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేయడం లేదు. కాంగ్రెస్‌పైనే బీఆర్ఎస్ గురిపెట్టింది. బీజేపీ కూడా కేసీఆర్‌కు అనుకూల చర్యలు ప్రారంభించినట్లు అనిపించింది. కేసీఆర్‌కు అనుకూలంగా ఉంటారనే పేరున్న కిషన్ రెడ్డికి తెలంగాణ పగ్గాలు అప్పగించిందని  ప్రచారం కూడా ఉంది.  తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే భావన ఏర్పడింది.  రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం కూడా ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు. దీని వెనుక కూడా పార్టీ నేతల్లో అంతర్గతంగా నెలకొన్న విబేధాల కారణంగా రాజాసింగ్ వ్యవహారం మూలకుపడిందన్న ప్రచారం సాగుతోంది.