మావోయిస్ట్ అగ్ర నేత కటకం సుదర్శన్ అనారోగ్యం తో మృతి

మావోయిస్ట్ అగ్ర నేత కటకం సుదర్శన్ అనారోగ్యం తో మృతి
  • కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా కొనసాగుతున్న కటకం సుదర్శన్   
  • కటకం సుదర్శన్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల బస్తీవాసి
  •  గెరిల్లా వార్ లో కటకం సుదర్శన్ దిట్ట..

మావోయిస్టు పార్టీ ప్రకటన

మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ కటుకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, అలియాస్ దూలా(69) అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. మే 31న దండకారణ్య అటవీ ప్రాంతంలో గుండెపోటుకు గురై మరణించినట్టు పార్టీ కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో తెలిపారు. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, డయాబెటీస్, బీపీ వంటి సమస్యలతో గత కొన్నేళ్లుగా బాధపడుతున్న ఆయన గత బుధవారం మద్యాహ్నం 12.20 గంటలకు గుండెపోటుకు గురై మరణించినట్టు వివరిచారు.

ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం, కార్యకర్తలు, దళ కమాండర్లతో పాటు వందలాది మంది సుదర్శన్ స్మారక సభ నిర్వహించిన అనంతరం విప్లవ సాంప్రదాయాలతో అంత్యక్రియలు నిర్వహించినట్టు అభయ్ పేర్కొన్నారు. జూన్ 5 నుండి ఆగస్టు 3 వరకు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, విద్యా సంస్థల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో ఆనంద్ స్మారక సభలు నిర్వహించాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.

నేపథ్యం ఇది...

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని కార్మిక కుటుంబంలో 69 ఏళ్ల క్రితం జన్మించిన సుదర్శన్ శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో 1974లో మైనింగ్ డిప్లోమా విద్యార్థిగా విప్లవోద్యమం వైపు అడుగులు వేశారు. 1975లో రాడికల్ విద్యార్థి సంఘం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన సుదర్శన్ ఆ తరువాత బెల్లంపల్లి పార్టీ సభ్యుడిగా పనిచేశారు. ఈ సమయంలో సింగరేణి కార్మిక ఉద్యమం, రాడికల్ విద్యార్థి విద్యార్థి ఉద్యమాల్లో ముఖ్య భూమిక పోషించారు. 1978లో లక్షెట్టిపేట, జన్నారం ప్రాంతాల పార్టీ ఆర్గనైజర్ గా రైతాంగ ఉద్యమాన్ని నాయకత్వం వహించారు.

1980లో ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా 1987లో దండకారణ్య ఫారెస్ట్ కమిటీకి ప్రాతినిథ్యం వహించారు. 1995లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కార్యదర్శిగా, 2001లో రెండో సారి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయిన ఆయన సెంట్రల్ రీజనల్ బ్యూరో సెక్రటరీగా 2017 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. అనారోగ్య కారణంగా తన బాధ్యతల నుండి తప్పుకున్న  కటుకం సుదర్శన్ సీఆర్ బీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. సీఆర్బీ కార్యదర్శిగా పనిచేసినప్పుడు సీఆర్బీ మీడియా ప్రతినిధిగా, గత రెండేళ్లుగా మీడియా కమిటీ ప్రతినిధిగా పని చేస్తున్నారు.