కమలంలో కలకలం

కమలంలో కలకలం
  • బీజేపీలో ముదురుతున్న విభేదాలు
  • వచ్చేనెలలో అసంతృప్తి నేతల కీలక సమావేశం?
  • ఇప్పటికే సంజయ్ యాంటీ వర్గానికి సమాచారం
  • వ్యతిరేవర్గాన్ని ఒక్కటి చేసే ప్రయత్నాలు
  • ఇద్దరు కీలక నేతల ఆధ్వర్యంలో వ్యూహం
  • వచ్చే నెలలోనే బండి పదవీకాలం పూర్తి
  • మరింత హీట్​ పెంచుతున్న స్టేట్ చీఫ్ వ్యాఖ్యలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ‘రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మేమే’  అని చెప్పుకుంటున్న బీజేపీలో ముసలం ముదురుతున్నది. ఇప్పటి వరకు సైలెంట్ గా ఎవరికి వారు అన్నట్టుగా ఉన్న సీనియర్లు ఇప్పుడు ఒక్కటిగా నిలవాలని భావిస్తున్నారు. వచ్చే నెలలో కీలక సమావేశాన్ని నిర్వహించాలని అనుకుంటున్నారు. బీజేపీలోని ఇద్దరు సీనియర్లు దీనికి నాయకత్వం వహిస్తున్నారు. రాష్ట్రాధ్యక్షుడిగా బండి సంజయ్ ను మార్చేది లేదంటూ ఆ పార్టీ జాతీయ నేతలు సంకేతాలిస్తూనే ఉన్నారు. రాష్ట్ర సీనియర్లు మాత్రం తమ ప్రయత్నాలను తగ్గించడం లేదు. వచ్చే నెలలోనే స్టేట్​ చీఫ్​గా బండి సంజయ్​ రెన్యూవల్​ కావాల్సి ఉంది. 2020, మార్చి 10న సంజయ్​ ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా జాతీయ నాయకత్వం ప్రకటించింది. ఈ యేడాదిలోనే  అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికిప్పుడు సంజయ్ ను మార్చే అవకాశం లేదని ఓ వర్గం ప్రచారం చేస్తుండగా, మరో వర్గం మాత్రం చాన్స్​ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే  పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు. 

విభేదాలు బహిర్గతం
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ స్పీడ్​ పెంచింది. రాష్ట్రంలో పార్టీ నేతలు టూర్లు పెంచారు. అధికారం చేజిక్కించుకోవటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. సౌత్‌పై ఫోకస్ పెట్టిన బీజేపీ కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావాలని ఉవ్విళూరుతున్నది. బీఆర్ఎస్‌ను గద్దెదించుతామనే ప్రకటనలు జోరందుకున్నాయి. రాష్ట్ర బీజేపీలో వివాదాలు మాత్రం తగ్గడం లేదని సమాచారం. ఇటీవల ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఈటల రాజేందర్ అన్ని పార్టీలలోనూ కేసీఆర్ కోవర్టులున్నారని, వారే పార్టీలను దెబ్బతీస్తున్నారని, వ్యూహాలను కేసీఆర్‌కు చేరవేరుస్తున్నారని విమర్శలు చేశారు. ఈటల వ్యాఖ్యలు బీజేపీలో సంచలనం సృష్టించాయి. ఇప్పటికే ఇలాంటి ఆరోపణలు కాంగ్రెస్​ నాయకత్వం ఎదుర్కుంటున్నది. ఇప్పుడు కాషాయదళంలో నిజంగానే కేసీఆర్‌ ఇన్‌ఫార్మర్లు ఉన్నారా ? ఆ నాయకులెవరు ? కేసీఆర్‌కు పరోక్షంగా సహకరిస్తున్నదెవరనేది పెద్ద చర్చకు దారి తీసింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల కోవర్టు ఆరోపణలు చేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది. లీకుల కారణంగా ఇతర పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరేందుకు వెనకడుగు వేస్తున్నారనే ఉద్దేశంతోనే ఈటల ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఆ పార్టీలోని కొంతమంది సీనియర్లు కూడా సమర్థించారు. ఈటల ఆరోపణలపై సంజయ్ మరో విధంగా మాట్లాడారు. తమ పార్టీలో కోవర్టులెవరూ లేరని, బీజేపీలో  కోవర్టులుండే ఛాన్సే లేదన్నారు. ఈటల మాటలను తప్పు పట్టారు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతోందో అర్థం కాక శ్రేణులు ఆయోమయానికి గురవుతున్నారు. 

మార్పులపైనా జోరు
 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారనే మాట కొద్ది రోజులుగా వినిపిస్తోంది. బండి సంజయ్ ను తప్పించి, ఓ బలమైన వలస నేతకు అధ్యక్ష పదవి ఇస్తారని బీజేపీవర్గాలే విస్తృతంగా ప్రచారం చేశాయి. బండి సంజయ్ కూడా దాదాపు వారం రోజులు ఢిల్లీలో మకాం వేయడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. సంజయ్​ వర్గం మాత్రం దీనికి కౌంటర్లు ఇస్తూ వచ్చింది. హైకమాండ్ దగ్గర సంజయ్​ హామీ తీసుకున్నారని, వచ్చే ఎన్నికలు ఆయన నేతృత్వంలోనే జరుగుతాయరు  భరోసా ఇచ్చి పంపించారని ప్రచారానికి దిగింది. తరుణ్​ చుగ్, జేపీ నడ్డా కూడా ఈ విషయంపై పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఇదే యేడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలుండడంతో పార్టీ అధ్య క్షుడిని మార్చడం సానుకూల పరిణామం కాదని, ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డానే అధిష్టానం కొనసాగించిందని ఉదహరిస్తున్నారు. అయినా, రాష్ట్ర  పార్టీ అధ్యక్ష పదవిని ఈటల రాజేందర్‌, డీకే అరుణ, వివేక్‌ వెంకటస్వామికి ఇచ్చే చాన్స్​ ఉందంటూ ప్రచారం జరుగుతున్నది. వీరంతా వలస నేతలే.  ఎవరికి వారు అధిష్టానం వద్ద తమకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ, ఈ బాధ్యతలు పేరుకే పరిమితమవుతున్నాయని, పార్టీలోకి ఎవరూ రావడం లేదంటూ సంజయ్​ టీం సందర్భోచితంగా ప్రచారం చేస్తూనే ఉంది. 

వరుస విభేదాలు 
ఇక, పార్టీలోని రాష్ట్ర నేతలలో అసంతృప్తి బయట పడుతూనే ఉంది. సీనియర్లకు గౌరవం ఇవ్వడం లేదని, కలుపుకుపోవడం లేదని, సంజయ్​ దూకుడు, వివాదస్పద వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతోందని, గతంలో శివం, శవం మాటలు, తాజాగా తెలంగాణలో హిందుత్వం వ్యాపించిందనే వ్యాఖ్యలు కొన్ని వర్గాలను పార్టీని దూరం చేస్తున్నాయని సంజయ్​వ్యతిరేక వర్గం  అధిష్టానానికి ఫిర్యాదు చేసిందని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఫెయిల్యూర్​ స్పష్టంగా కనిపించిందని, ఎలక్షన్​ మేనేజ్​మెంట్ లో సంజయ్​ విఫలమవుతున్నారంటూ జాతీయ నేతలకు నివేదిక ఇస్తున్నారు. వివేక్​కు మునుగోడులో బాధ్యతలు అప్పగించడం, నేతల మధ్య సమన్వయం చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు ఎదుర్కొన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలను సక్రమంగా నిర్వహించిన జితేందర్ రెడ్డికి మునుగోడులో బాధ్యతలు ఇవ్వకపోవడంతో పార్టీలోని రెడ్డి వర్గం సరిగ్గా పని చేయలేదనే విమర్శలు కూడా వచ్చాయి. ప్రచారంలో నేతల మధ్య కో ఆర్డినేషన్ లేకపోవడం, సీనియర్​నేతల మధ్య ఉన్న వ్యక్తిగత తగాదాలు కూడా ప్రభావం చూపించినట్లు అంచనా వేసుకున్నారు. అంతేకాకుండా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజురాబాద్, దుబ్బాకలో పని చేసినంత మునుగోడులో ప్రచారం చేయలేదని, దీంతో రెడ్డి వర్గాన్ని సంజయ్​ ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టే విధంగా చూశారని ఓ వర్గం బహిరంగ ప్రచారం చేసింది.  బండి సంజయ్​ కు, ఈటల రాజేందర్​ కు మధ్య కూడా విభేదాలు కొనసాగుతూ వస్తున్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు. గతంలో కరీంనగర్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వివాదం ఇంకా సమిసిపోలేదంటున్నారు. వాస్తవంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టడం లేదని అధ్యక్ష హోదాలో ప్రకటించిన బండి సంజయ్ మాటలను బేఖాతరు చేస్తూ స్వతంత్ర అభ్యర్థి రవీందర్ సింగ్ కు ఈటల మద్దతు ప్రకటించడం, ఇదే సమయంలో ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు రవీందర్ సింగ్ కు ఓటువేయడంతో నేతల మధ్య విభేదాలను మరింత పెంచింది. 

వచ్చే నెలలో కీలక భేటీ?
ప్రస్తుత  పరిస్థితులను రాష్ట్ర బీజేపీ నేతలు అనుకూల సమయంగా భావిస్తున్నారు. వచ్చే నెలలో బండి సంజయ్​ పదవీ కాలం ముగియనుండటం, ఇప్పటికే చాలా మంది సీనియర్లతో విభేదాలు రావడాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అందరి టార్గెట్​బండి సంజయే.​సమన్వయం చేసుకునేందుకు ఇద్దరు నేతలు బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. వచ్చేనెలలో  కీలక సమావేశాన్ని నిర్వహించి  నివేదికను జాతీయ నేతలకు పంపించాలని భావిస్తున్నారు. ఆయా జిల్లాలలో సంజయ్​ కు వ్యతిరేకంగా ఉండే వారికి సమాచారం ఇస్తున్నారు. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మార్చి పది లేదా ఏప్రిల్​ వరకు బండి సంజయ్​ పదవి మీద క్లారిటీ వస్తుందని, ఆలోగా సీనియర్ల తరుపున అధిష్టానానికి అల్టిమేటం పంపించాలని వ్యూహాలు వేస్తున్నారు.