ఉద్యమంలో తెగించి పోరాడింది  నిరుద్యోగ యువతే

 ఉద్యమంలో తెగించి పోరాడింది  నిరుద్యోగ యువతే
  • 9యేళ్లలో నిరుద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది
  • ధర్నా చౌక్​ 24 గంటల ఉపవాస దీక్షలో కేంద్రమంత్రి, 
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్​ రెడ్డి  

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమంలో తెగించి పోరాడింది నిరుద్యోగ యువతేనని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తొమ్మిదేళ్లుగా నిరుద్యోగ యువతను బీఆర్ఎస్  సర్కార్ మోసం చేస్తుందని ఆయన మండిపడ్డారు. 1969లో తెలంగాణ యువత ఉద్యోగాలు, భవిష్యత్ కోసం అనేక పోరాటలు చేస్తే , ఆరోజు 369మందిని కాంగ్రెస్ ప్రభుత్వ కాల్చిచంపిందని ఆయన దుయ్యబట్టారు. బుధవారం ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ నేతలు 24 గంటల ఉపవాస దీక్షలు చేపట్టారు. దీనిలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులు తినడానికి తిండిలేని దుస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాదేమోనని, కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ ఇవ్వదేమోనని 1200మంది బిడ్డలు ఆత్మబలిదానం చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. అందరికంటే ముందు.. కేసీఆర్​ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి పెట్రోల్​ పోసుకున్నాడని కానీ ఆయనకు ఇంతవరకు అగ్గిపెట్టే  దొరకలేదని పరోక్షంగా మంత్రి హరీష్ రావును ఆయన విమర్శించారు. కానీ ఆత్మబలిదానాలు చేసుకున్న వందల మంది యువకుల కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయన్నారు. ట్యాంక్​బండ్​పై మిలియన్ మార్చ్​, సాగరహారం, వంటావార్పు.. ఇదే ధర్నా చౌక్​లో యేళ్ల తరబడి నిరుద్యోగులు పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. తొమ్మిదేండ్లుగా నిరుద్యోగ యువత పట్ల కక్షసాధింపు చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం  పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. 

లక్షలాది మంది భవిష్యత్​ ఆగమయ్యాయి..
యేళ్ల తరబడి ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా, పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ నోటిఫికేషన్లు ఇవ్వకుండా, కోర్టు కేసులతో నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ అన్యాయం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. పరీక్షలు నిర్వహించినా.. ప్రభుత్వ పెద్దల అవినీతి, కేసీఆర్​ చేతకానితనం వల్ల ప్రశ్నపత్రాలు లీకై.. లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్​ ఆగమైందన్నారు.తల్లిదండ్రుల వద్ద ఉన్న బంగారం అమ్మి, అప్పులు తీసుకొని నగరంలో కోచింగ్​ తీసుకొని, వీధి లైట్ల కింద, పార్కుల్లో పస్తులు ఉండి చదువుకొని పరీక్షలు రాస్తే.. ప్రశ్నపత్రాలు లీకై.. 35లక్షల మంది నిరుద్యోగ యువత బతుకులు ఆగమయ్యాయని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా వ్యాపారం చేయాలంటే, సంస్థలు ప్రొడక్షన్​ చేసుకోవాలంటే.. రాష్ట్రంలో బీఆర్​ఎస్​ నాయకులకు వాటాలు ఇవ్వనిదే.. కొత్త పరిశ్రమలు ఇక్కడ పెట్టే పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు. నిధులు, నీళ్లు, నియామకాలు ఏమైపోయాయి?  అని ఆయన ప్రశ్నించారు. నీళ్లు.. కేసీఆర్​ మాటలు నీటి మూటలైపోయాయి కానీ.. తెలంగాణకు నీళ్లు రాలేదు. చేపట్టిన చేపడుతున్న ప్రాజెక్టుల్లో కమీషన్లతో కుమ్మక్కై ప్రజాధనం కొల్లగొట్టారని ఆయన విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబానికి నియామకాలు వచ్చాయని,  నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదన్నారు.  నిధులు ఎవరికొచ్చాయంటే.. బీఆర్ఎస్​ నాయకులుకు, అవినీతిపరులకు వచ్చాయన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. ఇవాళ అప్పులపాలై దివాళ తీసే స్థితికొచ్చిందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 10లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుందని చెప్పారు.  ప్రతీ నెల 70 నుంచి 80వేల ఉద్యోగాలు రిక్రూట్ చేస్తూ.. ప్రధాన మంత్రి స్వయంగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తుందన్నారు. గతంలో ఇలా ఎవరైనా ఇచ్చారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగాలు కల్పించే విషయంలో మోడీ గారికి ఉన్న కమిట్​మెంట్ ను యువత అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.  ముద్ర, స్టాండప్, స్టార్టప్ లాంటి పథకాల కింద లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారన్నారు. నిరుద్యోగుల కోసం బీజేపీ పోరాటం చేస్తే.. కేసులు పెట్టి, జైళ్లకు పంపారు. కానీ నిరుద్యోగులకు అన్యాయం జరిగితే మేము చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి హెచ్చరించారు.