గజ్వేలు గడ్డపై కేసీఆర్ ను ఓడిస్తా

గజ్వేలు గడ్డపై కేసీఆర్ ను ఓడిస్తా
  • తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోంది 
  • వచ్చే ఎన్నికలలో కేసీఆర్ కు తగిన గుణపాఠం తప్పదు
  • తెలంగాణ పల్లెల్లో మందు గోలీలకు గతి లేదు కానీ ఊరూరా మద్యానికి కొదవలేదు
  • సీఎం కేసీఆర్ పై నిప్పులు చేరిన మాజీమంత్రి ఈటెల రాజేందర్

ముద్ర, అచ్చంపేట:వచ్చే మూడు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్ గడ్డపై పోటీ చేసి అతన్ని ఓడిస్తానని బిజెపి రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో బిజెపి బూతు స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అచ్చంపేట నల్లమల ప్రాంతానికి ఈటెల రాజేందర్ మొట్టమొదటిసారిగా రావడంతో బిజెపి శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి గజమాలను సమర్పించారు అనంతరం సమావేశం మందిరానికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ దేశంలో ప్రజలు కట్టిన ప్రతి పైసలు పొదుపు చేసిన డబ్బు ను ప్రధాని మోడీ  సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతూ దేశాన్ని  అభివృద్ధి పథం వైపు తీసుకు వెళుతుంటే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మాత్రం కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్ళించి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు కల్యాణ లక్ష్మికి గ్రామపంచాయతీల అభివృద్ధికి పేద ప్రజలకు తానే సొంతంగా ఖర్చు చేసి ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడుతున్నానని కలరింగ్ చేస్తూ తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిజెపి పార్టీలో కుటుంబం లో  ఒకరి మాత్రమే పదవి ఉంటుంది తప్ప రెండు పదవులు ఉండవని ఆయన ఘంటా పతంగా తెలిపారు. తెలంగాణలోని మారు మూల  పల్లెలో వైద్యానికి మందులు కరువయ్యాయి కానీ తెలంగాణలోని ప్రతి  పల్లెలో ఏ అర్ధరాత్రి పోయిన మద్యానికి మాత్రం కొదవలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మద్యం తెలంగాణగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సీఎం కేసీఆర్ కుటుంబంలో ముఖ్యమంత్రి ఆయన కొడుకు మంత్రి, ఆయన బిడ్డ ఎమ్మెల్సీ ,ఆయన అల్లుడు మంత్రి, ఆయన తోడలికొడుకు పదవులు,ఆయన  పెద్దన్న కొడుకుకు పదవులు ఈ రకంగా తన కుటుంబంలోనే రాజకీయ పదవులను మంత్రి పదవులను అంటగట్టి కుటుంబ పాలనను సాగిస్తూ తెలంగాణను నిలువున మోసం చేస్తూ దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ ను ఓడించేందుకు 650 కోట్ల రూపాయలను ఖర్చు చేసిన చివరకు హుజురాబాద్ ప్రజలు తెలంగాణ పోరాట యోధునికి కడుపులో పెట్టుకొని విజయం సాధించి పెట్టారని ఆ గొప్పతనం హుజురాబాద్ ఈ తెలంగాణ ప్రజలకే దక్కిందని అన్నారు. హుజురాబాద్ లో ఈటలను ఓడించాలని గల్లి గల్లికి కుల సంఘాలకు నిధులు, దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఏకమై ప్రజలను మభ్యపెట్టి మద్యం డబ్బును ఖర్చుపెట్టిన ప్రజలు మాత్రం నిష్పక్షపాతంగా ఈటెల రాజేందర్ ను గెలిపించారని ఆయన అన్నారు. రాష్ట్రం రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికలలో సీఎం కేసీఆర్ ను గద్దేదించి ఆయనను ఇంటికి సాగనంపడం ఖాయమని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు అచ్చంపేట నియోజకవర్గం సతీష్ మాదిగ స్థానిక నాయకులు నియోజకవర్గం లోని వివిధ మండలాలకు చెందిన బూతు సాయి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.