టార్గెట్​ ఇందూర్!

టార్గెట్​ ఇందూర్!
  • తనయ కోసం తండ్రి ముందు చూపు!
  • నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు చెక్​పెట్టే వ్యూహం?
  • అందుకే గజ్వేల్​తోపాటు కామారెడ్డి నుంచి పోటీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ​గజ్వేల్ తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలోనూ పోటీ చేయనున్నారు. దీంతో సీఎం స్ట్రాటజీ ఏమై ఉంటుందా? అని రాజకీయవర్గాలకు అంతుబట్టడం లేదు. 2018 ముందస్తు ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేసి గెలిచిన కేసీఆర్.. ఇపుడు ఊహించని విధంగా సిట్టింగ్​స్థానంతోపాటు కామారెడ్డి నుంచీ బరిలో దిగనున్నారు. సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ కు తిరిగి గజ్వేల్ నుంచి గెలవడం కష్టమేమీ కాదనే ప్రచారం జరుగుతోంది. అయినా కామారెడ్డి నుంచి బరిలో నిలవాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. 

  • ఎమ్మెల్సీ కవిత కోసమేనా..?

తన కుమార్తె కవిత కోసమే కేసీఆర్​కామారెడ్డి నుంచి పోటీకి దిగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన కవిత.. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పై ఓడిపోయారు. ఏకంగా సీఎం కుమార్తె ఓడిపోవడం అప్పట్లో రాజకీయ చర్చకు దారితీసింది. బిడ్డను గెలిపించుకోవడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారనే ప్రచారం జరిగింది. అప్పట్లో లోక్​సభ పరిధిలోని ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్​బలంగా ఉన్నా.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలవడాన్ని సీఎం జీర్షించుకోలేకపోయారు. తర్వాత పరిణామాలతో ఎంపీ అరవింద్ అనేక సందర్భాల్లో కవితపై విమర్శలు చేశారు. ఇటు కవిత సైతం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ ను ఓడిస్తానంటూ శపథం చేశారు. కానీ ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో బీజేపీ బలంగా ఉండడం.. వచ్చే ఎన్నికల్లో కవిత గెలుపునకు స్పష్టమైన అవకాశాలు లేకపోవడంతో ఆ జిల్లాలో పార్టీ బలోపేతం బాధ్యతలను కేసీఆర్ తన భుజాలపై వేసుకున్నారు. కామారెడ్డి నుంచి పోటీ చేయడం ద్వారా ఉమ్మడి జిల్లా పార్టీలో ఊపు తేవాలని కేసీఆర్ భావిస్తున్నారు. కామారెడ్డి నుంచి గెలిచాక ఉమ్మడి జిల్లాలో పార్టీ పరిస్థితిపై దృష్టిసారించాలని భావిస్తున్నారు. ఏదేమైనా రానున్న రోజుల్లో ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో పార్టీ బలోపేతం, కవిత గెలుపుపై ఇప్పట్నుంచే చర్చ మొదలైంది.