కామారెడ్డిలో  కేసీఆర్ ను ఓడిస్తాం

కామారెడ్డిలో  కేసీఆర్ ను ఓడిస్తాం
  • ఓటమి భయంతోనే రెండు స్థానాల నుంచి పోటీ
  • సూర్యాపేట సభలో శ్రీకాంతాచారి తల్లికి అవమానం
  • కమ్యూనిస్టులను వాడుకుని వదిలేశారు
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ సవాల్ ను కేసీఆర్ స్వీకరించకుండా సీఎం కేసీఆర్ ఓటమిని ఒప్పుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి గొంతులో భయం, ఓటమి స్పష్టంగా కనిపించిందన్నారు. మొత్తం సిట్టింగులకు సీట్లు ఇవ్వకపోవడం, అలాగే   కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడమే దీనికి సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. తన సవాల్ ను స్వీకరించకుండా కేసీఆర్ సిట్టింగుల స్థానాలు మార్చారన్నారు. సోమవారం గాంధీ భవన్​లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. 

  • 2/3 మెజారిటీతో అధికారంలోకి వస్తాం..

సీఎం కేసీఆర్ కామారెడ్డికి పారిపోతున్నారని తాను మొదటి నుంచి చెప్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ లిస్ట్ చూస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. 2/3 మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. కేసీఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారంటే ఆయన స్వయంగా తన  ఓటమిని ఒప్పుకున్నట్లేనని వ్యాఖ్యానిచారు. రుణమాఫీ పేరుతో కేసీఆర్ అతి తెలివితేటలు ప్రదర్శించారని రేవంత్ విమర్శించారు. రూ 99,999 వరకు మాత్రమే రుణమాఫీ చేసి కేసీఆర్ రూ. 11 వేల కోట్లు మిగుల్చుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒక్క రూపాయి అని అందరు అనుకుంటున్నారు కానీ దాని వల్ల వేలమంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో ప్రభుత్వానికి రూ.11వేల కోట్లు మిగిలాయన్నారు. 

  • కామారెడ్డిలో షబ్బీర్​ దే గెలుపు!

కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న కేసీఆర్​ను ఓడించి.. షబ్బీర్ అలీని గెలిపించుకుని తీరుతామని రేవంత్​రెడ్డి సవాల్​విసిరారు. ‘కేసీఆర్.. నీ భవన్ గోడలపై రాసుకో.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రూ.4 వేలు పింఛన్​ఇస్తాం’ అన్నారు. ఐఆర్బీ నుంచి వచ్చిన సొమ్ముతో పెట్టుబడి పెట్టేందుకు కేటీఆర్ అమెరికా వెళ్లారు అని వ్యాఖ్యానించారు. ఏ పెద్ద ఒప్పందం జరిగినా పది రోజులకు మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్తారని విమర్శించారు. ఆగస్టు 20న సూర్యాపేటలో జరిగిన సభలో శ్రీకాంతాచారి తల్లిని నిలబెట్టి కేసీఆర్ అవమానించారని, అమరవీరుల కుటుంబానికి కనీస గౌరవం ఇవ్వలేదని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో దోస్తానా చేసుకుని.. ఇప్పుడు కరివేపాకులా కమ్యూనిస్టు పార్టీలను వాడుకొని పారేశారని దుయ్యబట్టారు. మోసం చేసిన కమ్యూనిస్టులు కేసీఆర్ పై తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బాన్సువాడ, వర్ధన్నపేట, ముథోల్ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.