అత్త ఇంటిపై అల్లుడి విష ప్రయోగం

అత్త ఇంటిపై అల్లుడి విష ప్రయోగం
  • లండన్​నుంచి ప్లాన్​చేసిన ఘనుడు
  • మసాలా పొడులు, పసుపు, కారంలో పాయిజన్
  • జూలైలో అత్త మృతి, మరో ఆరుగురికి తీవ్ర అస్వస్థత
  • పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు
  • భార్యతో విభేదాలే కారణం

ముద్ర, తెలంగాణ బ్యూరో : భార్యతో విభేదాలు రావడంతో ఆమె కుటుంబంపై కక్షగట్టాడు. భార్య కుటుంబం మొత్తాన్ని అంతమొందించాలని లండన్​నుంచి ఆ కుటుంబంపై విషప్రయోగం చేయించాడు. ఫలితంగా అత్త ప్రాణాలు కోల్పోగా, మిగతావారు తీవ్ర అనారోగ్యంపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన హైదరాబాద్ లోని మియాపూర్ లో జరిగింది. పోలీసుల దర్యాప్తులో అత్తింటివారిని అంతం చేయాలనే కుట్రతో బాధిత కుటుంబానికి చెందిన సొంత అల్లుడు ముప్పవరపు అజిత్ కుమార్ విషప్రయోగం చేయించాడనే విషయం వెలుగులోకి వచ్చింది. 

  • కొంపముంచిన విభేదాలు..

మియాపూర్ లోని గోకుల్ ప్లాట్స్‌లో నివాసం ఉంటున్న హనుమంతరావు, మాహేశ్వరి దంపతుల కుమార్తె డాక్టర్ శిరీషకు 2018లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అజిత్ కుమార్‌తో వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా వీరిద్దరూ లండన్‌లో స్థిరపడ్డారు. వీరికి ఓ కుమార్తె ఉంది. కొంతకాలం తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో శిరీష లండన్‌లోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి శిరీష, అజిత్ కుమార్ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భార్యపై కోపం పెంచుకున్న భర్త అజిత్ కుమార్ ఆమెతోపాటు ఆమె కుటుంబం మొత్తాన్ని హత్య చేయాలని భావించాడు. 

  • విఫలమైన పాయిజన్​ఇంజెక్షన్ల వ్యూహం..

అజిత్ కుమార్ అత్తింటి కుటుంబంపై పగ తీర్చుకునేందుకు తన వద్దే పనిచేసే వినోద్ కుమార్‌ను ఒప్పించాడు. వీరిద్దరికి మిత్రులైన హైదరాబాదులో ఉండే భవానీ శంకర్, అశోక్ గోపీనాథ్ తోపాటు అజిత్ స్నేహితుడు.. శిరీషకు దగ్గర బంధువైన పూర్ణానందరావుతో కలిసి కుట్రను పన్నాడు. ఈ క్రమంలో శిరీష.. తన  సోదరుడి వివాహం కోసం లండన్ నుంచి కుమార్తెతో హైదరాబాద్ వచ్చింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న అజిత్.. అత్తారింటిపై నిఘా ఉంచాడు. అలాగే వాచ్‌మెన్ కుమారుడు రమేశ్​కు కొంత నగదు ఇచ్చి అత్తారింటి వద్ద కదలికలను అన్నింటిని తెలుసుకున్నాడు. జూన్ 25న తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు విషపు ఇంజక్షన్లతో శిరీష తల్లిదండ్రుల ఇంటికి వెళ్లగా హత్యాయత్నం విఫలమైంది. ఆ తర్వాత వాల్లు ప్లాన్ మార్చారు. 

  • మసాలాలు, కారం పొడుల్లో విషం..

పాయిజన్​ఇంజెక్షన్ల పథకం విఫలం కావడంతో.. ఎవరికీ తెలియకుండా ఇంట్లో వాడే వంటింటి మసాలా పొడులు, పసుపు, కారం తదితర వాటిలో విషం కలిపి డెలివరీ బాయ్ రూపంలో వాళ్లకు అందజేశారు. శిరీష కుంటుంబం వాటిని వినియోగించడంతో ఆరుగురు తీవ్ర అస్వస్థతతకు గురయ్యారు. ఈ క్రమంలో శిరీష తల్లి ఉమామహేశ్వరి జూలై 5న మృతి చెందింది. మృతికి ఆమె అనారోగ్యమే కారణమని అంతా భావించారు. అయితే శిరీష తండ్రి, సోదరుడు, మరదలు, బంధువైన మరో మహిళ కాళ్లు చేతులు స్పర్శ కోల్పోవడంతో అనుమానం వచ్చి బ్లడ్ శాంపిల్స్ తీసి పరీక్షకు పంపారు. అందులో విష నమూనాలు ఉన్నట్లు వైద్యులు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు.. ఆ ఇంటి సీసీ ఫుటేజ్​ను గమనించి.. వాచ్ మెన్ కుమారుడు రమేశ్​ను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా అదే అపార్ట్‌మెంట్‌లో శిరీష ప్లాట్ పైన ఉండే పూర్ణానందరావు పేరు తెలిపాడు. దీంతో మొత్తం వ్యవహారం బహిర్గతం అయింది. కుట్ర అమలుకు సహకరించిన ఆరుగురిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. లండన్‌లో ఉన్న ప్రధాన నిందితుడు అజిత్ కుమార్‌ను కూడా అరెస్టు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.