‘అయ్యో’ఎస్! తెలంగాణ ఐఏఎస్!!

‘అయ్యో’ఎస్! తెలంగాణ ఐఏఎస్!!
  • స్థానిక అధికారులకు దక్కని ప్రాధాన్యం
  • నెలల తరబడి పోస్టింగులకు ఎదురుచూపులు
  • కొందరి దగ్గరే కీలక ప్రభుత్వ శాఖలు​ 
  • వారు సెలవులో వెళితే ఇన్చార్జులుగా ఐదారుగురు
  • సందీప్ కుమార్​సుల్తానియా సెలవు జీఓతో వెల్లడి
  • సీనియర్ ఐఏఎస్​అధికారులలోనూ అసంతృప్తి
  • కోఠరీ ఆఫీసర్ల తీరుతో ఉన్నతాధికారులు బేజారు
  • తమ బాధలు సీఎంకు చేరనీయడం లేదని వేదన
  • సచివాలయంలో కుప్పలుగా పేరుకుపోతున్న ఫైళ్లు 
  • ‘డిస్కస్’ అని​ రాస్తే నెలల తరబడి పెండింగ్​


ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియాకు విదేశీ పర్యటన నిమిత్తం ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది. ముఖ్యమైన జీఓలు సైతం దాచి పెట్టే ప్రభుత్వం ఈ సెలవు జీఓను మాత్రం బయటకు విడుదల చేసింది. ఈ సందర్భంగా సందీప్ కుమార్​సుల్తానియా నిర్వహిస్తున్న శాఖల జాబితాను వెల్లడించింది. రాష్ట్రంలోని కీలక శాఖ పంచాయతీ రాజ్​అండ్ రూరల్​ డెవలప్​మెంట్​కు ప్రిన్సిపల్ సెక్రెటరీగా వ్యవహరిస్తున్న ఆయన పలు శాఖలకు ఇన్చార్జిగా ఉన్నారు. టీఎస్ఆర్డీ సీఈఓ, సెర్ప్​సీఈఓ, ఫైనాన్స్​మెంబర్​సెక్రెటరీ, యువజన సర్వీసుల డైరెక్టర్, టూరిజం ఎండీ, సాట్స్​డైరెక్టర్, హెరిటేజ్ డైరెక్టర్​వంటి హోదాలన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. ఇవన్నింటినీ ఒంటిచేత్తో నిర్వహిస్తూ వస్తున్న సుల్తానియా సెలవులో వెళ్లేటపుడు మాత్రం ఐదారుగురు ఐఏఎస్​అధికారులను ప్రభుత్వం ఇన్చార్జులుగా నియమించింది. 


ముద్ర, తెలంగాణ బ్యూరో:‘రాష్ట్రం వస్తే మా ఉద్యోగాలు మాకే వస్తాయి, మా బతుకులు బాగుపడుతాయి’ అంటూ నిరుద్యోగ యువత ఉద్యమంలో ఉరకలు వేసింది. వారి కోరిక నెరవేరనూ లేదు. ‘స్వరాష్ట్రంలో మాకూ పెద్దపీట ఉంటుంది. స్థానిక సమస్యలన్నీ తెలిసిన వాళ్లం కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుంటాం, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఐఏఎస్​లు అంటేనే చిన్నచూపు చూసినవారిని తలదన్నేలా కీలక పదవులలో ఉంటాం’ అంటూ ఉన్నతాధికారుల బృందం కూడా ఆశ పడింది. తెలంగాణ కేడర్​కు చెందిన ఎంతో మంది ఐఏఎస్​లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఉద్యమానికి సహకరించారు. కానీ, వారి ఆకాంక్షలన్నీ ఊహలకే పరిమితమయ్యాయి. ఇప్పటికీ పని లేని విభాగాలకే వారు పరిమితమవుతున్నారు. కనీసం తమ ఆవేదనను సీఎం దృష్టికి తీసుకెళ్దామంటే కూడా అవకాశం లేకుండా పోతోంది. దీంతో తెలంగాణ ఐఏఎస్​లు ఇప్పుడు ఇక్కడ ఉండకుండా వేరే రాష్ట్రానికి వెళ్లిపోతే బాగుండనే బాధలో ఉంటున్నారు. కేవలం ఒక బ్యాచ్ గీతను దాటుకుని ప్రగతిభవన్ దాకా తమ వేదనను ఎలా తీసుకెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు. ప్రాధాన్యం లేని పోస్టులలోనే కాలం వెళ్లదీస్తున్నారు. పాలకులు తమకు నచ్చిన కొందరు ఐఏఎస్​అధికారులనే కీలకమైన పోస్టులలో కూర్చుండబెడుతున్నారనేది వారి ఆవేదనగా ఉంది.

వారి మాటే చెల్లుబాటు

తెలంగాణ ప్రాంత ఐఏఎస్ అధికారులను​ప్రాధాన్యం లేని పోస్టులకు పరిమితం చేయడంలో ఒకవర్గం సక్సెస్​అవుతోందనే మాట వినిపిస్తోంది. తెలంగాణ ఐఏఎస్​ల ప్రతిపాదనలు, వ్యూహాలు ప్రగతిభవన్​ గోడ దాటకుండా కొందరు అడ్డు తగులుతున్నారని, అందుకే ఇక్కడి ఆఫీసర్ల బాధలు, ప్రయత్నాలు, కీలక అంశాలు సీఎం దరికి చేరడం లేదనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. నిజానికి, గతంలోనూ తమకు ప్రాధాన్యం లేని పోస్టులే ఇస్తున్నారంటూ తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ అధికారులు ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన రాష్ట్రంలో జరిగింది. ఉద్దేశ పూర్వకంగానే తమకు ప్రాధాన్యం లేని పోస్టులు ఇస్తున్నారని, సీనియారిటీ ఎక్కువ ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎస్సీ, ఎస్టీ అధికారులకు కూడా కీలక పోస్టింగులు ఇవ్వడం లేదంటూ గతంలో ఐఏఎస్​అధికారులు ఆకునూరి మురళి, శ్యాంనాయక్, చంపాలాల్, భారతి లక్​పతినాయక్, ప్రీతిమీనా వంటివారు ప్రభుత్వానికి నివేదించారు. సీనియర్ ఆఫీసర్లకు సరైన పోస్టింగ్ ఇవ్వడం లేదనే కారణంతోనే ఆకునూరి మురళి వీఆర్ఎస్ తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఏపీ ప్రభుత్వంలో మురళి కీలక విభాగాలకు సలహాదారుడిగా వ్యవహరించి, ప్రస్తుతం రాజకీయాల వైపు వచ్చారు. 

జూనియర్ల కింద నౌకరీ

తెలంగాణ ప్రాంత ఐఏఎస్​లు సీనియర్లుగా ఉన్నా వారిని లూప్​లైన్​కే పరిమితం చేస్తున్నారు. చాలా మందికి ప్రాధాన్యం లేని పోస్టులను అప్పగిస్తున్నారు. యేండ్ల తరబడి అలాగే కొనసాగిస్తున్నారు. తెలంగాణ తొలి టర్మ్​లో ఇదే ఒత్తిడికి గురైనా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతైనా మారుతుందని ఆశపడ్డారు. కానీ కోటరీ ఐఏఎస్​లదే పైచేయిగా సాగుతూనే ఉంది. ఫలితంగా అప్రాధాన్య పోస్టులకే పంపుతున్నారు. ఇక కుదరని పక్షంలో వేటుకు గురవుతున్నారు. ఇప్పటికీ పోస్టింగ్ లేక చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఎక్కడైనా ఒక పోస్టింగ్​ ఇస్తే వారిపై పెత్తనాన్ని మాత్రం ఒక బ్యాచ్​కు చెందిన జూనియర్ ల చేతులలో పెడుతున్నారు. ఇలా వేధిస్తుండటంతో అసలు పోస్టింగే వద్దనే పరిస్థితికి తెలంగాణ ఐఏఎస్​అధికారులు చేరుకుంటున్నారు. సీనియర్ ల కండ్ల ముందే అనుభం లేని జూనియర్ లకు పెద్ద కుర్చీలేస్తున్నారు. ఫలితంగా తెలంగాణ ఐఏఎస్​లు మనోవేదనకు గురవుతున్నారు. 

ఫైళ్లు కదలడం లేదు

సందీప్​కుమార్ సుల్తానియా దగ్గర చాలా శాఖలు ఉండటంతో ఆయన కిందిస్థాయి అధికారులకు కూడా సమయం ఇవ్వడం లేదనే అపవాదు ఉన్నది. సెర్ప్ లో కనీసం జీతాలు సకాలంలో చెల్లించేందుకు కూడా ఆయన సంతకానికి ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదైనా సమస్యను విన్నవించుకుందామంటే, ‘సార్​కు టైం లేదు’ అనే సమాధానమే వస్తుంది. ఏదైనా ఉద్యోగికి సంబంధించిన బాధలను చెప్పుకోలేని పరిస్థితి నెలకొన్నది. ఏదైనా ఒక ఫైల్​పై ‘డిస్కస్’​ అని రాస్తే చాలు ఇక అది నెలల తరబడి పెండింగ్​లోనే ఉంటోంది. మళ్లీ సదరు ఉన్నతాధికారి చెప్పే వరకూ కిందిస్థాయి అధికారులు తీసుకెళ్లడం లేదు. ఒకవేళ తీసుకువెళ్లినా ‘ఇప్పుడేం అవసరం’ అనే ప్రశ్న వస్తుంది. చాలా శాఖలకు ఇన్చార్జులు ఉండటంతో సమయం ఇవ్వలేకపోతున్నారనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఇలా ఇప్పటికీ వేల ఫైళ్లు పెండింగ్​లో ఉంటున్నాయి. కేవలం సందీప్​ కుమార్ సుల్తానియా మాత్రమే కాదు. కొంతమంది ఐఏఎస్​ల చేతులలోనే కీలక శాఖలు ఉన్నాయి. వాటన్నింటిలోనూ ఇదే పరిస్థితి.