గరం గరం- రాజుకున్న రాజకీయ వేడి

గరం గరం- రాజుకున్న రాజకీయ వేడి

  • ధర్నాలతో దద్దరిల్లిన రాష్ట్రం 
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ నిరసనలు
  • ‘కరెంటు’ మీద ఇరు పార్టీల పొలిటికల్ వార్
  • రేవంత్ దిష్టిబొమ్మలు తగులబెట్టిన గులాబీ నేతలు
  • అంతేస్థాయిలో ఎదురుదాడి చేసిన కాంగ్రెస్ నేతలు
  • సబ్ స్టేషన్ల ముందు ఆందోళనలకు దిగిన శ్రేణులు
  • ప్రధాన రహదారుల మీద ట్రాఫిక్ జామ్
  • గంటల తరబడి అల్లాడిన ప్రయాణికులు
  • తన మాటలు వక్రీకరించారన్న టీపీసీసీ చీఫ్
  • అర్ధంతరంగా అమెరికా నుంచి రేవంత్ వాపస్

ధర్నాలతో రాష్ట్రం దద్దరిల్లింది. నిరసనలతో హోరెత్తింది. ‘కరెంటు’ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు బుధవారం పోటాపోటీగా ఆందోళనలు నిర్వహించాయి. రెండు ప్రధాన పార్టీలు ఏక కాలంలో ఒకే అంశం మీద ధర్నాలకు దిగడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఇటు నిరసనల ప్రభావంతో రాష్ట్రంలోని ప్రధాన రహదారులపై గంటల తరబడి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. అందివచ్చిన అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు శక్తివంచన లేకుండా యత్నిస్తున్నాయి. ఫలితంగా ఇరు పార్టీల కరెంట్ వార్ తారస్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. 


ముద్ర, తెలంగాణ బ్యూరో:-బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య` కరెంట్' వార్ మొదలైంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ పలు అంశాలలో దూకుడుగా ఉంటూ అధికార పార్టీని ఇరుకున పెడుతోంది. దీంతో మొన్నటి వరకు బీ‌జేపీ మీద విరుచుకుపడిన బీ‌ఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ కూడా అంతే దూకుడుగా ఎదురుదాడి చేస్తూ వప్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేసీ‌ఆర్ ప్రభుత్వం ఉచిత కరెంట్ పేరుతో రైతులని మోసం చేస్తుందని రేవంత్ ఆరోపించారు. రైతులకు 24  గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటల నాణ్యమైన కరెంటు ఇస్తే సరిపోతుందని అన్నారు. ఇది బీఆర్ఎస్ కు ఆయాచిత వరంగా మారింది. ఆ పార్టీ నేతలు ఒక్కసారిగా కాంగ్రెస్ మీద భగ్గుమన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. ఊరూరా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. మంత్రులు, ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలందరూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. 

కాంగ్రెస్ కూడా

బీఆర్ఎస్ ధర్నాలకు కౌంటర్ గా కాంగ్రెస్ సైతం అన్ని మండల కేంద్రాలలోని సబ్ స్టేషన్ల ముందు కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తున్నదని, 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని ఆరోపించింది. ఇలా రెండు పార్టీలు కరెంటుపై పోటాపోటీగా ఆందోళనలు చేయడంతో పలు జిల్లాలలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇరుల పార్టీల నేతలను కంట్రోల్ చేయలేక  పోలీసులు అవస్థలు పడ్డారు. ఈ అంశంతో రాజకీయ  మైలేజ్ పొందాలని రెండు పార్టీలు యత్నిస్తున్నాయి. కరెంటు అంశాన్ని టార్గెట్ గా చేసుకుని  కాంగ్రెస్ ను పూర్తిగా ప్రజలలో అభాసుపాలు చేయాలని అధికార పార్టీ పావులను కదుపుతోంది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా టూర్ ను అర్ధంతరంగా ముంగించుకుని స్వదేశానికి బయలుదేరారు. అగమేఘాలపై హైదరాబాద్ కు చేరుకున్నారు. తాను ఉచిత విద్యుత్ మీద అలా అనలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఇప్పటికే ప్రకటించారు. రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఒకటి, రెండు రోజులలో రేవంత్ మీడియా  సమావేశాన్ని ఏర్పాటు చేసి సమగ్ర వివరణ ఇవ్వనున్నారు. గులాబీ పార్టీ చేస్తున్నఆరోపణలను గట్టిగా తిప్పికొట్టే అంశంపై కూడా పార్టీ శ్రేణులతో  రేవంత్ చర్చించి  ప్రజాక్షేత్రంలోనికి పోవాలని చూస్తున్నారు. 


ట్వీట్ల పర్వం

అందివచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ కూడా యత్నిస్తోంది. ఖైరతాబాద్‌లోని విద్యుత్ సౌధ వద్ద ఎమ్మెల్సీ కవిత ధర్నాకు దిగారు. రేవంత్‌కు, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తే కాంగ్రెస్‌కు వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. నేరుగా రాహుల్ గాంధీకే ట్యాగ్ చేస్తూ రేవంత్ చేసిన కామెంట్స్‌పై నిలదీశారు. అసలు తెలంగాణ రైతులపై అక్కసు ఎందుకో చెప్పాలన్నారు. అంతకు ముందు ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్‌ ‘సీఎం కేసీఆర్ నినాదం మూడు పంటలు అయితే.. కాంగ్రెస్ విధానం మూడు గంటలని, బీజేపీ విధానం మతం పేరిట మంటలు’ అని విరుచుకుపడ్డారు. మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా? మతం పేరిట మంటలు కావాలా? తెలంగాణ రైతు తేల్చుకోవాల్సిన తరుణం ఇదన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో కూడిన పాడెను ఆయన స్వయంగా మోసారు. శవయాత్ర నిర్వహించి రాజీవ్ రహదారిపై దిష్టిబొమ్మను దగ్దం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలం మంచుకొండలో జరిగిన ధర్నాలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ, గోడలకు సున్నాలు వేసుకునేవాడికి రైతుల కష్టాలు ఏం తెలుస్తాయని మండిపడ్డారు. ఇలా రాష్ట్రంలోని పలు జిల్లాలలో మంత్రులు ఆందోళనలలో పాల్గొని రాజకీయ వేడిని పెంచారు. 

మూడు చెరువుల నీళ్లు తాగినా

ఇటు కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ తీరు మీద విరుచుకుపడ్డారు. కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు ‘మూడు గంటలు’ అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా బీఆర్ఎస్ మూడో సారి అధికారంలోకి రావడం కల్ల అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యలపై గులాబీ నేతలు ఎంత తప్పుడు ప్రచారం చేసినా రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్సేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ లో చెప్పినవన్నీ అధికారంలోకి రాగానే చేసి చూపిస్తామని ఏఐసీసీ ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే వ్యాఖ్యానించారు.