తెలంగాణపై  బీజేపీ స్పెషల్​ ఫోకస్

తెలంగాణపై  బీజేపీ స్పెషల్​ ఫోకస్
  • రాష్ట్రానికి రానున్న 119 మంది ఎమ్మెల్యేలు
  • ఒక్కొక్కరి ఒక్కో అసెంబ్లీ బాధ్యత
  • వారం రోజులు రాష్ట్రంలోనే నేతలు
  • 29న ఖమ్మంలో బీజేపీ సభ 
  • అమిత్​షా, జేపీ నడ్డా రాక

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ హైకమాండ్​తెలంగాణలో భారీ కసరత్తు చేసేందుకు పూనుకున్నది. ఇప్పటికే ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇద్దరూ తెలంగాణకు వచ్చి వెళ్లారు.  ఈనెల 29న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభను తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్​షా రానున్నారు. 

భారీ ప్లాన్​తో రానున్న షా, నడ్డా..

జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భారీ ప్రణాళికతో ఖమ్మంకు రానున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పార్టీలో సీనియర్లు, ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే సామర్థ్యం ఉన్న 119 మంది ఎమ్మెల్యేలను తెలంగాణకు తీసుకురానున్నారు. ఖమ్మం బహిరంగ సభ తర్వాత 119మంది ఎమ్మెల్యేలతో జేపీ నడ్డా, అమిత్ షా సమావేశం కానున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిస్థితులు, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన పనులపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఎన్నికల్లో చేయాల్సిన పనులపై కూడా సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.  119 మంది ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో ఒక్కొక్కరికి ఒక్కో అసెంబ్లీకి ఇన్​చార్జిగా బాధ్యతలను అప్పగించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరంతా వారం రోజుల పాటు అయా నియోజకవర్గాల్లో ఉండి సమస్యలను తెలుసుకోనున్నట్లు తెలిసింది. ఈ వారం రోజులు కూడా అమిత్​షా, జేపీ నడ్డా చేసిన సూచనలను ఫాలో అవుతారు. వారంపాటు అయా నియోజకవర్గాల్లో ఏయే పనులు చేయాల్లో నివేదికను రూపొందించనున్నట్లు తెలిసింది. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ఒక కమిటీని కూడా వేయనున్నట్లు సమాచారం. ఈ కమిటీ ఎమ్మెల్యేలకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఏర్పాట్లను చూడనున్నట్లు తెలిసింది. మరోవైపు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్​రెడ్డికి బీజేపీ స్టేట్​చీఫ్​గా బాధ్యతలను అప్పగించింది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్​కు రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్​గా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జాతీయ కార్యనిర్వహక సభ్యుడిగా నియమించింది. తెలంగాణలో పాగా వేసేందుకే అధిష్ఠానం పలు మార్పులు చేసినట్లు సమాచారం. అలాగే బండి సంజయ్​కు జాతీయస్థాయిలో పదవి ఇవ్వనున్నట్లు తెలిసింది. దీంతో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
 
160 స్థానాల్లో విజయమే లక్ష్యం : నడ్డా

గత లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన 160 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రత్యేక వ్యుహం సిద్ధం చేసుకోవాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. బుధవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై జేపీ నడ్డా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బీజేపీ రూపొందించిన ‘లోకసభ ప్రవాస్’ కార్యక్రమంతో సంబంధమున్న ముఖ్య నేతలంతా ఈ మీటింగ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడారు. 2019 ఎన్నికల్లో 545 స్థానాల్లో 160 స్థానాల్లో ఓడిపోయామని తెలిపారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరముందన్నారు. ఈ సంవత్సరం జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది రానున్న లోకసభ సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ ముఖ్య నేతలతో కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్ర అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో ఓటమి తర్వాత ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవీడుచుకోకూడదని బీజేపీ పార్టీ కృతనిశ్చయంతో ఉందని, వచ్చే సార్వత్రిక లోకసభ ఎన్నికలను ప్రభావితం చేయాలన్నదే బీజేపీ ప్రధాన వ్యూహామని నడ్డా తెలిపారు.