మరో 100 ఆరోగ్య మహిళ కేంద్రాలు

మరో 100 ఆరోగ్య మహిళ కేంద్రాలు
  • ఈనెల 12న ప్రారంభానికి సన్నాహాలు
  • 372కు చేరనున్న కేంద్రాల సంఖ్య
  • ప్రతి మంగళవారం ప్రత్యేకించి 
  • మహిళా వైద్య సిబ్బందితో  ఆరోగ్య మహిళా కేంద్రాలు
  • మహిళలకు అందుబాటులో 8రకాల వైద్య సేవలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : మరో వంద ఆరోగ్య మహిళా (క్లినిక్ ) కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని ఈ నెల 12న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే 272 ఆరోగ్య మహిళా కేంద్రాలు ఉన్నాయి. వాటికి మరో వంద కలుపుకుంటే మొత్తం 372కు సంఖ్య పెరుగుతుంది. ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళా వైద్య సిబ్బంది ఆరోగ్య మహిళా కేంద్రాల్లో అందుబాటులో ఉంటూ 8 రకాల ప్రధాన వైద్య సేవలను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా  మరో వంద ఆరోగ్య మహిళా కేంద్రాలకు ఏర్పాటుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆరోగ్యశాఖ మంత్ర హరీశ్​రావు ఆదేశించారు. ప్రపంచ మ‌హిళా దినోత్సవాన్ని పుర‌స్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ యేడాది మార్చి 8వ తేదీన ఆరోగ్య మ‌హిళా కేంద్రాల‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

8 ర‌కాల సేవ‌లు ఇవే ...

  • మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు.
  • ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్.
  • థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ–12, విటమిన్ డీ పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు.
  • మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు.
  • మోనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్‌తో అవగాహన కలిగిస్తారు.
  • నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యే కంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.
  • సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు. 
  • బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు.