నేడు రాష్ట్రానికి  కేంద్ర బృందం 

నేడు రాష్ట్రానికి  కేంద్ర బృందం 
  • వరద నష్టం అంచనా కోసం పలు జిల్లాల్లో పర్యటన
  • మొత్తం నష్టం సుమారు రూ.3 వేల కోట్లు
  • రైతులు కోల్పోయింది  రూ.900 కోట్లు  
  • రాష్ట్ర అధికారుల ప్రాథమిక అంచనా!
  • గతేడాది నష్టం రూ.3,021 కోట్లు
  • అందిన సాయం రూ.150 కోట్లు 
  • ఈ ఏడాది కేంద్రం నుంచి వచ్చే సాయమెంత?

ముద్ర, తెలంగాణ బ్యూరో :  వరద నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించనుంది. భారీ వర్షాల కారణంగా వరద ప్రాంతాల్లో సంభవించిన నష్టంపై కేంద్ర అధికారుల బృందం సందర్శించనుంది. ఈ సందర్భంగా నష్టాన్ని అంచనా వేయనుంది. 

  • భారీగా ఆస్తి, ప్రాణ నష్టం..

రాష్ట్రంలో వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలు తీరని నష్టాన్ని మిగిల్చాయి.  ప్రాణనష్టం, భారీగా ఆస్తి నష్టం జరిగింది. లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. రోడ్లు, జాతీయ రహదారులు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల.. వంతెనలు కూలిపోయాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. కాలనీల్లోకి నీరు పోటెత్తటంతో వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. దీనికి ఎన్‌డీఎంఏ సలహాదారు కునాల్ సత్యార్థి నేతృత్వంలో కేంద్రం బృందం  పని చేయనుంది. ఎనిమిది శాఖల అధికారులతో కూడిన ఈ కేంద్ర బృందం  క్షేత్రస్థాయిలో నష్టాలను కేంద్ర బృందం అంచనా వేసిన తర్వాత తెలంగాణ సర్కారు వివరణాత్మక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. అనంతరం అవసరం మేరకు సెంట్రల్ టీమ్ మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికను కేంద్ర హోంశాఖకు అందజేస్తుంది. ఈ కేంద్ర బృందంలో వ్యవసాయ, ఆర్థిక, రహదారులు,  జలశక్తి, విద్యుత్, అంతరిక్ష విభాగంలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కు చెందిన అధికారులు ఉంటారు. తెలంగాణ 2019‌‌–20,  2020- –21, 2021 –22, 22- నుంచి 23 సంవత్సరాల్లో సంబంధిత మంత్రిత్వ శాఖలు అమలు చేసిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద చేసిన కేటాయింపులు,  నిధుల విడుదల,  ఖర్చుల వివరాలను కూడా కేంద్ర బృందానికి ఇవ్వాలని సంబంధిత శాఖలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది.   

  • ప్రాథమిక అంచనా నష్టం రూ.3 వేల కోట్లు

వరదల కారణంగా సంభవించిన నష్టాన్ని ప్రాథమికంగా కేంద్ర బృందం అంచనా వేయనుంది. అతి భారీ వర్షాలు, వాటి వల్ల పోటెత్తిన వరదలకు  రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అపార నష్టం జరిగింది. రాష్ట్రంలో భారీ వర్షాలకు వాటిల్లిన నష్టం.. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది.  ప్రాథమిక సమాచారం ప్రకారం 20 మంది మరణించగా పలువురు గల్లంతయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా నష్టం వాటిలినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దాదాపు 8.92 లక్షల ఎకరాల్లో పంటలు.. నీట మునిగినట్లుగా తేల్చారు.  సాగుకు దాదాపు రూ.900 కోట్ల రుపాయలకుపైనే నష్టం జరిగినట్లుగా ఒక అంచనా. ప్రధానంగా ఆదిలాబాద్‌, కుమురంభీం-, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల,జనగామ, కరీంనగర్‌, వరంగల్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఎక్కువ పంట నష్టం జరిగినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 

  • కిలోమీటర్ల మేర పంటలు నీటిలోనే..

గోదావరికి భారీగా వరద రావడంతో నదికి ఇరువైపుల దాదాపు కిలోమీటర్ల మేర పంటలు మునిగిపోయాయి. వర్షాల కారణంగా పంచాయతీరాజ్ శాఖకు భారీ నష్టం వాటిల్లినట్లు సంబంధిత అధికారులు ఇప్పటికే ప్రాథమిక నివేదికను రూపొందించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో మూడువేలకు పైగా ఇండ్లు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిసింది. ఇందులో వేయికి పైగా ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని సమాచారం. ఎక్కవ ఇండ్లు ధ్వంసమైంది మోరంచపల్లెలోనే అంటున్నారు. వరంగల్‌తో పాటు హైదరాబాద్‌లోని పలు కాలనీలలోని ఇండ్ల నుంచి ఇంకా వరద నీరు బయటకు పోలేదు. వరద నీరు, బురద, డ్రైనేజీ నీరు కలగలిసి ఆయా కాలనీలు, బస్తీలు కంపు కొడుతున్నాయి. భారీ వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 300 కిలోమీటర్లకు పైగా రహదారులు దెబ్బతిన్నాయి. 

  • విద్యుత్​సంస్థలకు రూ.21 కోట్ల నష్టం.. 

ఈ రహదారులను తిరిగి నిర్మించడానికి దాదాపు రూ.400 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వాహనాల రాకపోకలకు వీలుగా తాత్కాలికంగా మరమ్మత్తులు చేయడానికే రూ.30 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే విద్యుత్​సంస్థలకు దాదాపు రూ. 21 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిసింది. ఈ మేరకు అధికారులు ప్రాథమిక అంచనా వేసినట్లు సమాచారం. మొత్తంగా అన్ని విభాగాలకు కలిసి దాదాపు రూ.3 వేల కోట్లకు పైగానే నష్టం జరిగినట్లు అంచనాలు వేస్తున్నారు. అయితే కేంద్రం తక్షణ సహాయం కింద వేయి కోట్ల వరకు విడుదల చేయాలని ఇప్పటికే ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కూడా మంత్రివర్గ సమావేశం తరువాత తక్షణ సహాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.  హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో రూ. 414కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారని తెలుస్తోంది.

  • రైతులకు తీవ్ర నష్టం..

పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్ గ్రామాలు అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నది తీర ప్రాంతాల్లోని ఖానాపూర్ పోతారం, సిరిపురం, బెస్తపల్లి, గోపాల్పూర్, చిన్న ఓదాల, ఖమ్మంపల్లి, అడవి శ్రీరాంపూర్, ఒడేడు ప్రాంతాల్లో వరి పొలాలు కొన్నిచోట్ల ముంపునకు గురవ్వగా, మరికొన్ని చోట్ల కొట్టుకుపోయాయి. అలాగే వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు కూడా వేశాయి. వరద తీవ్రత వల్ల పొలాలు కోత గురై ఒర్రెలుగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 4900 ఎకరాల్లో వరి, 900 ఎకరాల్లో పత్తి దెబ్బతిన్నట్లు అధికారులు తేల్చారు. ప్రధానంగా  మంథని డివిజన్లోనే అధిక విస్తీర్ణం ఉందని చెబుతున్నారు. మంథని డివిజన్లో 142 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు తేల్చారు. మరోవైపు మానేరు, గోదావరి నదులు ఉప్పొంగి పరివాహక ప్రాంతాల్లో సుమారు 300 విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్లు నీట మునిగాయని, కొన్నిచోట్ల కొట్టుకుపోయినట్లు, అలాగే వందల సంఖ్యలో స్తంభాలు విరిగిపోయినట్లు  విద్యుత్ అధికారులు తేల్చారు.  రెండు కోట్ల పైగా నష్టం ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు.  అయితే గత ఏడాది కూడా వర్షాలకు రాష్ట్రంలో రూ. 3021 కోట్ల నష్టం జరిగితే కేంద్ర విపత్తుల నిర్వహణ శాఖ నుంచి నుంచి వచ్చింది కేవలం రూ.150 కోట్లు మాత్రమే. ఈ సారి కూడా ఏ మేరకు నిధులు  విడుదల అవుతాయన్న  అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.