మళ్లీ రండి

మళ్లీ రండి
  • కవితకు ఈడీ నోటీసులు
  • ఏపీ అప్రూవరుగా మారాక కీలక పరిణామం
  • అవి మోడీ నోటీసులని విమర్శించిన కవిత
  • తమ న్యాయ విభాగం చూసుకుంటుందని వ్యాఖ్య
  • టీవీ సీరియల్ లా సాగదీస్తున్నారని ఆగ్రహం
  • నిరుడు అక్టోబర్​లో మూడు రోజులు విచారణ
  • ఆ తర్వాత అంతా సైలెంట్ అయిన అధికారులు
  • రాజకీయ రంగు పులుముకున్న నోటీసుల వ్యవహారం
  • తమకేం సంబంధం లేదన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  • అంతా పొలిటికల్ స్టంట్ అని కొట్టిపడేసిన కాంగ్రెస్

సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాముకు సంబంధించి ఈడీ మళ్లీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విచారణకు  హాజరు కావాలని ఆదేశించింది. ఇందులో నిందితుడుగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవరుగా మారి ఈడీకి స్టేట్ మెంట్ ఇచ్చిన మరునాడే విచారణకు పిలిచారు. పిళ్లై కవిత బినామీ అని ఈడీ చెబుతోంది. గతంలో కవితను ఢిల్లీలో పలుమార్లు విచారించారు. సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో బీజేపీ బలహీనపడేందుకు కవిత విషయం కూడా ప్రధాన కారణమని కూడా  బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

అరెస్ట్​ ఉంటుందా?

ఈ లిక్కర్​ స్కాంలో సౌత్ గ్రూప్‌లో ఉన్నవాళ్లంతా అఫ్రూవర్లుగా మారిపోవడంతో ఈ కేసు మళ్లీ మొదటికొచ్చింది. గతంలో కవిత విచారణకు హాజరైనప్పుడు అరెస్ట్ చేస్తారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. అలాంటి పరిణామాలు జరగలేదు. తాజాగా మరోసారి ఈడీ నోటీసు ఇవ్వడంతో ఈసారి మాత్రం కవిత అరెస్ట్ గ్యారెంటీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్‌తో తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్‌ హీట్​ పెరిగింది. ఇలాంటి సమయంలో కవితకు నోటీసులు ఇవ్వడం, పైగా అరెస్ట్ చేస్తారంటూ ఊహాగానాలు వినిబడుతున్న నేపథ్యంలో అసలేం జరుగుతోందన్నది ఆసక్తికరంగా మారింది.

ముద్ర, తెలంగాణ బ్యూరో:బీజేపీ ఇటీవల నిర్వహించిన ‘ఇంటింటికి బీజేపీ’ కార్యక్రమంలో భాగంగా 119 నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాలకు చెందిన 119 మంది ఎమ్మెల్యేలు ఇన్చార్జులుగా హాజరయ్యారు. లిక్కర్​ స్కాము కేసులో కవితను విచారించడం, ఆ తర్వాత సైలెంటుగా ఉండటంతో, బీఆర్ఎస్​తో బీజేపీకి లోపాయికారిక ఒప్పందం కుదిరిందనే అనుమానం రాష్ట్ర ప్రజలలో ఉందని, అందుకే వారు బీజేపీని నమ్మడం లేదంటూ అధిష్టానానికి సుదీర్ఘ నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక జాతీయ పార్టీలో చర్చకు వచ్చింది. ఆ తర్వాత కూడా కవిత వ్యవహారంలో ఎక్కడా అడుగు ముందుకు పడలేదు. తాజాగా ఈ కేసులో ప్రమేయం ఉన్న వారంతా ఈడీ ముందు అప్రూవరుగా మారుతూ వచ్చారు. ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో సౌత్​ గ్రూపు ఏర్పడిందని చెప్పిన ఈడీ, దీనిలో పలువురు కీలకంగా ఉన్నారని గతంలో వెల్లడించింది. ఇందులో కీలకంగా ఉన్న అరుణ్​ రామచంద్ర పిళ్లై బుధవారం అప్రూవరుగా మారిందని తెలిపింది. ఆ మరునాడే ఈడీ నుంచి కవితకు నోటీసులు అందాయి. ఈ నోటీసులను కవిత చాలా లైట్​గా తీసుకుంటుండగా,  బీజేపీ మాత్రం తమకేం సంబంధం లేదని చెబుతున్నది. కాంగ్రెస్​ మాత్రం బీఆర్ఎస్​కు లాభం చేసేందుకే బీజేపీ ఈడీ నోటీసులు ఇప్పించిందని ఆరోపిస్తున్నది. 

కవిత మినహా

ఢిల్లీ లిక్కర్ స్కాము కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కవిత తప్ప దాదాపుగా అందరూ వరుసగా ఒకరి తర్వాత ఒకరు అప్రూవర్లుగా మారారు. దీంతో కవిత మాత్రమే నిందితురాలిగా మిగిలినట్లు భావిస్తున్నారు. కవిత మద్యం బినామీ వ్యాపారం పిళ్లై పేరు మీదుగా సాగిందని ఈడీ, సీబీఐ చెబుతున్నాయి. ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, రాఘవ, శరత్ చంద్రారెడ్డి, దినేష్​ ఆరోరా కూడా అప్రూవర్లు అయ్యారు. వీరంతా సౌత్ లాబీ నుంచి కీలకం. ఇక కవిత  ఆడిటర్ గా పని చేసిన బుచ్చిబాబు కూడా అప్రూవర్ ఈడీ ముందుకు వచ్చారు. ఆయన దగ్గర నుంచి ఇటీవల స్టేట్ మెంట్లు కూడా మళ్లీ తీసుకున్నారు. కవితను నిరుడు మార్చి​16, 20, 21 తేదీలలో ఈడీ విచారించింది. ఢిల్లీలో మద్యం వ్యాపారంలో సాధించిన లాభాలతో హైదరాబాద్‌లో కవిత భూములు కొనుగోలు చేశారని ఈడీ కోర్టుకు తెలిపింది. భూముల కొనుగోలులో కవిత భర్త అనిల్‌కుమార్‌ ప్రమేయం ఉందని తెలిపింది. గౌతమ్‌ మల్హోత్రా, అమన్‌దీప్, మాగుంట రాఘవ, అరుణ్‌ పిళ్లై వాంగ్మూలాల ఆధారంగా రెండు చార్జిషీట్లను దాఖలు చేసింది.  ఆప్‌ నేతలకు సౌత్‌గ్రూపు రూ.100 కోట్లు హవాలా రూపంలో ముడుపులిచ్చింది. కవిత తరపున వ్యవహారాలు చక్క బెట్టినట్లుగా అరుణ్ పిళ్లై, అభిషేక్ , బుచ్చిబాబు వంటి వారి వాంగ్మూలాలతో కవిత నేరం చేసినట్లుగా ఈడీ లెక్కలేసింది. వారందరూ అప్రూవర్లు అయ్యారు.  

మీరు రండి

కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, పిళ్లై సౌత్ లాబీలో తాము బలంగా పనిచేసామని, లిక్కర్ కార్టెల్స్ దక్కించుకునేందుకు లంచాలు ఇచ్చామని ఈడీ అధికారుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. సౌత్ లాబీలో తాము ఎక్కడ పెట్టుబడి పెట్టింది? ఎవరెవరికి ఎంతెంత ఇచ్చింది.. అనే విషయాలను ఆయన అధికారులకు పూస గుచ్చినట్టు వివరించినట్లు తెలుస్తున్నది. ఈడీ నోటీసులకు లీగల్​ టీం రిప్లై ఇస్తుందని కవిత చెప్పుకొచ్చారు. కవిత శుక్రవారం కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉంటారనిషెడ్యూల్ ఖరారైంది. 

పొలిటిలక్​ స్టంట్​

కవితకు ఈడీ నోటీసుల వ్యవహారం రాజకీయ కోణాల రూపు తెచ్చుకుంటున్నది. యేడాదిన్నర తర్వాత మళ్లీ నోటీసులు రావడం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందు రెండు పార్టీల రాజకీయం అనే చర్చ మొదలైంది. ఇటీవల బీజేపీ పరిస్థితి కూడా రాష్ట్రంలో దారుణంగా దిగజారింది. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలంతా ఎమ్మెల్సీ కవిత వ్యవహారాన్ని ముందుకు తెచ్చారు. కవితను అరెస్ట్​చేయకపోవడంతో రెండు పార్టీల మధ్య అవగాహన ఉందంటూ ప్రజలు నమ్ముతున్నారంటూ జాతీయ నేతల ముందే చెప్పారు. ఈ నేపథ్యంలోనే కవితకు నోటీసులు ఇచ్చారనే టాక్​ వినిపిస్తున్నది. కవిత నోటీసులతో తమకేం సంబంధం లేదని బిజేపీ చెబుతున్నది. కాంగ్రెస్​ మాత్రం ఇదంతా ఎన్నికల స్టంట్ అంటున్నది.​మాజీ మంత్రి శ్రీధర్​బాబు మాట్లాడుతూ కవిత విచారణలో ఇప్పటిదాకా ఏం చేశారని ప్రశ్నించారు. రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉందని, కీలక ఎన్నికల సమయంలో కవితకు నోటీసులు ఇచ్చారంటూ మండిపడ్డారు. 


అది మోడీ నోటీసు (బాక్స్​)

తనకు వచ్చింది ‘ఈడీ నోటుసు కాదు, మోడీ నోటీసు’ అని కల్వకుంట్ల కవిత అన్నారు. రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి పెద్దగా స్పందించాల్సిన అవసనం లేదన్నారు. ఈడీ నోటీసును బీఆర్ఎస్ పార్టీ న్యాయ విభాగానికి ఇచ్చామని, ఆ విభాగం ఎలా చెబితే అలా ముందుకెళ్తామన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యవహారంపై పెద్దగా ఆలోచించడం లేదన్నారు. యేడాది కాలంగా టీవీ సీరియల్ లాగా సాగదీస్తున్నారని అన్నారు.  రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్లీ ఒక కొత్త ఎపిసోడ్ రిలీజ్ చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.  చివరకు 2జీ కేసు కూడా ఇంత కాలం సాగలేదని, రాజకీయ దురుద్ధేశాలతోనే ఈడీ నోటీసులు పంపించిందని స్పష్టం చేశారు. ఈ నోటీసును  తెలంగాణ ప్రజలు కూడా సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నా ఇదే తీరుతో వ్యవహరించడం బీజేపీ విధానమని విమర్శించారు. 

బీజేపీకి సంబంధం లేదు (బాక్స్​)

కవితకు ఈడీ నుంచి వచ్చిన నోటీసులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ  రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈడీ ఎవరికి నోటీసులు ఇస్తదో, ఎవరిని అరెస్టు చేస్తారో తమకు సంబంధించిన అంశం కాదన్నారు. ఈడీకీ ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం బీజేపీ అంతకంటే లేదన్నారు. ఎవరిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.  గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లిక్కర్​ స్కాములో ఇప్పటికే అనేక మందికి ఈడీ అరెస్టు చేసిందన్నారు. చాలా మందిని విచారించిందన్నారు. ఈ కేసులో ఎవరికి సంబంధం ఉందో వారిని పిలిచి విచారించడమే ఈడీ పని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలపైనే  తమ పోరాటమన్నారు. ఇక్కడి అధికార పార్టీ  ఎమ్మెల్యేలు ప్రజల భూములను కొల్లగొడుతున్నారన్నారు. ల్యాండ్​, స్యాండ్​, ధరణి కుంభకోణాలలో బీఆర్ఎస్ ముఖ్యనేతల హస్తం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వీటి మీద కచ్చితంగా దర్యాప్తు చేస్తామన్నారు. సెప్టెంబర్​ 17 విమోచన ఉత్సవాలు ఈసారి కూడా చేస్తున్నామన్నారు. జమిలి ఎన్నికలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశముందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసే విషయంపై  జగన్  ప్రభుత్వం కొంత సంయమనం పాటించి ఉంటే బాగుండేదన్నారు.