రూటు మారుతోంది!

రూటు మారుతోంది!
  • కాంగ్రెస్ లో చేరేందుకు దారులు వెతుకుతున్న నేతలు
  • తమకు అనుకూల నేతల సాయంతో అధిష్ఠానంతో మంతనాలు
  • పార్టీలో చేరికలపై కుదరని సీనియర్ల ఏకాభిప్రాయం
  • రాజగోపాల్ నుంచి రాజయ్య వరకు అదే తీరు!
  • షర్మిల చేరికపై కొనసాగుతోన్న డైలామా

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ లో నేతల చేరికలు సమస్యలు సృష్టిస్తున్నాయి. సీనియర్ల మధ్య కుదరని ఏకాభిప్రాయంతో వివాదస్పదమవుతున్నాయి. ఇటీవల భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో భేటీ అయిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​రావ్​ఠాక్రే, రేవంత్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కె.జనారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్​రెడ్డి తదితర సీనియర్లు భవిష్యత్​లో ఇతర పార్టీల నుంచి ఏ నేత కాంగ్రెస్​లో చేరాలన్నా పార్టీలో అందరి ఏకాభిప్రాయంతోనే చేరికలుంటాయని స్పష్టం చేశారు.  కానీ వారి నిర్ణయం అమలుకు నోచుకోవడం లేదు. దీంతో తమకు అనుకూలంగా ఉన్న నేతలను పార్టీలో చేర్పించుకునేందుకు ఎవరికి వారే పైరవీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

చేరికల్లో అడ్డంకులు..

భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదలు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎపిసోడ్ వరకు చేరికల్లో అడ్డంకులు వస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి వ్యతిరేకించిన నేతలను పార్టీలో చేర్పించుకునేందుకు ఇతర సీనియర్లు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ఇటు ఇతర సీనియర్లు గాలం వేసిన ఇతర పార్టీ నేతలను కాంగ్రెస్​లో చేర్పించుకునేందుకు రేవంత్​రెడ్డి అడ్డుపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చేరికల అంశం ప్రస్తుతం టీ కాంగ్రెస్ లో ఇరువర్గాలకు ప్రతిష్టాత్మకంగా మారడం హాట్​టాపిక్​గా మారింది.  చేరికలను ఇరువర్గాల నేతలు వ్యతిరేకిస్తుండటంతో.. కాంగ్రెస్​లో చేరాలని నిర్ణయించుకున్న ఇతర పార్టీ నేతలు ఆలోచనలో పడుతున్నారు. ఎవరితో సంప్రదింపులు జరపాలో తెలియక ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు ఇప్పటికే వెనకడుగు వేశారు. 

సన్నగిల్లిన ఆశలు..

కర్ణాటక ఎన్నికల ఫలితాలు, బీఆర్ఎస్​ప్రభుత్వ వైఫల్యాలు, బీజేపీ అధిష్ఠానం ఆకస్మిక నిర్ణయాలతో తెలంగాణలో అనూహ్యంగా తన గ్రాఫ్​ను పెంచుకున్న కాంగ్రెస్ లో చేరేందుకు మొదట్లో ఇతర పార్టీలకు చెందిన చాలామంది సీనియర్లు నిర్ణయించుకున్నట్లు లీకులు వచ్చాయి. బీజేపీ అసంతృప్త నేతలు ఈటల రాజేందర్, రాజగోపాల్​రెడ్డి, విజయశాంతి, వివేక్​ఇతర సీనియర్లను కాంగ్రెస్​లో చేర్పించుకునే అవకాశాలు మెండుగా ఉన్నా.. టీ కాంగ్రెస్​నేతలు ఆ అవకాశాన్ని చేజార్చారనే ప్రచారం జరుగుతోంది. ఇటు బీఆర్ఎస్​బహిష్కరించిన పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు మాత్రమే కాంగ్రెస్​లో చేరారు. వీరు తప్ప ఇప్పటివరకు ఇతర కీలక నేతలెవరూ కాంగ్రెస్​లో చేరలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో చేరే అవకాశాలూ కనిపించడ లేదు. దీంతో ఇప్పటికే కమిటీలు, టిక్కెట్ల లొల్లితో సతమతమవుతోన్న టీ కాంగ్రెస్​లో చేరికలపై ఆశలు సన్నగిల్లాయి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ లో చేరికలు కొనసాగాలంటే టీ కాంగ్రెస్​ నేతలందరూ ఏకతాటిపై నడవాల్సిందేనని అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

బీజేపీలోనే రాజగోపాల్​రెడ్డి..

కాంగ్రెస్​ను వీడి బీజేపీలో చేరిన తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డిని తిరిగి సొంతగూటికి చేర్చేలా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఐదు నెలల నుంచి ఏఐసీసీ స్థాయిలో విశ్వప్రయత్నాలు చేశారు. రాజగోపాల్​రెడ్డి కాంగ్రెస్​లో చేరిక లాంఛనమే అంటూ పలు సందర్భాల్లో మీడియా ముందే ప్రకటించారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఇప్పటి వరకు ఆయన కాంగ్రెస్​లో చేరలేదు. అప్పట్లో పార్టీ మార్పు ప్రచారాన్నీ ఖండించని రాజగోపాల్​రెడ్డి.. కొంత కాలం తర్వాత కాంగ్రెస్ లో తన చేరికపై ఆశ సన్నగిల్లడంతో చివరకు బీజేపీలోనే కొనసాగుతానంటూ ప్రకటించారు. అసలు రాజగోపాల్​రెడ్డిని ఎవరు అడ్డుకున్నారో అనే చర్చ మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చింది.

రాజయ్య చేరికపై ప్రచారం..

బీఆర్ఎస్​పార్టీకి చెందిన స్టేషన్​ఘన్​పూర్​అసెంబ్లీ సెగ్మెంట్​పరిధిలోని జానకీపురం గ్రామ సర్పంచ్​నవ్య.. ఏకంగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు బీఆర్ఎస్​అధినేత కేసీఆర్​టిక్కెట్టు నిరాకరించడంతో రాజయ్య కాంగ్రెస్​నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజయ్యకు పార్టీలో చోటివ్వమంటూ టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి గతంలో స్పష్టం చేశారు. కానీ ఈ నెల 4న అనూహ్యంగా సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహాతో భేటీ అయిన రాజయ్య.. త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

పొంగులేటికీ తప్పని వ్యతిరేకత..

గతంలో బీఆర్ఎస్​ అసంతృప్త నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికను అదే జిల్లాకు చెందిన సీనియర్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి వ్యతిరేకించినట్లు ప్రచారం జరిగింది. పొంగులేటీని పార్టీలో చేర్చించుకోవాలని నిర్ణయించుకున్న టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​రావ్​ఠాక్రేను రంగంలో దించారు. దీంతో పాదయాత్రలో ఉన్న భట్టిని కలిసిన ఠాక్రే.. ఆయన్ను బుజ్జగించినట్లు ప్రచారం జరిగింది. ఇటు నేరుగా ఢిల్లీకి వెళ్లిన రేణుకా చౌదరీ పొంగులేటి చేరికను అడ్డుకున్నట్లు ప్రచారం జరిగింది. చివరకు.. పొంగులేటిని పార్టీలో చేర్పించుకోవాలని నిర్ణయించుకున్న ఏఐసీసీ.. అగ్రనేత రాహుల్​గాంధీని తెలంగాణకు పంపింది. అలాగే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్​ రెడ్డి తనయుడు రాజేశ్​రెడ్డి చేరికపై నాగర్​కర్నూల్ కు చెందిన సీనియర్​నాయకుడు నాగం జనార్ధన్​రెడ్డి ఇప్పటికీ అసంతృప్తితోనే ఉన్నారు. అప్పట్లో పొంగులేటి పైరవీతో ఇరువురు నేతలు కాంగ్రెస్​ లో చేరారు. బీఆర్ఎస్​పార్టీకి చెందిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్​లో చేరడాన్ని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్​సాగర్ రావు అడ్డుకున్నట్లు ప్రచారం జరిగింది. టీపీసీసీ సైతం ఆయన్ను పార్టీలో చేర్పించుకునేందుకు వెనకడుగు వేయడంతో ఓదెలు దంపతులు నేరుగా ఢిల్లీకి వెళ్లి పార్టీ కండువా కప్పుకున్నారు.

తుమ్మల, షర్మిల పైరవీలు..

తాజాగా.. బీఆర్ఎస్​టిక్కెట్టు రాక అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్​లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన చేరికపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో.. తుమ్మల నేరుగా రేవంత్​రెడ్డితో భేటీ కావడం చర్చకు దారితీసింది. త్వరలోనే ఆయన కాంగ్రెస్​ లో చేరనున్నారు. అలాగు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్​షర్మిల కాంగ్రెస్​లో చేరిక.. ఆ పార్టీలో పెద్ద దుమారాన్నే లేపుతోంది. మొదట్నుంచీ ఆమె చేరికను వ్యతిరేకిస్తున్న టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డిని కాదని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, పొంగులేటీ శ్రీనివాస్​రెడ్డి తదితర సీనియర్లు ఆమె కోసం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ స్థాయిలో పైరవీలు చేశారు. ఇటీవల ఆమె పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్​గాంధీతో భేటీ కావడం టీ కాంగ్రెస్​ లో సంచలనం రేకెత్తించింది.