మహిళా రిజర్వేషన్ బిల్లుకు జై

మహిళా రిజర్వేషన్ బిల్లుకు జై
  • ఎమ్మెల్సీ కవిత లేఖతో కదిలిన రాజకీయ పార్టీలు
  • మహిళా బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్న నేతలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపడుతున్న ముమ్మర ప్రయత్నాలకు రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రాన్ని ఒత్తిడి చేసుకొని బిల్లును ఆమోదింపజేయాలని 47 రాజకీయ పార్టీలకు మంగళవారం ఆమె రాసిన లేఖకు అపూర్వ స్పందన లభించింది. కవిత లేఖ రాసిన కొద్ది గంటల్లోనే అనేక పార్టీల లీడర్లు స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్ధతిస్తామని ప్రకటిస్తూ.. ఆమె చేస్తున్న కృషిని ప్రశంసించారు. కవిత లేఖపై ఎన్సీపీ, జేడీయూ, సమాజ్ వాదీ పార్టీ, తృణముల్ కాంగ్రెస్, ఆర్జేడీ వంటి కీలక పార్టీలు తక్షణమే స్పందించాయి. జాతీయ మీడియాలో కవిత లేఖపై తీవ్ర చర్చ జరిగింది.

మహిళలకు రిజర్వేషన్లు చాలా అవసరం..

కవిత లేఖపై ఎన్సీపీ నేత శరద్ పవార్ స్పందించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు చాలా అవసరమని, ఎంత మేర రిజర్వేషన్లు కల్పించాలన్న విషయంపై పార్లమెంటులో చర్చ జరగాలని అన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకొస్తే తాము మద్ధతిస్తామని ప్రకటించారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉందని, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల ప్రజాస్వామ్యం మరింత బలంగా మారుతుందని తమ పార్టీ విశ్వసిస్తుందని స్పష్టం చేశారు. సమాజ్ వాది పార్టీ సీనియర్ నాయకురాలు పూజా శుక్లా స్పందిస్తూ తమ పార్టీ ఎప్పుడూ మహిళా సంక్షేమం కోసం పాటుపడుతుందని అన్నారు. పశ్చిమ బెంగాల్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా మాట్లాడుతూ తమ పార్టీ మహిళా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తోందని అన్నారు.