కూటమి విజయంలో బీజేపీ కీలకం

కూటమి విజయంలో బీజేపీ కీలకం

అందరూ ఊహించినట్టే జరిగింది.. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సొంతం చేసుకుంది. ముందే జత కట్టిన తెలుగుదేశం పార్టీ, జనసేనకు బిజెపి తోడు కావడం వల్లే కూటమి విజయం సునాయాసమైంది. ఒకటి లేదా రెండు శాతం ఓట్లను మాత్రమే కలిగివున్న భారతీయ జనతా పార్టీ జత కట్టడం వల్లే ఈ విజయం సులభమైందని ఎలా చెబుతున్నారని అందరికీ అనుమానం రాకపోదు. అయితే, ఓటరు నిర్భయంగా ఓటేయడం ద్వారానే ఈ విజయం లభించిందని, అందుకు పరోక్షంగా సహకరించింది బీజేపీనే అన్నది నిర్వివాదాంశం.

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో వున్నపుడు పరామర్శించడానికి వెళ్లిన జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కల్యాణ్, జైలు ప్రాంగణం నుంచి బయటకు వచ్చిన వెంటనే జనసైనికులంతా తెలుగుదేశంతో కలిసి నడుస్తామని ప్రకటించిన వెంటనే హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ ఆది నుంచి చెబుతూ వస్తున్న జనసేనాని అందుకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీతో జతకట్టారన్నది వాస్తవం. 2019 ఎన్నికలలో ఎవరికి వారే యమునా తీరే చందంగా పోటీ చేసినపుడు జరిగిన పరిణామాలను విశ్లేషించుకున్న జనసేనాని, తెలుగుదేశంతో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నట్టున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా 2014లో జరిగిన ఎన్నికలలో నేరుగా జనసేన పార్టీ తలపడకపోయినా కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమికి మద్దతును ప్రకటించి, ఆయా పార్టీల విజయాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే. 


ప్రస్తుత 2024 ఎన్నికలలో కూడా కలిసి నడిస్తేనే తాము అనుకున్నది సాధించగలమని ముమ్మాటికీ నమ్మిన వ్యక్తి జనసేనాని పవన్ కల్యాణ్. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బాదుడే.. బాదుడు సభలకు గానీ, టీడీపీ యువనేత నారా లోకేష్ నిర్వహించిన పాదయాత్రకు అయితేనేమి, భారీగా ప్రజాస్పందన లభించింది. ఈ ప్రజాదరణను చూసి ఉబ్బితబ్బిబ్బయిన పలువురు తెలుగుదేశం నాయకులు, ఒంటరిగా ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లినా విజయం సొంతం చేసుకుంటామనే  వాదనలు కూడా వినిపించిన సందర్భాలు లేకపోలేదు. ఏమైనా, రాజకీయాలలో తలపండిన నేతగా చంద్రబాబునాయుడు మాత్రం జనసేనతో కలిసే నడవాలని నిర్ణయించడం సహేతుకమైన నిర్ణయమే. ఇక్కడ ఈ రెండు పార్టీల కేడర్ మధ్య మంచి సమన్వయం కుదిరింది. అక్కడక్కడా చిన్నచిన్న పొరపొచ్ఛాలు తలెత్తినా కూడా చివరికి అంతా ఉమ్మడి లక్ష్యంతో కలిసికట్టుగానే పనిచేశారు. ఓట్ షేరింగ్ కూడా పక్కాగానే జరిగిందన్నది ఈ ఫలితాలే స్పష్ట చేశాయి. 

బీజేపీతో జత కట్టడంతోనే ఖాయమైన విజయం

జనసేన, తెలుగుదేశం పార్టీలతో కలిసి నడిచేందుకు భారతీయ జనతా పార్టీ అంగీకరించడంతోనే ఈ కూటమి విజయం ఖాయమయ్యిందనే చెప్పవచ్చును. కేంద్రంలో గత రెండు దఫాలుగా అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలతో జతకలిసేందుకు చాలా కాలం తాత్సారం చేసింది. ఒకవైపు ఎన్డీయేలోనే వున్న పవన్ కల్యాణ్ చొరవ తీసుకుని చేసిన ప్రయత్నాలు, మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ కు అననుకూల పరిస్థితులపై కేంద్ర నిఘావర్గాలు ఇచ్చిన నివేదికల పుణ్యమా అని చివరికి కూటమిలో చేరడానికి బీజేపీ అంగీకరించిందన్నది సమాచారం. బీజేపీతో ఈ రెండు పార్టీలు జత కట్టడాన్ని నిరోధించడానికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ విఫలయత్నం చేసింది. చివరికి మూడు పార్టీలు కలిసే ఎన్నికల సమరంలో దిగి విజయతీరాలకు చేరాయి. అయిదేళ్ల పాటు పరోక్షంగా సహకరించిన బీజేపీ ఒక్కసారిగా ప్రత్యర్థిగా మారడం వైఎస్సార్ కాంగ్రెస్ కు మింగుడుపడని పరిస్థితి. ఎన్నికలకు ముందే తమకు అనుకూలురుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ లు ఇచ్చిన  పలువురు అధికారులను ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో వివిధ ప్రాంతాలలో నియమితులైన పదుల సంఖ్యలో ఐఎఎస్, ఐపీఎస్  అధికారులతో పాటు, ఎంతోమంది పోలీసు అధికారులను ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది.

మొత్తం మీద రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చేసింది. రెండు దఫాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న, మూడోసారి కూడా మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో వున్న భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమిలో వుండడమే కారణంగా చెప్పవచ్చును. గతంలో పోలింగ్ బూత్ లో కేవలం చేతికి సిరా చుక్క వేయించుకుని తిరిగివచ్చే ఓటరు, ఈ ఎన్నికలలో నిర్భయంగా తాను వేయాలనుకున్న పార్టీకి ఓటేయగలిగాడంటే, ఇది ఎన్నికల కమిషన్ తీసుకున్న కఠిన నిర్ణయాల ఫలితంగానే జరిగిందన్నది వాస్తవం. ఒకవేళ బీజేపీ లేకుండా కేవలం జనసేన, తెలుగుదేశం పార్టీలు మాత్రమే కలిసి పోటీ చేసివుంటే ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగివుండేది కాదన్నది వాస్తవం. ఈ రెండు పార్టీలు చాలా కీలకమైన నియోజకవర్గాలలో పోలింగ్ ఏజెంట్లనే నియమించుకోలేని పరిస్థితి ఏర్పడివుండేది. పులివెందులలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన బీటెక్ రవి చెప్పిన ప్రకారం గతంలో ఎన్నడు లేనివిధంగా అన్ని చోట్ల పోలింగ్ ఏజెంట్లను నియమించుకోగలిగారు. మొత్తం మీద ప్రశాంతంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగలిగేలా చేసింది భారతీయ జనతా పార్టీనేనని ఘంటాపథంగా చెప్పవచ్చును. అందువల్లే ఈ రెండు పార్టీలతో బీజేపీ జత కట్టినరోజే ఈ కూటమి విజయం ఖాయమైందన్నది వాస్తవం. 

నాగేశ్వరరావు బల్లెడ
సీనియర్ జర్నలిస్ట్
8712206695