కాంగ్రెస్, బీజేపీ  ‘పరేడ్’ పంచాయితీ

కాంగ్రెస్, బీజేపీ  ‘పరేడ్’ పంచాయితీ
  • గ్రౌండ్ కోసం ఇరు పార్టీల మధ్య వివాదం
  • సెప్టెంబర్ 17న కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ కార్యక్రమాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కోసం కాంగ్రెస్, బీజేపీ మధ్య పంచాయితీ నడుస్తుంది. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అదే సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్స్ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. గతేడాది బీజేపీ ఇదే పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన దినోత్సవాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈనెల17న సోనియా గాంధీ బహిరంగ సభ నిమిత్తం పరేడ్ గ్రౌండ్ కోసం కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల క్రితం రక్షణ శాఖకు దరఖాస్తు చేసుకుంది. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ నేతలు పరేడ్ గ్రౌండ్ కోసం పోటీ పడుతున్నాయి. రక్షణ శాఖ అధికారులు ముందు దరఖాస్తు చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి అనుమతిస్తారా ? లేక బీజేపీ సభకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. మరోపక్క పరేడ్ గ్రౌండ్స్ కేంద్ర ప్రభుత్వ స్థలం కావడంతో విమోచన దినోత్సవాన్ని కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందున తమకే అనుమతి వస్తుందనే ధీమాలో బీజేపీ నేతలు ఉన్నారు. అలాగే పరేడ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ బహిరంగ సభకు అనుమతి వస్తుందే ధీమాతో సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు పరేడ్ గ్రౌండ్ ను పరిశీలించారు. 

సోనియా సభకు అనుమతి ఇవ్వాలి : జీవన్ రెడ్డి

సెప్టెంబర్​17న పరేడ్ గ్రౌండ్ లో సోనియాగాంధీ బహిరంగ సభ నిర్వహణకు  రక్షణ శాఖ అనుమతిని మొదట కోరింది కాంగ్రెస్ పార్టీయేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. మంగళవారం గాంధీభవన్ ఆయన మాట్లాడుతూ ముందుగా అనుమతి తాము అడిగాం కాబట్టి బీజేపీకి కాకుండా తమకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదే రోజు పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ జరుపుతామంటే ఏమైనా అర్థం ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు పరేడ్ గ్రౌండ్ తప్ప వేరే గ్రౌండ్ లేదా అని నిలదీశారు.