ముంచుతున్న వాతావరణ మార్పులు

ముంచుతున్న వాతావరణ మార్పులు

ఒక నెలలో తీవ్ర అనావృష్టి, మరో నెలలో వణుకు పుట్టించే కుండపోత వర్షాలు, ఆ తర్వాత మాసంలో చుక్క వర్షం లేకపోగా విపరీతమైన ఉక్కపోత. ఇదీ ఈ యేడాది వర్షాకాలం పరిస్థితి. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వరుణుడు మునుపెన్నడూ లేని విపరీత ధోరణి ప్రదర్శించాడు. ఊహించని వాతావరణ మార్పుల వల్లే ఈ వైపరీత్యం. వెరసి మొదట రైతన్నకు ఇక్కట్లు, ఆ తర్వాత ప్రజలందరికీ పాట్లు. జూన్ మొదటి వారంలో రావాల్సిన నైరుతి రుతు పవనాలు మూడు వారాలు ఆలస్యంగా మూడో వారంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించాయి. అయినా, జూలై 7, 8 తేదీల దాకా పెద్దగా వర్షాలు కురవలేదు. రెండవ వారం నుంచి మొదలై దాదాపు ఆ నెల చివరిదాకా విపరీతమైన వర్షాలు కురిసాయి. అనేక జిల్లాలలో జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. కొన్నిచోట్ల వారం రోజుల్లో 40 నుంచి 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన విచిత్రమైన పరిస్థితిని మనం ఎదుర్కొన్నాం. జూలై నెలలో రాష్ట్రంలో కురవాల్సిన సగటు వర్షపాతం 22. 91 సెంటీమీటర్లు కాగా 48.99 శాతం వర్షపాతం నమోదయింది.

జూన్ నెలలో 12.94 వర్షపాతం కురవాల్సి ఉండగా 7.26 శాతం మాత్రమే నమోదు అయింది. మళ్లీ ఆగస్టులోకి వచ్చేసరికి సగటున కురవాల్సిన వర్షపాతం 21.74 శాతం కాగా 7.97 శాతం వర్షపాతం మాత్రమే నమోదయింది. గత నాలుగైదు దశాబ్దాల కాలంలో ఇంత తక్కువ వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి.  చిత్ర విచిత్రమైన వర్షా కాలానికి ఈ అంకెలు అద్దం పడుతున్నాయి. రైతుకు పెను సవాలు విసిరిన వర్షాలు ఈ యేడాది వ్యవసాయోత్పత్తి మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా జొన్న, కంది, సోయాబీన్, పత్తి వంటి మెట్ట పంటల దిగుబడి పడిపోయే పరిస్థితి నెలకొన్నది. మాగాణి భూములలో పండే పంటలకు ఆగస్టు మాసంలో నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి సాధారణంగా ఉండదు. కానీ, ఈసారి బోర్ల  నుంచి నీటిని తోడి పోసి పంటలకు తడులు ఇవ్వాల్సి వచ్చింది. దాని వల్ల ఆగస్టులో రికార్డు స్థాయిలో విద్యుత్ వాడాల్సిన పరిస్థితి వచ్చింది.

పర్యవసానంగా భూగర్భ జలాలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. వాతావరణ మార్పుల కారణంగా వర్షపాతంలో వచ్చిన హెచ్చుతగ్గుల వల్ల ఆహార ధాన్యాలు, కూరగాయల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడటంతో వాటి ధరలు కొండెక్కి సగటు జీవిని ఇబ్బంది పెట్టిన పరిస్థితిని మనం గత నాలుగు మాసాలుగా చూస్తున్నాం. టమాటో ధరలైతే కొత్త చరిత్రను సృష్టించాయి. వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని రానున్న గడ్డుకాలానికి నిలువ చేసుకునే పరిస్థితి లేకపోతే రానున్న సంవత్సరాల్లో మరింత ఇబ్బంది పడే పరిస్థితి ఖాయంగా కనిపిస్తున్నది. నీటిపారుదల రంగానికి సంబంధించి ఒక సమగ్రమైన జాతీయ విధానం లేని కారణంగా, నదులను అనుసంధానించే యోచన, రాజకీయపరమైన చిత్తశుద్ధి కొరవడటంతో లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నది. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోకపోతే పొంచి ఉన్న ముప్పు నుంచి బయటపడటం కష్టమవుతుంది.