ఉదయనిధి తల నరికితే రూ.10 కోట్లు!

ఉదయనిధి తల నరికితే రూ.10 కోట్లు!
  • అయోధ్య సాధువు పరమహంస 
  • సాధువు వ్యాఖ్యలకు భయపడబోనన్న ఉదయనిధి

అయోధ్య: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు సీఎం స్టాలిన్​కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం అయోధ్య సాధువు పరమహంస తీవ్రంగా స్పందించారు. ఉదయనిధి తల నరికి తీసుకొస్తే రూ.10 కోట్ల నగదు బహుమతి ఇస్తానని ప్రకటించారు. మరేదైనా మతంపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసుంటే ఇప్పటికే హతమై ఉండేవాడరని అన్నారు. కానీ సనాతన ధర్మ ప్రజలు అహింసను నమ్ముతున్నారు కాబట్టి ఇంకా ప్రాణాలతో ఉన్నారని పేర్కొన్నారు. అయోధ్యలో ఉదయనిధి ఫొటోను కత్తితో నరుకుతూ తన నిరసన తెలిపారు. ‘ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెస్తే రూ.10 కోట్లు నగదు బహుమతిగా ఇస్తా. ఈ నగదు ఇంకా పెంచుతా. అలా చేయడానికి ఎవరూ సాహసించకపోతే నేనే అతడ్ని చంపుతా ’ అని అయోధ్య తపస్వి చావ్నీ ఆలయ ప్రధాన పూజారి అన్నారు. అయితే పరమహంస ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో రామ్​చరిత మానస్‌పై సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలు, బాలీవుడ్ బాద్‌షా నటించిన పఠాన్‌ సినిమాలో దీపికా పదుకునే కాషాయ రంగు బికినీ వివాదంపై కూడా ఇలాంటి ప్రకటనలే చేశారు. అయితే.. పరమహంస వ్యాఖ్యలకు తాను భయపడేది లేదని ఉదయనిధి స్పష్టం చేశారు.