అదానీపై రాహుల్​ఫైర్​

అదానీపై రాహుల్​ఫైర్​
  • పార్లమెంట్​విచారణ కమిటీతో విచారణకు డిమాండ్​
  • పత్రికా కథనంపై ప్రధాని మౌనమేల?

ముంబై : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం మరోసారి అదానీ గ్రూప్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలపై ఫైర్​ అయ్యారు. అదానీ -మోదీ మధ్య సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అదానీ గ్రూప్ అక్రమాలపై సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘం చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు ముంబై వచ్చిన గాంధీ మీడియాతో గురువారం మాట్లాడారు. ప్రతిపక్ష ఇండియా కూటమి పక్షాల నేతలు గురు, శుక్రవారాల్లో ముంబైలో సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన గురువారం మాట్లాడుతూ, ఓసీసీఆర్పీ నివేదికను ప్రస్తావిస్తూ, అదానీ గ్రూప్ అక్రమాలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత సవివరమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్ సమస్యను లేవనెత్తినపుడు మోదీ అసౌకర్యంగా, ఆందోళనగా కనిపిస్తారని ఆరోపించారు. ఈ విషయాలు ఆయనకు చాలా సన్నిహితమైనవన్నారు. అదానీ-మోదీ మధ్య సంబంధాలేమిటని నిలదీశారు. మోదీతో అదానీ గ్రూప్‌నకు సంబంధాలు ఉన్నాయని ఓ పత్రికా కథనాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సమస్యపై మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నారు. అదానీ గ్రూప్ తన షేర్లలో తానే రహస్యంగా పెట్టుబడులు పెట్టిందని ఓ పత్రిక రాసిన కథనాన్ని రాహుల్ ప్రస్తావించారు. ఏం జరుగుతోందో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టంగా వివరించడం చాలా ముఖ్యమన్నారు. అదానీ గ్రూప్‌ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయని, ఇది ఎవరి సొమ్ము అని నిలదీశారు.

ఇద్దరు విదేశీ పెట్టుబడిదారుల ద్వారా అదానీ గ్రూప్ కంపెనీల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఓసీసీఆర్‌పీ నివేదిక ఆరోపించింది. పారదర్శకత లేని మారిషస్ నిధుల ద్వారా అదానీ గ్రూప్ బహిరంగంగా ట్రేడ్ అవుతున్న స్టాక్స్‌లోకి పెట్టుబడులను తీసుకొస్తోందని, అదానీ కుటుంబ సభ్యుల వ్యాపార భాగస్వాముల అస్పష్టమైన ప్రమేయం దీనిలో ఉందని ఆరోపించింది.ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. జార్జ్ సొరోస్ నిధులతో నడుస్తున్న సంస్థలు పాత పాటనే మళ్లీ పాడుతున్నాయని దుయ్యబట్టింది. ఇవన్నీ రీసైకిల్డ్ ఆరోపణలని వ్యాఖ్యానించింది. తెర మరుగున ఉన్న మదుపరులు ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. విలువ లేని హిండెన్‌బర్గ్ నివేదికను పునరుద్ఘాటిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.