తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు ఇవ్వబోయి ఆగిన సుప్రీంకోర్ట్

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు ఇవ్వబోయి ఆగిన సుప్రీంకోర్ట్

ఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌  బిల్లులను ఆమోదించడంలేదంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఇందుకు సంబంధించి గవర్నర్‌కు నోటీసులు జారీ చేసేందుకు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం తొలుత సిద్దపడింది. కానీ గవర్నర్‌కు నోటీసులు ఇవ్వవద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తి చేయడంతో కోర్ట్ వెనక్కి తగ్గింది.  గవర్నర్‌కు, కేంద్రానికి నోటీసులు ఇస్తే అది తప్పుడు సంప్రదాయానికి దారి తీస్తుందని, గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనదని, అటువంటి వారికి నోటీసులు ఇవ్వడం సరికాదని తుషార్ మెహతా సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న బిల్లులలో కొన్నింటిని కొద్ది రోజుల క్రితమే పంపారని... అసలు విషయం ఏమిటో తెలుసుకొని కోర్టుకు నివేదిస్తానని చెబుతానన్నారు.  దీంతో వచ్చే  సోమవారం కల్లా కోర్టుకు వివరాలు చెప్పాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. కాగా ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ వెంటనే ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ సర్కారు పిటిషన్‌లో కోరిన విషయం తెలిసిందే.