అగ్నిప్రమాదంలో 63 మంది మృతి

అగ్నిప్రమాదంలో 63 మంది మృతి
  • 40 మందికి గాయాలు

జొహెన్నెస్​బర్గ్: దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జోహన్నెస్‌బర్గ్‌ సిటీలోని ఓ బిల్డింగ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ అగ్నిప్రమాదంలో 63 మంది మరణించగా,40 మందికి పైగా గాయాలతో చికిత్స పొందుతున్నారని స్థానిక మీడియా తెలిపింది. అర్థరాత్రి దాటాక అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు తెలిపింది. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై కారణాలు తెలియరాలేదు. జోహన్నెస్‌బర్గ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రతినిధి రాబర్ట్ ములౌడ్జీ మాట్లాడుతూ.. గురువారం ఉదయం నగరంలోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఒక భవనం దగ్ధమైందని, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉందని, ఇప్పటివరకు 63 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. సెర్చ్ అండ్ రికవరీ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. భవనం నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పాట్ కి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి రాగా, భవనమంతా దట్టమైన పొగ అలుముకొని సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్స్‌ కొనసాగుతున్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా తెలిపింది.